తెలంగాణలో మున్సిపల్ , పంచాయతీ ఎన్నికల ఫలితాలు అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించిన దానికంటే పెద్ద బూస్ట్ ఇచ్చాయి. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు అధికార పక్షానికే అనుకూలంగా ఉంటాయనేది జగమెరిగిన సత్యం. అయితే, గతంలో బీఆర్ఎస్ హయాంలో ఎన్నికలు జరిగిన తీరుకు, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో జరిగిన ఎన్నికలకు స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోంది. ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం ఇచ్చిందని, ఈ ఫలితాలు నిజమైన ప్రజాభిప్రాయానికి నిదర్శనమని అనుకోవచ్చు.
దక్షిణ తెలంగాణలో తిరుగులేని హవా
ప్రస్తుత ఫలితాలను విశ్లేషిస్తే, వరంగల్, ఖమ్మం, నల్గొండ , మహబూబ్ నగర్ జిల్లాలు కాంగ్రెస్ పార్టీకి అభేద్యమైన కంచుకోటలుగా మారిపోయాయి. ఈ ప్రాంతాల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ నామమాత్రపు ఉనికికే పరిమితం అవుతోంది. ఇక్కడ ఎలాంటి ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ మెజార్టీలు మాత్రమే లెక్క పెట్టుకుంటోంది. భవిష్యత్ లో బీఆర్ఎస్ పుంజుకుంటుందా అన్న ఆశ కూడా కలగడం లేదు. బలమైన నేతలెవరూ ఆయా జిల్లాల్లో లేరు. సీనియర్లు పూర్తిగా ప్రజలకు పాతబడిపోయారు. కొత్త నాయకత్వం లేకపోవడంతో పెద్ద మైనస్. కాంగ్రెస్ ఈ అవకాశాల్ని సమర్థంగా వాడుకుంటోంది.
ఉత్తర తెలంగాణలో బీజేపీతో హోరాహోరీ
ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ ,కరీంనగర్ జిల్లాల్లో రాజకీయం భిన్నంగా ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ మూడో స్థానానికి పడిపోగా, కాంగ్రెస్ , బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగింది. హిందుత్వ ఎజెండా , కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రాతిపదికన బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. అయినప్పటికీ, పలు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ తన పట్టును నిలబెట్టుకోగలిగింది. ఈ ప్రాంతాల్లో బీజేపీ బలపడటం భవిష్యత్తులో కాంగ్రెస్‌కు సవాల్‌గా మారే అవకాశం ఉంది.
ఉమ్మడి మెదక్, గ్రేటర్ పరిధే అసలు సవాల్
కాంగ్రెస్ పార్టీకి ఇంకా సవాల్‌గా ఉన్న ప్రాంతాలు ఉమ్మడి మెదక్ జిల్లా , గ్రేటర్ హైదరాబాద్ పరిధి. సిద్దిపేట, గజ్వేల్ వంటి ప్రాంతాల్లో హరీష్ రావు, కేసీఆర్ వ్యక్తిగత ప్రభావం వల్ల బీఆర్ఎస్ ఇంకా పట్టును ప్రదర్శిస్తోంది. అలాగే, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పట్టణ ఓటర్లు ఇంకా కాంగ్రెస్ వైపు పూర్తిస్థాయిలో మొగ్గు చూపలేదు. గత అసెంబ్లీ ఎన్నికల నుంచి నేటి మున్సిపల్ ఎన్నికల వరకు బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలదే పైచేయిగా ఉంటోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్రేటర్ పరిధిలో మూడు కార్పొరేషన్లుగా విభజన నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీతో పాటు కొత్తగా సైబరాబాద్ , మల్కాజ్గిరి కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం వెనుక పరిపాలన సౌలభ్యంతో పాటు రాజకీయంగా పుంజుకోవాలనే వ్యూహం కూడా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరచుగా చెబుతున్నట్లుగా, వచ్చే టర్మ్ కూడా కాంగ్రెస్ దే కావాలంటే గ్రేటర్ ఓటర్లను ఆకట్టుకోవడం అత్యంత కీలకం.
