మార్పుని అర్ధం చేసుకోవడం, ఆమోదించడం మనుషులకైనా, సంస్ధలకైనా తేలిక కాదు. ఇది రాజకీయాలకూ, వ్యాపారాలకూ వర్తిస్తుంది. టాటా కంపెనీ చైర్మన్ ను తొలగింపులో, ఉత్తరప్రదేశ్ లో ములాయం కుటుంబంలో రేగిన చిచ్చులో మూలసూత్రం ఇదే! గ్లోబలైజేషన్ వల్ల మారిన, మారుతున్న ధోరణుల ప్రభావం కూడా ఈ రెండు సంఘటనల్లో కనబడుతున్నది.
వ్యాపారానికైనా, రాజకీయాలకైనా ఒక యు ఎస్ పి (యూనిక్ సెల్లింగ్ పాయింట్) వుంటుంది. దానినుంచి దూరమైనపుడు,దానితో విబేధించినపుడు దారులు మారి సమస్యలు తల ఎత్తుతాయి. టాటా సంస్ధలో ఇదే జరిగింది. ఉత్తరప్రదేశ్ లో ఇదే జరుగుతోంది.
నూటయాభై ఏళ్ళ చరిత్రవున్న టాటా కంపెనీ కుటుంబ వారసత్వ సాంప్రదాయాలను పక్కన పెట్టి మేనేజిమెంటు నిపుణుడైన సైరస్ మిస్త్రీని సంస్ధ చైర్మన్ గా నాలుగేళ్ళ క్రితం నియమించుకుంది. 2025 సంవత్సరం వరకూ సాధించవలసిన లక్ష్యాలతో విజన్ డాక్యుమెంటుని రూపొందించుకుంది. ధార్మికత, ఉద్యోగుల సంక్షేమం తనస్వభావంగా, తనతత్వంగా టాటా సంస్ధ వ్యాపారాలు చేస్తూంది.
సైరస్ మిస్త్రీ టాటా సంస్ధల లాభదాయకతను పెంచారు. నష్టాల్లో వున్న టాటా సంస్ధల నాన్ పెర్ఫార్మింగ్ మూలాలను విశ్లేషిస్తూ వాటిని వొదిలించుకోవడమో, అలాగే వుంచేయడమో చేస్తూ వచ్చారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బిలిటీగా టాటా సంస్ధలు ఇచ్చే విరాళాలను తగ్గించారు. ఇవన్నీ గ్లోబల్ పోటీలో ముందు వుండటానికి, నిలదొక్కుకోడానికి తీసుకున్న చర్యలుగానే మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే మిస్త్రీ సారధ్యం రతన్ టాటాకు, ఆయన ఫిలాసఫీని అనుసరించే ఇతర బోర్డు డైరక్టర్లకు నచ్చలేదు. ఫలితంగా ఆయన చైర్మన్ పదవినుంచి దిగిపోవలసి వచ్చింది. భారతదేశపు కార్పొరేట్ రంగంలో ఒక కుదుపు లాంటి ఈ సంఘటనను గ్లోబలీకరణ ఫలితంగా ఏర్పడిన పోటీ నియమాలకు, టాటా సంస్ధల ఫిలాసఫీకి మధ్య వైరుధ్యంగానే అర్ధం చేసుకోవాలి.
ములాయం సింగ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీకి ఉత్తర ప్రదేశ్ లో యునీక్ సెల్లింగ్ పాయింట్ కులమే! ఒకోసారి ఒకో కులంతో జతకట్టి కొత్త కొత్త కెమిస్ట్రీలు ఏర్పరస్తూ రాజకీయ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నది.
సమాజంలో విద్య, కమ్యూనికేషన్ల విస్తృతి వల్ల (యువతలోనైనా) కులభావనలు తగ్గుముఖం పట్టే పరిస్ధితులు వికసిస్తున్తాయి. సుఖవంతమైన జీవితం కోసం కుల,మత,ప్రాంత, వయో,లింగ బేధాలకు అతీతంగా ఆదాయాలు పెంచకునే ప్రయత్నాల వల్ల ఆర్ధికంగా పేదలు దిగువ మధ్య తరగతి వారుగా, దిగువ మధ్య తరగతి వారు మధ్యతరగతి వారుగా, మధ్యతరగతివారు ఎగువ మధ్యతరగతి వారిగా ఎదగడం చిన్నగా మొదలైంది.
ములాయం సింగ్ యాదవ్ కొడుకు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ దీన్ని గుర్తించారు. మధ్యతరగతి వారిని ఆకర్షించడానికి ప్రభుత్వంలో మార్పులు మొదలు పెట్టారు. కులమే బలంగా పాతుకుపోయిన పార్టీ పెద్దలకు ఇది తమను పక్కనపెట్టే చర్యగా భావిస్తున్నారు. వత్తిడి పెరగడంతో ములాయం రంగంలో దిగారు. పార్టీ యు ఎస్ పి ని కుమారుడు మార్చేస్తున్నారన్నది ఆయన ఆందోళన. దిద్దుబాటు మొదలు పెట్టారు. ఇందులో వాస్తవికత కంటే తండ్రీకొడుకుల సంబంధాలు, కుటుంబ మర్యాదలే ప్రధానంగా పనిచేశాయి.
వెళ్ళిపోయిన నలుగురు మంత్రులనూ వెనక్కి తీసుకుంటూండటం ద్వారా యుపిలో కులం యు ఎస్ పి ని ప్రస్తుతానికి నిలబెట్టుకోగలిగారు.
ఎన్నికల నాటికి ఇది ఎటు దారితీస్తూందో వేచి చూడాలి!!