శాసనసభ అనేది ప్రజాస్వామ్య దేవాలయం. అక్కడ మాట్లాడే ప్రతి మాట చరిత్రలో నిలిచిపోతుంది. మంగళవారం అసెంబ్లీలో జరిగిన పరిణామాలు చూస్తుంటే, జగన్ రెడ్డి సభకు వెళ్లకపోవడం వల్ల ఎంత పెద్ద అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకున్నారో అర్థమవుతుంది. టీటీడీ విషయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి జరుగుతున్న అన్యమత ప్రచారం, అక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధారాలతో సహా సభ ముందు ఉంచారు. ఒక బాధ్యతాయుతమైన వేదికపై నుంచి సాక్ష్యాలను ప్రజల ముందు పెట్టడం వల్ల అది నేరుగా జనం మెదళ్లలోకి వెళ్ళిపోయింది.
ప్రెస్ మీట్లు అసెంబ్లీకి ప్రత్యామ్నాయం కావు
చంద్రబాబు ఆరోపణల తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి వంటి నేతలు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. రేపు జగన్ రెడ్డి స్వయంగా గంటల తరబడి మీడియా ముందుకు వచ్చి తాము హిందువులమని, అపచారాలు జరగలేదని వివరణ ఇచ్చినా అది ప్రజల్లోకి బలంగా వెళ్ళదు. ఎందుకంటే మీడియా సమావేశాలకు ఉండే విలువ వేరు, అసెంబ్లీ రికార్డులకు ఉండే పవిత్రత వేరు. సభలో ప్రత్యర్థి కళ్లలోకి చూస్తూ సమాధానం చెప్పినప్పుడే ఆ మాటలకు విశ్వసనీయత ఉంటుంది.
రికార్డుల్లో నిలిచిపోయేది ప్రభుత్వ వాదనే
అసెంబ్లీలో ఒక అంశంపై చర్చ జరిగినప్పుడు అది అధికారిక రికార్డుల్లోకి వెళ్తుంది. అక్కడ విపక్ష నేతగా జగన్ ఉండి ఉంటే, ప్రభుత్వం చేసే ఆరోపణలను అక్కడికక్కడే అడ్డుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు సభలో ప్రతిపక్షం లేకపోవడంతో చంద్రబాబు చెప్పిన ప్రతి అంశం ఏకపక్షంగా రికార్డుల్లో నమోదవుతోంది. భవిష్యత్తులో టీటీడీ చరిత్రను తిరగేస్తే, జగన్ హయాంలో జరిగిన తప్పులే ప్రామాణికంగా కనిపిస్తాయి తప్ప, బయట ఆయన పెట్టుకునే ప్రెస్ మీట్లు ఎక్కడా కనిపించవు. ఈ లాజిక్ జగన్ రెడ్డి మిస్ అవ్వడం పార్టీకి పెద్ద దెబ్బ.
ప్రజల్లో పెరుగుతున్న అనుమానాలు
టీటీడీ వంటి సున్నితమైన అంశంపై ప్రభుత్వం తీవ్రమైన విమర్శలు చేస్తున్నప్పుడు, బాధ్యత గల నాయకుడిగా సభకు వచ్చి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ జగన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోవడం వల్ల, ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలన్నీ నిజమేనేమో అని సామాన్య భక్తులు భావించే అవకాశం ఉంది. తప్పు చేయనప్పుడు సభకు వచ్చి సవాల్ చేయకుండా, కేవలం మీడియా ద్వారానే యుద్ధం చేస్తానంటే అది పలాయనవాదమే అవుతుంది. జగన్ తీసుకున్న ఈ మొండి నిర్ణయం ఆయన ఇమేజ్ను మరింత పాతాళానికి పడిపోయేలా చేస్తుంది.
రాజకీయ వ్యూహంలో ఘోర వైఫల్యం
రాజకీయాల్లో ఎప్పుడూ మైదానాన్ని వదిలి వెళ్లకూడదు. అసెంబ్లీని బహిష్కరించడం ద్వారా జగన్ రెడ్డి తన గొంతును తానే నొక్కుకున్నారు. ముఖ్యమంత్రి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే ఆయన సభకు రావడం లేదనే సందేశం ప్రజల్లోకి బలంగా వెళ్లిపోయింది. వైఎస్సార్సీపీ శ్రేణులు కూడా తమ నాయకుడు సభలో ఉండి ధీటుగా సమాధానం చెబితే బాగుండేదని లోలోపల మదనపడుతున్నారు. మొత్తానికి మంగళవారం నాటి అసెంబ్లీ చర్చ జగన్ రాజకీయ అజ్ఞానాన్ని, వ్యూహాత్మక లోపాన్ని బయటపెట్టింది.
