తమిళనాడు రాజకీయాల్లో 2026 అసెంబ్లీ ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది. ముఖ్యంగా డీఎంకే నేతృత్వంలోని కూటమిలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వ్యూహాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీని ఒక తురుపు ముక్కగా చూపిస్తూ, డీఎంకేపై ఒత్తిడి పెంచేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.
టీవీకే సాకుతో కాంగ్రెస్ బేరసారాలు
తమిళనాడులో దశాబ్దాలుగా డీఎంకే వెంటే నడుస్తున్న కాంగ్రెస్‌కు ఈ సారి పట్టు పెంచుకోవాలన్న కసి కనిపిస్తోంది. గత ఎన్నికల్లో కేటాయించిన 25 సీట్ల కంటే ఎక్కువ సుమారు 35-45 సీట్లు కావాలని, అలాగే ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉండాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది. ఈ డిమాండ్లను డీఎంకే తిరస్కరిస్తే.. తమకు విజయ్ రూపంలో మరో ప్రత్యామ్నాయం ఉందనే సంకేతాలను కాంగ్రెస్ నేతలు చాకచక్యంగా పంపుతున్నారు. టీవీకే తలుపులు తెరిచి ఉన్నాయన్న ప్రచారాన్ని డీఎంకేను బ్లాక్ మెయిల్ చేయడానికి ఒక అస్త్రంగా వాడుకుంటున్నట్లు కనిపిస్తోంది.
విజయ్ ఇమేజ్ – కాంగ్రెస్ ఓటు బ్యాంక్
నటుడు విజయ్ స్థాపించిన టీవీకేకు యువతలో విపరీతమైన క్రేజ్ ఉంది. దాదాపు 15-20 శాతం ఓటు బ్యాంకును ఆ పార్టీ ప్రభావితం చేయగలదని అంచనా. అయితే, క్షేత్రస్థాయిలో పార్టీని నడిపించే బలమైన రాజకీయ ముఖాలు ఆ పార్టీలో తక్కువ. ఒకవేళ కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీ జతకడితే, అది టీవీకేకు రాజకీయంగా పెద్ద ప్లస్ అవుతుంది. అటు కాంగ్రెస్‌కు కూడా డీఎంకే నీడ నుంచి బయటపడి తన స్వంత బలాన్ని పరీక్షించుకోవడానికి ఇది ఒక అవకాశంగా మారుతుంది. కానీ, ప్రస్తుతానికి ఇది కేవలం వ్యూహాత్మక ఎత్తుగడగానే కనిపిస్తోంది.
కాంగ్రెస్‌కు జాతీయ అవసరాలు
కాంగ్రెస్ ఎన్ని డిమాండ్లు పెట్టినా, అంతిమంగా జాతీయ స్థాయిలో ఇండియా కూటమి బలోపేతం కావాలంటే డీఎంకే మద్దతు అత్యవసరం. రాహుల్ గాంధీ, స్టాలిన్ మధ్య ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా.. కాంగ్రెస్ హైకమాండ్ చివరకు డీఎంకే చెప్పినన్ని సీట్లకే సర్దుకుపోయే అవకాశం ఉంది. బీజేపీని అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న వేళ, తమిళనాడులో బలమైన డీఎంకేను వదిలి, ఇంకా పరీక్షకు నిలబడని టీవీకేతో వెళ్లడం కాంగ్రెస్‌కు కత్తిమీద సామే అవుతుంది. విజయ్ పార్టీకి ఈ సమీకరణాల వల్ల పోయేదేమీ లేదు. తొలి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినా తన అసలు బలం ఎంతో తెలుస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ ఈసారి రాకపోయినా, భవిష్యత్తులో ఖచ్చితంగా తన వైపు వస్తుందని విజయ్ భావిస్తున్నారు. అందుకే కూటమి కోసం అర్రులు చాచకుండా, డీఎంకే-కాంగ్రెస్ మధ్య జరుగుతున్న ఈ సీట్ల సమరం ను టీవీకే నిశ్శబ్దంగా గమనిస్తోంది.
