కాంగ్రెస్ పార్టీ రాను రాను పాతాళంలోకి పడిపోతోంది. రాహుల్ గాంధీ నాయకత్వం ప్రమాదకరంగా మారింది. ప్రియాంకాగాంధీ కూడా కాపాడే పరిస్థితుల్లో లేరు. సోనియా కెరీర్ అయిపోయింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ ఎలా గాడిన పడుతుంది?. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ఆలోచించాల్సిందే. రాహుల్ గాంధీని ప్రత్యర్థిగా ఉంచితే మోదీ ఎన్నిసార్లు అయినా తిరుగులేని విజయాలు సాధిస్తారు. ఆయనకు రాహుల్ కాకుండా ఇంకా బలమైన ప్రత్యర్థిని కాంగ్రెస్ ముందుకు తేవాలి. అలా తేవాలంటే ముందుగా గాంధీలు లేని కాంగ్రెస్ ను ప్రజల ముందు ఉంచితే ప్రజలే ఓ నాయకుడ్ని మోదీకి ప్రత్యామ్నాయంగా ఎంచుకునే అవకాశం ఉంది.
చీలడానికి అవకాశం లేనంతగా బక్క చిక్కిపోయిన కాంగ్రెస్
బీహార్ ఎన్నికల్లో గెలిచిన తరవాత మోదీ.. కాంగ్రెస్ నాలుగు ముక్కలవుతుందని జోస్యం చెప్పారు. మోదీ ఏ ఉద్దేశంలో అలా చెప్పారో.. లేక కాంగ్రెస్ బలంగా ఉందని ఆయన అనుకుంటున్నారో కానీ.. కాంగ్రెస్ చీలే అవకాశం లేదు. ఎందుకంటే పార్టీని చీల్చి వేరే పార్టీని పెట్టి దాన్ని బతికించేంత నాయకుడు ఆ పార్టీలో లేరు. ఉన్న వాళ్లంతా గాంధీల చేతకానితనంతో తాము పడలేమని వేరే పార్టీలు పెట్టేసుకున్నారు. 1998లో బెంగాల్ నేత మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీని వీడారు. 1999లో మహారాష్ట్ర నేత శరద్ పవార్ కూడా బయటికొచ్చారు. అవి అప్పట్లో పెద్ద చీలికలే. వారి వారి రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉనికి లేకుండా చేశారు. ఏపీలో జగన్ కూడా అలాగే చేశారు
గాంధీ కుటుంబం తప్ప మరో దారి లేదన్నట్లుగా నేతల తీరు
కాంగ్రెస్ పార్టీపై గాంధీ–నెహ్రూ కుటుంబం పట్టు తిరుగులేనిది. అదే ఆ పార్టీకి మైనస్ కూడా. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ నేతల్లో చాలా మంది గాంధీ–నెహ్రూ కుటుంబ నీడలోనే ఉండిపోవాలని అనుకుంటున్నారు. తేడా వస్తే తమకు రాజకీయ భవిష్యత్ ఉండదని భయపడుతున్నారు. ప్రజల్లో మాస్ పవర్ ఉన్న లీడర్ కూడా ఇప్పుడు కాంగ్రెస్ లో లేరు. రాహులే తమ మాస్ లీడర్ అనుకుంటున్నారు. కానీ ఆయన ఫెయిలయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ తిరిగి బలపడాలంటే అంతర్గత సంస్కరణలు తప్ప మరో మార్గం లేదు. వాటిలో మొదటి పని గాంధీ కుటుంబాన్ని వీలైనంత వరకూ పార్టీ రాజకీయాల నుంచి తప్పించడం.
గాంధీ కుటుంబం లేని కాంగ్రెస్ ను ప్రజలు ఆదరిస్తారేమో ?
అత్యంత విజయవంతమైన కాంగ్రెస్ ప్రధానులు పి.వి. నరసింహారావు , మన్మోహన్ సింగ్. వారిద్దరూ గాంధీ–నెహ్రూ కుటుంబానికి బయటివారే. కాంగ్రెస్కు వచ్చే ఓట్లలో కనీసం సగం మైనారిటీల నుంచే వస్తుంటాయి. రాను రాను వారు కూడా దూరమవుతున్నారు. బీహార్ లో మజ్లిస్ కు ఐదు సీట్లు వచ్చాయి. అంటే వారు కూడా గాంధీలపై ఆసక్తి కోల్పోతున్నారు. అందుకే ఇప్పుడు ఆ పార్టీ చేయాల్సింది నాయకత్వాన్ని మార్చుకోవడం.. పాత ఓటు బ్యాంకును తమ వైపు రప్పించుకునే నాయకత్వాన్ని ప్రోత్సహించడం. అలా చేయాలంటే ముందు గాంధీలు వైదొలగాలి. వారు లేని కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలను .. మోదీకి పోటీగా తయారు చేసుకునేందుకు ప్రజలే ఆసక్తి చూపిస్తారు. ప్రజాస్వామ్యంలో ఏ నేత అయినా ప్రజాభిమానంతో పుట్టరు. వారిని ప్రజలే తయారు చేసుకున్నారు. మోదీతో సహా. అలాంటి నేతను ప్రజలు తయారు చేసుకునే అవకాశం కాంగ్రెస్ ఇస్తే.. ఆ పార్టీ బతకడానికి అవకాశం ఉంటుంది.
