ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉండగా, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నివాసంలో సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమావేశం కావడం కాంగ్రెస్ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. లోక్ భవన్లో గవర్నర్ ఇచ్చిన ఎట్ హోమ్ కార్యక్రమం ముగిసిన వెంటనే మంత్రులందరూ ఒకే కారులో భట్టి నివాసానికి వెళ్లడం, అక్కడ సుదీర్ఘంగా చర్చలు జరపడం రహస్య భేటీ గా ప్రచారం పొందింది. అయితే, ఈ ప్రచారం విపక్షాల కంటే ఎక్కువగా పార్టీలోని అంతర్గత వర్గాల నుంచే రావడం గమనార్హం.
ఈ భేటీని భట్టి వర్గం ఒక బలప్రదర్శన గా మార్చుకునే ప్రయత్నం చేసిందన్న విమర్శలు కాంగ్రెస్ లోనే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో భట్టి విక్రమార్కపై వస్తున్న కొన్ని ఆరోపణలు, మీడియా లీకుల కారణంగా సీనియర్ మంత్రులందరూ తనకు అండగా ఉన్నారని చూపించుకోవడం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక పరోక్ష సంకేతం పంపేందుకు ఈ భేటీ ప్లాన్ చేసినట్లుగా అనుమానిస్తున్నారు. ఇదిరహస్య భేటీ అని ఆ మీటింగులో పాల్గొన్న మంత్రులకూ అర్థం కాలేదు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తున్నతరుణంలో ప్లాన్ గురించి మాట్లాడటానికే కలిశారు. కానీ దీన్నో బలప్రదర్శనగా.. భట్టి వర్గం చూపేందుకు ప్రయత్నించింది.
మున్సిపల్ ఎన్నికల వ్యూహరచన కోసమే కలిశామని మంత్రులు చెబుతున్నప్పటికీ, భట్టి సానుభూతిపరులైన మీడియా సంస్థలు దీనిని ఒక ప్రత్యామ్నాయ పవర్ సెంటర్ భేటీగా చిత్రీకరించడం వెనుక లోతైన రాజకీయ వ్యూహం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారం కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి కూడా వెళ్ళింది. పార్టీలోని ఒక వర్గం మాత్రం రహస్య భేటీ అనే పేరుతో ఈ సమావేశానికి లేనిపోని ప్రాముఖ్యత కల్పించి, రేవంత్ రెడ్డి వర్గాన్ని ఇరకాటంలో పెట్టాలని చూస్తున్నట్లు భావిస్తోంది. కానీ అది రివర్స్ అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
