కాళేశ్వరంపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు మాకు చాన్సివ్వాలని బీఆర్ఎస్ నేతలు పట్టుబడుతున్నారు. అయితే ఈ డిమాండ్ అధికార పార్టీ తోసిపుచ్చింది. గతంలో తాము ఎన్నో సార్లు ప్రతిపక్షంగా ఉండి.. పలు అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు విజ్ఞప్తులు చేశామని భట్టి విక్రమార్క గుర్తు చేశారు. అప్పుడు మాకు చాన్స్ ఎందుకివ్వలేదని .. ఇప్పుడు ఎందుకు మీకు ఇస్తామని భట్టి ప్రశ్నించారు. అప్పుడు లేని సంప్రదాయం ఇప్పుడు ఎలా వస్తుందని ఆయన ప్రశ్నించడంతో బీఆర్ఎస్ పార్టీ వద్ద సమాధానం లేకుండా పోయింది.
సభలో కాళేశ్వరం రిపోర్టు పెట్టి సమగ్రంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి వివరిస్తారన్న సమాచారం బీఆర్ఎస్ వర్గాలకు ఉంది. అందుకే తమకూ అలాంటి అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ ను కలిసి ప్రత్యేకంగా లెటర్ అందించారు. గతంలో తాము ఇవ్వనప్పుడు ఇప్పుడు అడగడం కూడా ఇబ్బందే. అందుకే కేటీఆర్, హరీష్ రావు లాంటి వాళ్లు కాకుండా.. ఇతర ఎమ్మెల్యేలను పంపి అడిగించారు.
అసెంబ్లీ నిర్వహణ విషయంలో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పార్టీ మెరుగ్గా వ్యవహరిస్తోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ల పాటు అసెంబ్లీలో చర్చలు ఉండేవి కావు. వీలైనంత మందిని పార్టీలో చేర్చుకునేవాళ్లు.. మిగిలిన వాళ్లను సస్పెండ్ చేసి.. తాము చెప్పాలనుకున్నది చెప్పి ముగించే వాళ్లు . కానీ కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత అర్థవంతమైన చర్చలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ నేతలకు అవకాశాలు ఇస్తున్నారు. వారు కూడా గట్టిగానే తమ వాదనలు వినిపిస్తున్నారు.