బ్రేకింగ్ న్యూస్….భారతీయులకు బాగా ఇష్టమైన పదం. ఆ విషయం తెలుసు కాబట్టే మీడియా వాళ్ళు కూడా బ్రేకింగ్ న్యూస్‌ల కోసం చకోర పక్షుల్లా ఎదురుచూస్తూ ఉంటారు. లేకపోతే బ్రేకింగ్ న్యూస్‌లను క్రియేట్ చేయడానికి కూడా వెనుకాడరు. మరి అలాంటి బ్రేకింగ్ న్యూస్‌ని సాక్షాత్తూ ప్రధానమంత్రే చదివితే…అది కూడా మోడీలాంటి బహుళ ప్రజాదరణ ఉన్న ప్రధాని అయితే…ఆ కిక్కు ఎలా ఉంటుంది? అందుకే అందరూ కూడా భారతదేశం అభివృద్ధి చెందిన దేశం అయిపోయింది అనేస్థాయి భ్రమల్లోకి వెళ్ళిపోయారు. క్రికెట్ బ్యాట్ కొనుక్కుని గ్రౌండ్లో అడుగెట్టిన మొదటి రోజే టెండూల్కర్లు అయిపోయినట్టుగా కలలు కనేవాళ్ళలాగా అయిపోయింది పరిస్థితి. అయితే ఆ కిక్కులో ఎల్లకాలం ఉండటం సాధ్యం కాదు కదా. అందుకే ఇప్పుడు వాస్తవాలు బోధపడుతున్నాయి. అందుకే ఆ క్రెడిట్లో నాకూ భాగం ఉంది అని మొదటి రోజు అన్నవాళ్ళందరూ కూడా ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. నరేంద్రమోడీ కూడా పూర్తిగా డిఫెన్స్‌లో పడిపోయాడు. అందుకే ‘నన్ను చంపేస్తారేమో…’ అనే భారీ డైలాగ్‌తో నేను చాలా పెద్ద డెసిషన్‌ని, చాలా ధైర్యంగా తీసుకున్నాను అని ఇంకా ఎక్కువ భ్రమలు కల్పించే ప్రయత్నాలతో పాటు, సానుభూతి రాజకీయాలకు కూడా తెరలేపాడు.
నోట్ల రద్దు విషయం గురించి ప్రతిపక్షాలు అడుగుతున్న ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పే ధైర్యం అధికారంలో ఉన్నవాళ్ళకు లేదు. షరా మామూలుగా ఎదురుదాడి మంత్రాన్ని జపిస్తున్నారు. నోట్ల రద్దు గురించి మోడీతో పాటు ఇంకో ఇద్దరు ముగ్గురికి మాత్రమే తెలుసు అన్నారు. కానీ బిజెపిలో ఉన్న కింది స్థాయి నేతలు కూడా ప్రధాని నిర్ణయం ప్రపంచానికి తెలియడానికి మూడు రోజులు ముందే ట్విట్టర్లో చాలా క్లియర్‌గా పోస్ట్‌లు పెట్టేశారు. కొత్త నోట్ల కట్టల ఫొటోలు కూడా పోస్ట్ చేశారు. ఆ పోస్ట్లన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉన్నాయి. అలాగే ఆరు నెలలు అధ్యయనం చేశాం అని చెప్తున్న ‘ఛాయ్ వాలా’ మోడీవారికి సామాన్యుల కష్టాల గురించి కనీస స్థాయి అవగాహన కూడా ఎందుకు లేకుండా పోయింది. భారతదేశంలో రోజుకు ఎన్ని రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతాయి? ఎన్ని డెలివరీ కేసులు ఉంటాయి? ఇంకా అత్యవసరంగా డబ్బులు అవసరమైన వాళ్ళు ఎంతమంది ఉంటారు? అసలు నెట్ బ్యాంకింగ్ అంటే ఏంటో తెలియని వాళ్ళు ఎన్ని కోట్ల మంది? లాంటి విషయాలపైన మోడీ ప్రభుత్వానికి కనీస స్థాయి అవగాహన కూడా లేకుండా పోయిందా? పెద్ద నోట్లను కాల్చేస్తున్నారు, నల్ల రాకాసులకు నిద్ర పట్టటంలేదు లాంటి సినిమాటిక్ డైలాగులకు అభిమానులు రంకెలెయ్యొచ్చు కానీ వాస్తవ పరిస్థితులపైన అవగాహన ఉన్నవాళ్ళకు మాత్రం ఓ మంచి నిర్ణయాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో మోడీ దారుణంగా ఫెయిల్ అయ్యాడన్న విషయం అవగతమవుతూనే ఉంది. వాస్తవ పరిస్థితులు అర్థం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి మూడు రోజులు పట్టింది. వ్యతిరేకత ఏ స్థాయిలో ప్రబలుతుందో తెలుసుకున్నాక ప్రత్యామ్నాయ చర్యలకు, సానుభూతి రాజకీయాలకు తెరలేపారు. బడా బడా నల్ల రాకాసులకు నిద్దర్లు పట్టటం లేదని మోడీ చెప్తున్న మాట నిజమో కాదో తెలియడం లేదు కానీ సామాన్యులను మాత్రం భయాందోళనలకు గురిచేశారన్నది వాస్తవం. గ్రామీణ ప్రజల సమస్యలను రిపోర్ట్ చేయడాన్ని ఎప్పుడో వదిలేసింది మన మీడియా. ఇప్పుడు కూడా ఎటిఎంల దగ్గర క్యూలలో నిలబడి ఉన్న వాళ్ళ సమస్యలు గురించి రాస్తున్నారు. మరి ఎటిఎం కార్డు కూడా లేనివాళ్ళు, బ్యాంక్ అకౌంట్స్ లేనివాళ్ళ పరిస్థితి ఏంటి?
టెర్రరిస్టులు, మావోయిస్టుల ఆర్థిక బలం తగ్గుతుంది అన్న కోణంలో అయినా ఈ నోట్ల రద్దును వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. కానీ మోడీ ప్రభుత్వం పర్యావసానాలను అంచనా వేయడంలో, ప్రత్యామ్నయాలను చూపడంలో దారుణంగా విఫలమైన మాట మాత్రం వాస్తవం.