ఎప్స్టీన్ ఫైల్స్ పేరుతో ప్రధాని మోదీపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు భారత రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఈ ఫైల్స్ ద్వారా ప్రధాని మోదీని డొనాల్డ్ ట్రంప్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, అందుకే అమెరికాకు అనుకూలంగా భారత విదేశాంగ విధానం మారుతోందని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. అయితే, రాహుల్ గాంధీ , కాంగ్రెస్ పార్టీ ఎంచుకుంటున్న ఇటువంటి అంశాలు సామాన్య ప్రజలకు ఏమాత్రం కనెక్ట్ కాకపోగా, వారి రాజకీయ పరిణతిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. గతంలో ఓట్ల చోరీ, పెగాసస్ వంటి అంశాలలాగే, ప్రజల నిత్యజీవితంతో సంబంధం లేని అంతర్జాతీయ అంశాలను పట్టుకుని రాజకీయం చేయడం కాంగ్రెస్ బలహీనతగా కనిపిస్తోంది.
ఎస్ స్టీన్ ఫైల్స్ బయటపడుతున్న ట్రంప్ బాగోతం
అసలు ఎప్స్టీన్ ఫైల్స్ గురించి తెలిసిన ఎవరైనా కాంగ్రెస్ లాజిక్‌ను చూసి ఆశ్చర్యపోతున్నారు. జెఫ్రీ ఎప్స్టీన్ అనే వివాదాస్పద వ్యక్తికి సంబంధించిన ఈ కేసులో స్వయంగా డొనాల్డ్ ట్రంప్ పేరే పలుమార్లు వినిపించింది. అమెరికాలోనే ఆ ఫైల్స్ బయటకు రాకుండా ఆపడానికి ట్రంప్ ఎన్నో ప్రయత్నాలు చేసినా విఫలమయ్యారు. తన సొంత పరువునే కాపాడుకోలేక, అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్న ట్రంప్, అదే ఫైల్స్‌తో మరో దేశ ప్రధానిని బ్లాక్ మెయిల్ చేస్తారనడం హాస్యాస్పదంగా ఉంది. అమెరికా న్యాయ వ్యవస్థ, మీడియా పారదర్శకత ముందు ఎవరూ ఇటువంటి సున్నితమైన సమాచారాన్ని దాచడం దాదాపు అసాధ్యం.
ఎప్ స్టీన్‌తో అసలు మోదీకి టచ్ ఎక్కడ ఉటుంది?
మరో కీలకమైన అంశం ఏమిటంటే, ప్రధాని మోదీ పన్నెండేళ్లుగా అధికారంలో ఉన్నారు. ఆయన వ్యక్తిగత జీవితం లేదా విదేశీ పర్యటనలపై ప్రపంచవ్యాప్తంగా నిఘా సంస్థల కన్ను ఉంటుంది. ఒకవేళ ఎప్స్టీన్ జాబితాలో మోదీ పేరు ఉండి ఉంటే, అది ఎప్పుడో అంతర్జాతీయ మీడియాలో సంచలనం అయ్యేది. తనపై వచ్చే ఆరోపణలనే తుడిచిపెట్టుకోలేకపోతున్న ట్రంప్, మోదీ పేరును అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తారని అనుకోవడం ఏమిటో కాంగ్రెస్ వ్యూహకర్తలకే తెలియాలి. ఏదో ఒక వివాదాస్పద రంగు పులమాలని చూడటం తప్ప అక్కడ మరో రాజకీయంలేదు.
ప్రజలు నమ్మే రాజకీయాలు చేయవచ్చుగా!
ప్రజాస్వామ్యంలో విపక్షాలు ప్రభుత్వ విధానాలను ప్రశ్నించాలి, కానీ ఆ ప్రశ్నలు వాస్తవాలకు దగ్గరగా ఉండాలి. అగ్రరాజ్యాల మధ్య ఉండే దౌత్యపరమైన సంబంధాలను వ్యక్తిగత బ్లాక్ మెయిలింగ్ స్థాయికి దిగజార్చి చూడటం అంతర్జాతీయ వేదికపై భారతదేశ ప్రతిష్టను దెబ్బతీసే చర్య అవుతుంది. ప్రజలు నమ్మలేని, కనీస లాజిక్ లేని అంశాలను పట్టుకుని పోరాటం చేయడం వల్ల విపక్షం తన విశ్వసనీయతను కోల్పోతోంది. దేశీయ సమస్యలపై దృష్టి సారించకుండా, అర్థం పర్థం లేని విదేశీ ఫైల్స్ చుట్టూ రాజకీయం తిప్పడం కాంగ్రెస్‌కు లాభమేంటి?

