ఈటల రాజేందర్‌కు కోపం వచ్చింది. ఆ కోపం ఎవరి మీదో కానీ ప్రతిపక్ష నేతగా హక్కు ఉందని ఆయన సీఎం రేవంత్ రెడ్డిని తిట్టేశారు. నిజంగానే తిట్టేశారు. ఇప్పుడు రాజకీయాల్లో విమర్శలు, తిట్లకు పెద్దగా తేడా లేకపోయింది. ఆ గీత కనిపించకుండా రాజకీయంగా విమర్శించుకుంటున్నారు. కానీ ఈటల మాత్రం రేవంత్ రెడ్డి విషయంలో విమర్శలకు, తిట్లకు గీత స్పష్టంగా కనిపించేలా బూతులందుకున్నారు. వీలైనంత సౌమ్యంగా ఉండే ఈటల రాజేందర్ లో ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు వచ్చిందో కానీ ఆయన నోటి వెంట ముఖ్యమంత్రిపై వచ్చిన మాటలు కాంగ్రెస్ నేతలకు చురుకుపుట్టించాయి. దీంతో ఆయన ఇంటిని యూత్ కాంగ్రెస్ నేతలు ముట్టడించారు.
అయినా ఈటల రాజేందర్ ఏ మాత్రం తగ్గలేదు. ఈటల రాజేందర్ పై కాంగ్రెస్ నేతలంతా విరుచుకుపడుతున్నారు. తాము ఒక్క విజిల్ వేస్తే చాలని ఈటలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ హయాంలో చేతకాని, దద్దమ్మ మంత్రులుగా ఉన్న మీకు సీఎం రేవంత్ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. బీఆర్ఎస్ నుంచి తన్ని తరిమేస్తే బీజేపీలోకి వెళ్లారు..ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రాకపోవడంతో మళ్లీ బీఆర్ఎస్ వైపు ఈటల చూస్తున్నారని అందుకే రేవంత్ రెడ్డిని తిడుతున్నారని మండిపడ్డారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు జగ్గారెడ్డి కూడా ఈటలపై మండిపడ్డారు. తాము తిరిగి తిడితే తట్టుకోలేరని హెచ్చరించారు.
ఈటెల రాజేంద్ర మీరు కమ్యూనిస్టు భావాజాలం ఉండి బీజేపీలోకి వెళ్లారని.. బీజేపీలో లెప్ట్ వింగ్ నుంచి రైట్ వింగ్‌కు పోవడం వల్ల మీ మెదడు దొబ్బినట్లు ఉందని చామల కిరణ్ మండిపడ్డారు. ఏదో అధ్యక్ష పదవి ఇస్తారని…రాష్ట్రాన్ని ఎలగబెట్టి సీఎం అవుదామని పిచ్చి ఆలోచన నడవడం లేదు ..బీజేపీ సీనియర్ నాయకులు మిమ్మల్ని ముందుకు వెళ్లనివ్వడం లేదన్నారు. మీ సమస్య అంతా బీజేపీ పార్టీలో ఉంది.. సీఎం రేవంత్ రెడ్డిని తిడితే పదవులు వస్తాయని భ్రమిస్తున్నారని మండిపడ్డారు. ఈటల రాజేందర్ ఎందుకు రేవంత్ రెడ్డిపై ఇలాంటి విమర్శలు చేశారో కానీ ఇప్పుడు కాంగ్రెస్ నేతలంతా ఆయనపై ఫైర్ అవుతున్నారు.