తెలంగాణలో జరగనున్న రెండు రాజ్యసభ స్థానాల ఎన్నికలు కేవలం ఏకగ్రీవాలకు పరిమితం కాకుండా, ఒక ఆసక్తికర పోరాటానికి వేదికయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీలో తగినంత సంఖ్యాబలం లేకపోయినప్పటికీ, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని రంగంలోకి దించాలని యోచిస్తోంది. అయితే ఇది గెలుపు కోసం చేసే ప్రయత్నం కంటే, అధికార కాంగ్రెస్ పార్టీని ఆత్మరక్షణలో పడేసేందుకు రచిస్తున్న వ్యూహంగా కనిపిస్తోంది. ఒక మైనార్టీ అభ్యర్థిని పోటీకి దించడం ద్వారా కాంగ్రెస్ ఓట్ల లెక్కలను చిందరవందర చేయాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
మజ్లిస్ ఓటింగ్ కు వచ్చేలా చేయాలని ప్లాన్
కాంగ్రెస్ పార్టీ తమకు దక్కే రెండు సీట్లలో ఒకటి హైకమాండ్ కోటాలో ఢిల్లీ నేతకు, మరొకటి రాష్ట్రంలోని రెడ్డి సామాజికవర్గానికి చెందిన కీలక నేతకు కేటాయించాలని భావిస్తోంది. అయితే, బీఆర్ఎస్ గనుక మైనార్టీ అభ్యర్థిని బరిలోకి దింపితే, అసలైన చిక్కు వచ్చి పడుతుంది. రెండో సీటును కాంగ్రెస్ గెలవాలంటే ఎంఐఎం పార్టీ మద్దతు అనివార్యం. ఒకవేళ బీఆర్ఎస్ మైనార్టీ అభ్యర్థిని పెట్టి, కాంగ్రెస్ రెడ్డి సామాజికవర్గ నేతను పెడితే.. మజ్లిస్ ఎవరికి మద్దతు ఇస్తుందనేది ప్రశ్నార్థకంగా మారుతుంది. మైనార్టీ అభ్యర్థిని కాదని రెడ్డి నేతకు ఓటు వేయడం మజ్లిస్‌కు ఇబ్బందికరంగా మారవచ్చు.
కాంగ్రెస్ కూడా మైనార్టీకి సీటు ఇవ్వక తప్పదా?
బీఆర్ఎస్ ప్లాన్ ప్రకారం.. ఒకవేళ మజ్లిస్ ఓట్లు తమ మైనార్టీ అభ్యర్థికి పడితే, కాంగ్రెస్ తన రెండో సీటును కాపాడుకోవడానికి తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మైనార్టీ ఓట్ల కోసం కాంగ్రెస్ కూడా తన సమీకరణాలను మార్చుకోవాల్సి వస్తుంది. అంటే, రెడ్డి సామాజికవర్గానికి ఇవ్వాలనుకున్న సీటును కాదని, బలవంతంగా మైనార్టీ నేతకే కేటాయించాల్సిన పరిస్థితిని కల్పించడమే బీఆర్ఎస్ వ్యూహం. దీనివల్ల కాంగ్రెస్‌లోని రెడ్డి ముఖ్యనేతల్లో అసంతృప్తి పెరిగి, అది పార్టీ అంతర్గత విభేదాలకు దారి తీస్తుందని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది.
పోటీపై కేసీఆర్ దే తుది నిర్ణయం
కాంగ్రెస్ హైకమాండ్ ఈ వ్యూహాన్ని ఎలా తిప్పికొడుతుందనేది ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ గనుక మైనార్టీ కార్డు ఉపయోగిస్తే, దానికి ప్రతిగా కాంగ్రెస్ ముందే అప్రమత్తమై సామాజిక సమీకరణాలను సర్దుబాటు చేస్తుందా? లేక తనకున్న బలంతోనే ముందుకు వెళ్తుందా? అన్నది చూడాలి. ఏది ఏమైనా, గెలిచే అవకాశం లేకపోయినా అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా కాంగ్రెస్‌ను ఒత్తిడిలోకి నెట్టడంలో బీఆర్ఎస్ ప్రస్తుతానికి సఫలమైనట్లే కనిపిస్తోంది. అయితే పోటీపై అన్నీ లీకులేనా.. నిజంగానే నామినేషన్ వేస్తారా అన్నది ఫైనల్‌గా కేసీఆర్ నుంచి వచ్చే సిగ్నల్ ను బట్టిఉంటుంది.
