చీఫ్ జ‌స్టిస్‌ చెప్పింది చేయండి

పేరు సుబ్బారావు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్. ఇల్లు కొనుగోలుకు బ్యాంకులో 25 లక్షలు అప్పుచేశాడు. దాచుకున్న 15 లక్షలు కలిపి ఇల్లు కొనుక్కున్నాడు. రెండేళ్ళకు రెసిషన్ కారణంగా ఉద్యోగం కోల్పోయాడు. ఇంటి రుణం చెల్లించలేకపోయాడు. బ్యాంకు నుండి నోటీసులొచ్చాయి. ఆర్థికంగా బాగోలేక పోవడంతో స్పందించలేకపోయాడు. కొన్నాళ్ళ‌కు నీ ఫొటో పేప‌ర్లో పడిందంటూ స్నేహితుడి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. వెంటనే పేపర్ తీసిన సుబ్బారావు సిగ్గుతో చితికిపోయాడు. ఎగవేతదారుడంటూ బ్యాంకు ఇచ్చిన ప్రకటనలో అతని ఫొటో కనిపించింది.

ఓ ప్రముఖ పారిశ్రామిక వేత్త 100 కోట్ల రుణం తీసుకున్నాడు. ఆయన మాత్రం దర్జాగా కారులో తిరుగుతున్నాడు. బ్యాంకు అతని జోలికి వెళ్ళలేదు. పైగా ఆయ‌న కొత్త‌గా వేరే చోట రుణాలు చేస్తూనే ఉన్నాడు. బ్యాంకులు అప్పులిస్తూనే ఉన్నాయి. కొత్త‌కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తూనే ఉన్నాడు. త‌గ్గ‌ట్టుగా ల‌బ్ధి పొందుతూనే ఉన్నాడు. బ్యాంకులు నోటీసులిస్తూనే ఉన్నాయి. ఆయ‌న లాయ‌ర్ వాటికి జ‌వాబులు పంపుతూనే ఉన్నాడు. కానీ ఆయ‌న ఫొటోతో ప్ర‌క‌ట‌నిచ్చే ధైర్యం మాత్రం బ్యాంకు చేయ‌లేదు.

ఈ దేశంలో సుబ్బారావులాంటి వాళ్ళు లక్ష‌ల్లో ఉంటే.. పారిశ్రామిక‌వేత్త‌లు వేల‌ల్లో ఉన్నారు. నిజానికి దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ కుదేల‌య్యేది పారిశ్రామిక‌వేత్త‌ల వ‌ల్ల‌నే. సుబ్బారావు లాంటి వారిల్లు వేలం వేసేసి, రుణాన్ని రాబ‌డ‌తారు. పారిశ్రామిక‌వేత్త‌ల పేర్లు కూడా బ‌య‌ట‌కు రావు. అవి కోర్టుల వ‌ర‌కే ప‌రిమిత‌మ‌వుతాయి. అత్యున్న‌త న్యాయ‌స్థానం ప్ర‌ధాన న్యాయ‌మూర్తి టిఎస్ ఠాకూర్ సోమ‌వారం నాడు విచార‌ణ సంద‌ర్భంగా చేసిన వ్యాఖ్య దీనికి ఎంతో ద‌గ్గ‌ర‌గా ఉంది. 500 కోట్ల రూపాయ‌లు పైగా రుణం తీసుకుని ఉద్దేశ‌పూర్వ‌కంగా ఎగేసిన వారి వివ‌రాల‌ను సీల్డ్ క‌వ‌రులో అందుకున్న ఆయ‌న ఇదే ప్ర‌శ్న వేశారు. ఇలా ఎగేసిన 87మంది పేర్ల‌ను ఎందుకు బ‌హిర్గ‌తం చేయ‌ర‌ని ప్ర‌శ్నించారు. ప‌బ్లిక్ డొమైన్ల‌లో పెట్టాల‌ని సూచించారు. రిజ‌ర్వు బ్యాంకు ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల ప్ర‌యోజ‌నం గురించి ఆలోచిస్తోంద‌నీ, అలాకాకుండా దేశం గురించి ఆలోచించాల‌నీ ఠాకూర్ కోరారు. దీనికి స‌మాధానంగా కేంద్రానికి దీనితో సంబంధం లేద‌నీ ఆర్బీఐకీ బ్యాంకుల‌కూ మ‌ధ్య వ్య‌వ‌హార‌మ‌నీ సిలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ ఇందుకు స‌మాధాన‌మిచ్చారు.

సుబ్ర‌హ్మ‌ణ్యం విఎస్ కూచిమంచి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com