కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ సమస్యల్ని ఎలా డీల్ చేయాలో అర్థం చేసుకోలేకపోతోంది. ముఖ్యంగా ఆక్రమణల తొలగింపు, కూల్చివేతల విషయంలో అనుసరిస్తున్న వైఖరి .. విపరీత వ్యతిరేక ప్రచారానికి కారణం అవుతోంది.ప్రభుత్వం ఖచ్చితంగా ప్రభుత్వ భూముల్లో ఆక్రమణల్నే తొలగిస్తోంది. ఈ తొలగింపు ప్రక్రియలో వ్యూహాత్మక లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆక్రమణలను తొలగించడం ప్రభుత్వ బాధ్యత అయినప్పటికీ, అనుసరిస్తున్న తీరు వల్ల ఆశించిన ఫలితం కంటే వ్యతిరేక ప్రచారం ఎక్కువగా జరుగుతోంది.
కూల్చివేతలకు ముందుగా కసరత్తు చేయాలి !
ప్రభుత్వ భూములను, చెరువులను, నాలా ప్రాంతాలను కాపాడాలనే కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పం ప్రశంసనీయమే అయినా, క్షేత్రస్థాయిలో అమలు తీరు విమర్శలకు తావిస్తోంది. ఏదైనా ఆక్రమణను తొలగించే ముందు ఒక క్రమబద్ధమైన ప్రక్రియ ఉండాలి. నోటీసులు ఇవ్వడం, ప్రజలను ఒప్పించడం, వారికి ప్రత్యామ్నాయం చూపించడం వంటివి ముఖ్యం. కానీ, రాత్రికి రాత్రి జెసిబిలతో కూల్చివేతలు చేపట్టడం వల్ల బాధితుల్లో ఆవేదన, ప్రజల్లో భయం నెలకొంటున్నాయి. దీనివల్ల ప్రభుత్వానికి రావాల్సిన మంచి పేరు కాస్తా పేదల వ్యతిరేక ప్రభుత్వం అనే ముద్రగా మారుతోంది.
ఖమ్మం భూదాన్ భూములు కూల్చివేత వ్యూహాత్మక వైఫల్యం
ఖమ్మంలో భూదాన్ భూముల విషయంలో కోర్టు ఆదేశాలతోనే ప్రభుత్వం ఆపరేషన్ చేపట్టిన తీరు తీవ్ర చర్చకు దారితీసింది. దశాబ్దాలుగా ఖాళీగా ఉన్న భూములను ఇటీవల ఆక్రమించినప్పుడు, అక్కడ శాశ్వత నిర్మాణాలు జరగకుండా ముందే అడ్డుకోవాల్సింది. కానీ, గృహాలు నిర్మించుకున్నాక ఒక్కసారిగా కూల్చివేతలు చేపట్టడం వల్ల రాజకీయ రచ్చకు అవకాశం ఏర్పడింది. ప్రజలను మానసిక సిద్ధం చేయకుండా, ముందస్తుగా విస్తృత ప్రచారం నిర్వహించకుండా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటోంది.
మూసీ ప్రక్షాళన పై వ్యతిరేక ప్రచారం
గతంలో మూసీ నది పరివాహక ప్రాంతాల్లో చేపట్టిన కూల్చివేతల విషయంలోనూ ఇదే పునరావృతమైంది. నది మధ్యలో నిర్మించిన అపార్టుమెంట్లు, అక్రమ కట్టడాలను తొలగించడం చట్టబద్ధంగా సరైనదే అయినప్పటికీ, సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ప్రభుత్వం తిప్పికొట్టలేకపోతోంది. బాధితుల పక్షాన నిలబడాల్సిన యంత్రాంగం, కేవలం కూల్చివేత యంత్రంగా కనిపిస్తుండటంతో సామాన్య జనం ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జరిగిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోకుండా అదే ధోరణిని కొనసాగించడం వల్ల ప్రభుత్వం రక్షణలో పడాల్సి వస్తోంది.
పెరుగుతున్న కమ్యూనికేషన్ గ్యాప్
ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఎంత కఠినమైనదైనా, దాని వెనుక ఉన్న ఉద్దేశాన్ని ప్రజలకు వివరించడంలో కమ్యూనికేషన్ గ్యాప్ స్పష్టంగా కనిపిస్తోంది. ఏ భూమి ఆక్రమణకు గురైంది? అక్కడ కూల్చివేతలు ఎందుకు అవసరం? అనే విషయాలను స్థానిక ప్రజలకు ముందే తెలిసేలా చేసి, వారిని తరలించేందుకు తగిన సమయం ఇవ్వాలి. అలా కాకుండా హడావిడిగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రతిపక్షాలు దీనిని మానవ హక్కుల ఉల్లంఘన గా చిత్రీకరించే అవకాశం లభిస్తోంది. ఆక్రమణలను అడ్డుకోవడంలో ప్రభుత్వం చూపిస్తున్న తెగింపు మెచ్చుకోదగ్గదే అయినా, అది మానవీయ కోణంలో సాగాలి. ప్రజలను భాగస్వాములను చేస్తూ, వారికి అవగాహన కల్పిస్తూ ముందుకెళ్తేనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది. లేకపోతే ప్రతి కూల్చివేత ఒక రాజకీయ వివాదంగా మారి, అది ఓట్ల రూపంలో ప్రభుత్వానికి నష్టం కలిగించే అవకాశం ఉంది. ఇప్పుడు అదే జరుగుతోంది.
