తిరుపతి-పూరి… లింకేమిటి?

పూరి-తిరుపతి అనగానే ఆంధ్రులకు గుర్తుకు వచ్చేది, అత్యంత పాపులర్ అయిన పూరి – తిరుపతి ఎక్స్ ప్రెస్. రెండు ప్రాంతాలకు చెందిన రెండు సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను కలిపే రైలు అది.

ఈ రెండు ఆలయాల్లో కొలువైన దేవుడు అంటే ఆయా రాష్ట్రాల ప్రజలకు అత్యంత నమ్మిక. అంతే కాదు. తిరుపతిలో ఏవిధంగా అయితే అనూచానంగా వస్తున్న వైదిక పద్దతులు, పూజారుల విషయంలో కొన్ని పద్దతులు వున్నాయో, పూరిలో కూడా అలాగే వున్నాయి. తిరుపతి లో చాలా వరకు పద్దతులను సంస్కరించి, కొత్తగా ఆ ఆర్డర్ లో పెట్టారు కానీ, పూరిలో అలా కాదు, అప్పటి పద్దతులే ఇఫ్పటికీ కొనసాగుతున్నాయి.

ఇప్పుడు మరో విషయం కూడా ఈ రెండు పుణ్య క్షేత్రాలను కలుపుతోంది. ఏమిటిది? ఒరియా వాసుల అత్యంత ఆరాధ్య దైవమైన జగన్నాధుడి సన్నిధిలో, ఆంధ్రులకే కాదు, ఇంకా చాలా రాష్ట్రాల ప్రజలకు ఆరాధ్యుడైన వెంకన్న సన్నిధిలో ఒకే రకమైన సమస్య బయటకు వచ్చింది. చిత్రంగా రెండు రాష్ట్రాల్లో కూడా వచ్చే ఏడాది ఎన్నికలు పెండింగ్ వుండడం విశేషం. ఆంధ్రలో లేదు కానీ, ఒరిస్సాలో మాత్రం కొన్ని సంఘాలు, కొంతమంది వ్యక్తులు సిబిఐ విచారణ కోసం ఆందోళనబాట పట్టడం కూడా జరుగుతోంది.

ఏమిటిదంతా? తిరుపతిలో లేదో, వుండేదో, వుండనిదో తెలియని పింక్ డైమండ్ మాయం అన్న ఆరోపణ తెరపైకి వచ్చింది. రాయలవారు ఇచ్చిన ఆభరణాలు మాయం అయ్యాయన్న మరో ఆరోపణ. తిరుపతి దేవుడి ఆభరణాల వ్యవహారం లెక్క తేల్చాలని డిమాండ్లు వినిపించాయి. అక్కడ నుంచి మరో మెట్టు పైకి ఎక్కింది వ్యవహారం. తిరుపతిని రాష్ట్ర ప్రభుత్వ పరిథిలోంచి తప్పించాలని, తమిళనాడుకు చెందిన సుబ్రహ్మణ్యస్వామి అండ్ కో తమ లీగల్ ప్రయత్నాలు ప్రారంభించారు. మరి పూరిలో ఏం జరుగుతోంది.

పూరి ఆలయంలో దేవుడి కోశాగారం లేదా ట్రెజరీ లాంటి రత్నాగారం వుంది. దాని తాళం చెవి మాయం అయింది. అదీ సమస్య అక్కడ. ఇప్పుడు పూరిలో దీని మీద ఆందోళన ప్రారంభమైంది. సిబిఐ విచారణ డిమాండ్ తెరమీదకు వచ్చింది. ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన ప్రకటన ప్రకారం, 120 కిలోల బంగారం, 221 కిలోల వెండి ఆ రత్నగారంలో వుండాలి. అయితే ఇది ఈనాటి లెక్క కాదు. 40 ఏళ్ల క్రితం లెక్కలు తీసి, పద్దు రాసినపుడు తేలిన లెక్క. అంటే 1978లో తేల్చిన లెక్క.

పూరి దేవుడి అంటే ప్రపంచ వ్యాప్తంగా వున్న ఒరియా వాసులకు ఆరాధ్యదైవం. మరి ఈ నలభై ఏళ్లలో ఎన్ని ఆభరణాలు, వెండి వస్తువులు వచ్చి వుంటాయో అన్నది క్లియర్ గా లేదు. ఈవిషయమే ఇప్పుడు మెల్లగా చినికి చినికి గాలివానగా మారుతోంది ఒరిస్సాలో. మెలమెల్లగా ఆందోళనలు రాజుకుంటున్నారు. తిరుపతి విషయంలో అన్నీ పద్దతిగా వుండడం వల్ల, ఇక్కడి మీడియా, ఇక్కడ ప్రభుత్వం అప్రమత్తం కావడం వల్ల, వివాదం రేకెత్తించాలన్న ప్రయత్నం జరిగినా పెద్దగా రాజుకోలేదు. కానీ ఈ వివాదం రాజుకోవడానికి వెనుక భాజపా పన్నాగం వుందన్న వార్తలు మాత్రం బయటకు వచ్చాయి. చిత్రంగా పూరిలో మాత్రం వివాదం కాస్త గట్టిగా రాజుకునేలాగే వుంది. ఇప్పటికే రత్నాగారం తాళం మాయం కావడం మీద అక్కడి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ న్యాయ విచారణకు ఆదేశించారు. అసలు ఇది జరిగింది అంతా ఏప్రియల్ నాలుగన. పూరి రత్నాగారం విషయంలో వస్తున్న ఆరోపణల మేరకు హైకోర్టు ఆదేశాలు రావడంతో ఆలయ మేనేజింగ్ కమిటీ ఆ రోజున రత్నాగారంలోని అంతర్గతంగా వున్న మరో గదిలోకి మాత్రం వెళ్లలేదు. తలుపు కాకుండా, ఇనుప గ్రిల్స్ తో వున్న ఆ గదిలోకి వెళ్లకపోవడానికి కారణం అప్పటికే దాని తాళం మాయం కావడం. అందుకే ఆరోజు పవర్ ఫుల్ బ్యాటరీ లైట్ల ఆధారంగా బయట నుంచే గదిలోకి చూసి, అన్నీ ఎక్కడివి అక్కడే వున్నాయని సంతృప్తి చెంది బయటకు వచ్చేసారు. వాస్తవానికి రత్నాగారంలో మొత్తం గదులు ఏడు. రెండు బయటకు వుంటాయి. మిగిలిన అయిదు లోపలికి వుంటాయి. ఇప్పుడు మాయం అయింది వీటి తాళమే. ఈ వ్యవహారంపై ఇప్పుడు ఆందోళనలు మొదలయ్యాయి. అత్యంత ప్రభావితమైన పూరి శంకరాచార్య కూడా సిబిఐ విచారణ అనే దానికి గొంతుకలిపారు. ఇదే ఆందోళన ఇలా కొనసాగితే సిబిఐ విచారణ తప్పకపోవచ్చు. కచ్చితంగా ఇది ఒరిస్సాలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. ఎన్నికల ముందు హిందు ఓట్లను సమీకరణ చేసే కార్యక్రమంలో ఇది భాగమే అని అనుకోవాలా? తిరుపతి-పూరి వ్యవహారాలు ఒకేసారి తెరపైకి రావడం యాదృచ్చికం అనుకోవాలా? ఎన్నికల ప్రభావం, భాజపా, దాని అనుబంధ సంస్థల ప్రమేయం ఏమైనా వుందనుకోవాలా? అసలు విచారణ జరగాల్సింది దీనిమీదనే ఏమో?

ఆర్ మార్తాండశర్మ

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com