దేశంలో ఉన్న మిగతా రాజకీయ పార్టీలు, నాయకుల విషయంలో ఎలా ఉన్నా కమ్యూనిస్ట్ పార్టీలు, నాయకులు అంటే మాత్రం ప్రజలకు కాస్త గౌరవం ఉండేది. అది కూడా వాళ్ళు ఇప్పటి వరకూ అధికారంలోకి రాని రాష్ట్రాల్లో కాస్తంత ఎక్కువ గౌరవం ఉండేది. ఓట్లు వేసి అధికారం అప్పగించకపోయినా, మన కోసం పోరాడుతున్నారన్న ప్రజల సానుభూతి కూడా అందుకు ఓ ప్రధాన కారణం. అధికారంలోకి వచ్చే విషయం ఎలా ఉన్నా ఓ దశాబ్ధం క్రితం వరకూ కూడా కమ్యూనిస్టుల ఓట్ షేర్ ఎప్పుడూ స్థిరంగా ఉండేది. అయితే ఒకటి రెండు ఎమ్యెల్యే స్థానాల కోసం స్వార్థ రాజకీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం, బిజెపిని విమర్శించే క్రమంలో మత రాజకీయాలను ప్రోత్సహించడం లాంటి చర్యలతో ఎక్కువ మంది ప్రజలకు దూరమయ్యారు.
మావోయిస్టుల ఎన్కౌంటర్స్ విషయంలో కూడా కమ్యూనిస్టులకు ఓ స్పష్టమైన విధానం అంటూ ఏమీ ఉండదు. ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా…. రెగ్యులర్ రాజకీయనాయకుల్లాగే, కనీస సమాచారం కూడా తెలుసుకోకుండానే ఖండించడం మాత్రం చేస్తూ ఉంటారు. ఆ ఎన్కౌంటర్ బూటకమని విమర్శలు చేయడం లాంటివి మాత్రం గత కొన్ని దశాబ్ధాలుగా చేస్తూనే ఉన్నారు. ఎన్కౌంటర్ బూటకమా? కాదా? అన్న విషయం పక్కన పెడితే మావోయిస్టుల విషయంలో పోలీసుల చర్యలు, ప్రతిచర్యలు ఎలా ఉండాలో వీళ్ళు చెప్పగలరా? మావోయిస్టులు ఎటాక్ చేసినప్పుడు మాత్రమే పోలీసులు కౌంటర్ ఎటాక్ చెయ్యాలా? లేక వాళ్ళ ఆచూకీ తెలిసినప్పుడు పోలీసులే ఎటాక్ చెయ్యొచ్చా? చట్టసమ్మతమా? కాదా? అన్న విషయం పక్కన పెట్టినా కనీసం ప్రజామోదం ఉండే సిద్ధాంతాలను వీళ్ళు ఏమైనా చెప్పగలరా? పోలీసులు దొంగదెబ్బ తీసి మావోయిస్టులను చంపేశారని చాలా మంది చాలా రకాలుగా మాట్లాడేస్తూ ఉన్నారు. మరి మావోయిస్టులు చేస్తోంది ఏంటి? వాళ్ళు కూడా దొంగదెబ్బలే కదా కొడుతోంది. అలాంటప్పుడు అన్నీ తెలిసిన ప్రజలు ఎలా ఆలోచించాలి? ఆ ప్రజల ఆలోచనలు మొద్దుబారిపోయాయని, స్పందించడం లేదని మావోయిస్టు సానుభూతిపరులు నిందారోపణలకు దిగడమెందుకు? అసలు సామాన్య ప్రజలు ఎవరైనా సరే మావోయిస్టులకు ఎందుకు సపోర్ట్ చేయాలి? ఆ ప్రజల కోసం మావోయిస్టులు చేసిందేంటి? మరీ ముఖ్యంగా ఈ దశాబ్ధకాలంలో మావోయిస్టుల వళ్ళ ప్రజలకు ఒనగూరిన ఓ గొప్ప ప్రయోజనం ఏంటో చెప్పమనండి. కమ్యూనిస్టులకు కూడా ఈ ప్రశ్న వర్తిస్తుంది. గత పదేళ్ళలో వాళ్ళు చేసింది కూడా ఏమీ లేదు. అందుకే ప్రజలకు దూరమయ్యారు. ఇప్పుడు మాత్రం ప్రజలు స్పందించడం లేదని వాపోతున్నారు.
ఇక కమ్యూనిస్టు పార్టీల నాయకుల సిద్ధాంతాలు ఏ స్థాయికి దిగజారుతున్నాయో చెప్పడానికా అన్నట్లుగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఓ కొత్త రాజకీయ సిద్ధాంతాన్ని చెప్పుకొచ్చారు. కుల సంఘాలు రాజకీయంగా ఎదగాలట. ఆ కుల సంఘాలు రాజకీయంగా ఎదిగినప్పుడే అద్భుతాలు ఏవో సాధ్యమవుతాయని ఆయన చాలా గొప్పగా చెప్పుకొచ్చారు. మిగతా రాజకీయ పార్టీలన్నింటికీ కూడా అధికారమే పరమావధి అన్న ఓ సిద్ధాంతమన్నా తగలడింది. అసలూ ఏ సిధ్ధాంతమూ లేని పార్టీలు మాత్రం కమ్యూనిస్టులు ఒక్కరేనేమో. మనతో కయ్యానికి కాలుదువ్వుతున్న చైనాను సమర్ధించడం, మత రాజకీయాలు అని మాట్లాడుతూ బిజెపి కంటే ఎక్కువగా వీళ్ళే మత రాజకీయాలు చేస్తూ ఉండడం, ఒకటి రెండు ఎమ్యెల్యే సీట్ల కోసం కక్కుర్తి పడి సిద్ధాంతాలను గాలికొదిలేసి రెగ్యులర్ పార్టీలతో పొత్తుల కోసం అంగలార్చడం, ఎన్కౌంటర్లు జరిగినప్పుడు వాటిని ఖండించడంలాంటివి తప్పితే కమ్యూనిస్టులు ఆచరిస్తున్న వేరే సిద్ధాంతాలేంటో ఆ పార్టీల కార్యకర్తలకు కూడా తెలియదు.
ఇంతకు ముందు కొంత కాలం వరకూ పెట్రోల్ రేట్లు, కరెంట్, బస్ ఛార్జీలు పెరిగినప్పుడు మాత్రం కాస్త హడావిడి చేసి జనాల మెప్పుపొందేవారు. ఇప్పుడు అలాంటి ఆందోళనలకు కూడా తిలోదకాలిచ్చేసి పూర్తిగా ప్రజలకు దూరమయిపోయారు. ఇక ఆ ప్రజలు ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఎందుకు చేయాలి?