గత రెండేళ్ళలో చాలా మంది కాంగ్రెస్, తెదేపా నేతలు, ఎమ్మెల్యేలు తెరాసలో చేరిపోయారు. అధికార పార్టీ కనుక అందులో చేరడం అప్పుడు చాలా గొప్పగానే కనిపించి ఉండవచ్చు. కానీ ముఖ్యమంత్రి కెసిఆర్ తో సహా తెరాస మంత్రులు, నేతలు పదేపదే గత కాంగ్రెస్, తెదేపా ప్రభుత్వాలని, ఆ పార్టీ నేతలని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుంటే తెరాసలో చేరిన కాంగ్రెస్, తెదేపా నేతలు అందరూ భుజాలు తడుముకోవలసివస్తోంది. కాంగ్రెస్, తెదేపా ప్రభుత్వాలు అంటే ప్రస్తుతం తెరాసలో ఉన్న కాంగ్రెస్, తెదేపా నేతలు కూడా దానిలోకే వస్తారు కనుక ఆ తిట్లన్నీ వారికీ వర్తిస్తాయి. తమ సమక్షంలోనే తెరాస నేతలు, మంత్రులు కాంగ్రెస్, తెదేపాల పేరుతో తిట్టిపోస్తుంటే తెరాసలో చేరినవారు అందరూ కిక్కురుమనలేకపోతున్నారు. పోనీ వారితో తాము కూడా గొంతు కలిపి కాంగ్రెస్, తెదేపాలని, గత ప్రభుత్వాలని విమర్శించి తిట్టిపోద్దామనుకొంటే, అది తమని తాము తిట్టుకొన్నట్లే అవుతుంది. ఇక కాంగ్రెస్,తెదేపా నేతల చేరికతో పదవులు దక్కించుకోలేని తెరాస నేతలు ఈ అవకాశాన్ని బాగా సద్వినియోగం చేసుకొని, కాంగ్రెస్, తెదేపాలని కసితీరా తిట్టిపోస్తుంటే తెరాసలో చేరిన వారందరూ కక్కలేక మింగలేక బాధపడుతున్నారు.
అయితే తెరాసలో చేరిన కాంగ్రెస్ నేతలతో పోలిస్తే తెదేపా నేతల పరిస్థితి ప్రస్తుతానికి కొంత మెరుగుగానే కనిపిస్తోంది. ఎందుకంటే, ప్రస్తుతం రాష్ట్రంలో రేవంత్ రెడ్డి తప్ప తెదేపా నేతలెవరూ తెరాస ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ప్రభుత్వాలు ఘర్షణపాడినప్పుడు తెరాసలో చేరిన తెదేపా నేతలు, ఎమ్మెల్యేలకి కూడా మళ్ళీ ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితే ఎదురవుతుంటుంది.
ప్రస్తుతం టీ-కాంగ్రెస్ పార్టీ తెరాస ప్రభుత్వంపై కత్తులు దూస్తోంది. కనుక దాని హడావుడి పెరిగే కొద్దీ తెరాస మంత్రులు కూడా అంతే దీటుగా దానిపై విరుచుకు పడుతుంటారు. అప్పుడు తెరాసలో చేరిన కాంగ్రెస్ నేతలు మొహాలు చాటేయక తప్పదు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నిత్యం మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన కే కేశవ్ రావు, డి. శ్రీనివాస్ వంటి సీనియర్ నేతల నోళ్ళకి, చెవులకి కూడా తాళాలు వేసుకొని కూర్చోకతప్పడం లేదు. వారి పరిస్థితి చూస్తుంటే జనాలకే కాదు వారి మీద వారికే జాలి కలుగుతోంది. మంత్రులు హరీష్ రావు, ఇంద్ర కరణ్ రెడ్డి తదితరులు గత కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుంటే, తెరాసలో చేరిన కాంగ్రెస్ మాజీ పి.సి.సి. అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ముఖ్యమంత్రి కెసేఎఅర్ నేతృత్వంలో మాత్రమే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని సర్టిఫై చేయవలసి వస్తోంది.