తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎన్నికలను నిర్వహించాలా లేదా అన్న దానిపై ఎటూ తేల్చుకోలేకపోతోంది. హైకోర్టు ఇచ్చిన గడువు ఈ నెలాఖరుతో తీరిపోతుంది. ఇప్పటి వరకూ కనీసం రిజర్వేషన్లు ఖరారు చేయలేదు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినా కనీసం ప్రాసెస్ ప్రారంభించామని కోర్టుకు చెప్పే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితి కూడా ఇప్పుడు లేదు. ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు.
స్థానిక ఎన్నికల నిర్వహణపై రేవంత్ అనాసక్తి
కారణం ఏమిటన్నది తెలియదు కానీ.. సీఎం రేవంత్ రెడ్డి స్థానిక ఎన్నికలు నిర్వహించే విషయంలో అంత ఆసక్తి చూపించడం లేదు. చాలా సార్లు ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ క్యాడర్ కు పిలునిచ్చిన ఆయన .. రిజర్వేషన్ల అంశం తేలదని తెలిసి కూడా దాన్ని పట్టుకుని సాగదీస్తూనే ఉన్నారు. రిజర్వేషన్లు పెంచాలంటే.. రాజ్యాంగ సవరణ చేయాలని రేవంతే ఓ సారి అసెంబ్లీలో చెప్పారు. అంటే ఆయనకు క్లారిటీ ఉన్నట్లే. మరి ఎందుకు సాగదీస్తున్నారో పార్టీ నేతలకూ అర్థం కావడం లేదు.
ఎన్నికలు నిర్వహించేద్దామంటున్న మంత్రులు
మంత్రులు మాత్రం ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచనలో ఉన్నారు. అదే విషయాన్ని సీఎం రేవంత్ కు చెబుతున్నారు. రిజర్వేషన్లతో ముడి పెట్టుకుంటే సమస్యలు వస్తాయని స్థానిక ఎన్నికలు నిర్వహించాలని అనుకుంటున్నారు. నిజానికి స్థానిక ఎన్నికల్లో గ్రామ రాజకీయాలే ఎజెండా అవుతాయి కానీ రిజర్వేషన్లు కాదు. అందుకే.. ఫలితాలపై బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదని.. మంచి ఫలితాలే వస్తాయని మంత్రులు నమ్ముతున్నారు. ఎన్నికలకు వెళదామని.. సీఎంకు చెబుతున్నారు.
స్థానిక ఎన్నికల కోసం చూస్తున్న క్యాడర్
క్యాడర్ కు పదవులు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీకి ఉన్న ముఖ్యమైన ఆవకాశం స్థానిక ఎన్నికలు. క్యాడర్ అంతా.. గ్రామ స్థాయిలో.. మండల స్థాయిలో.. .జిల్లా స్థాయిలో అధికారం కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్ని నామినేటెడ్ పోస్టులు ఇచ్చినా.. ఈ పదవులు భర్తీ చేస్తే వచ్చే కిక్ వేరు. అందుకే క్యాడర్ ఎన్నికల కోసమే చూస్తోంది. రేవంత్ ఓకే అంటే చాలని అనుకుంటున్నారు.
