తెలంగాణ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించింది. మూడో విడతలో జరిగిన 2800 పైచిలుకు పంచాయతీల్లో సగానికిపైగా కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడనున్నాయి. కాంగ్రెస్ గెలుస్తున్న సంఖ్యలో సగం కంటే తక్కువగా బీఆర్ఎస్ మద్దతుదారులు విజయం సాధిస్తున్నారు. మూడో దశలోనూ బీజేపీ ఇతరుల తర్వాతే ఉంది. అయితే మరీ తీసికట్టుగా ఏమీ లేదు. పర్వాలేదనుకునే స్థాయిలోనే పంచాయతీ ఫలితాలు సాధిస్తోంది
అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు తాము ఎమ్మెల్యేలుగా ఉన్న ప్రాంతాల్లోనే కాకుండా ఇతర నియోజకవర్గాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా కాంగ్రెస్ నేతలు గట్టిగా పోరాడి విజయాలు వచ్చేలా చేసుకున్నారు. అయితే బీఆర్ఎస్ నేతలు కూడా గ్రామ స్థాయిలో తమ పట్టు జారకుండా చాలా వరకూ గట్టి ప్రయత్నాలు చేశారు. ఖర్చుకు వెనుకాడలేదు. అందుకే పాతిక శాతం పంచాయతీల్లో పాగా వేయగలిగారు. బీజేపీ కొన్ని ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి వంటి చోట్ల మంచి ఫలితాలు సాధించింది.
మూడు దశల ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ 55 నుంచి 60 శాతం పంచాయతీలను కైవసం చేసుకున్నట్లుగా భావించవచ్చు. బీఆర్ఎస్ పార్టీ 25 శాతం పంచాయతీలు.. మిగతా పంచాయతీలు.. బీజేపీ, ఇతరులు గెల్చుకున్నారు. ఇతరుల్లో ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ రెబల్స్ ఉన్నారు. మొత్తంగా గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ .. అధికార పార్టీగా పట్టు నిలుపుకుంది.
New


