సివిల్ సర్వీస్ అధికారులు వ్యవస్థకు వెన్నెముక వంటివారు. రాజకీయ నాయకులు ఐదేళ్లకోసారి మారుతుంటారు, కానీ అధికారులు దశాబ్దాల పాటు ప్రజల సేవలో ఉంటారు. దురదృష్టవశాత్తూ, ఇటీవలి కాలంలో కొందరు ఉన్నతాధికారులు పాలకుల ప్రసన్నం కోసం చట్టాలను పక్కన పెడుతున్నారు. అధికారం చేతిలో ఉంది కదా అని పాలకులు చెప్పే అడ్డదారి పనులకు తలొగ్గి తమ ఉజ్వల భవిష్యత్తును బుగ్గి చేసుకుంటున్నారు. పదవుల మీద వ్యామోహంతో రాజ్యాంగబద్ధమైన బాధ్యతలను విస్మరించడం వల్ల చివరకు వారే దోషులుగా నిలబడాల్సి వస్తోంది.
వైఎస్ హయాం నుంచి సివిల్ సర్వీస్ వ్యవస్థకు చెదలు
గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన నిర్ణయాలు ఇందుకు నిదర్శనం. ఆనాడు పాలకులు తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలకు సంతకాలు చేసిన పదుల సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. కొందరు జైలు పాలయ్యారు, మరికొందరు సర్వీసు మధ్యలోనే అవమానభారంతో తలదించుకున్నారు. అప్పట్లో జరిగిన తప్పిదాల వల్ల కలిగిన నష్టం ఇప్పటికీ ఆయా అధికారుల కుటుంబాలను వేధిస్తూనే ఉంది. ఒకరి రాజకీయ లబ్ధి కోసం వ్యవస్థలను బలిపెట్టడం ఎంత ప్రమాదకరమో ఆ సంఘటనలు నేర్పిన పాఠం.
జగన్ వచ్చాక మరింతగా దుర్వినియోగం
జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఈ పరిస్థితి మరింత దిగజారింది. పాలకుల వ్యక్తిగత కక్షలు, వికృత ఆలోచనలను అమలు చేయడానికి కొందరు అధికారులు ఉత్సాహం చూపించారు. ప్రత్యర్థులను వేధించడం, అక్రమ కేసులు బనాయించడం వంటి పనుల్లో నేరుగా భాగస్వాములయ్యారు. తాము చేస్తున్నది తప్పు అని తెలిసినా, కేవలం పోస్టింగ్‌ల కోసమో లేదా భయం వల్లనో లొంగిపోయారు. ఇప్పుడు విచారణలు మొదలయ్యేసరికి వారంతా దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. తప్పు చేయమని చెప్పిన నాయకులు రేపు పక్కన ఉండరనే నిజాన్ని వీరు గ్రహించలేకపోయారు.
శిక్షణలో నేర్చుకునే విలువలు ఎక్కడికి వెళ్తాయి?
అధికారులు తమ సర్వీసులో ఎన్నో ఆశయాలతో అడుగుపెడతారు. కానీ రాజ్యాంగం పట్ల గౌరవం లేని పాలకులు వచ్చినప్పుడు వారి మాయలో పడటం వల్ల వ్యక్తిత్వమే దెబ్బతింటోంది. పోస్టింగ్ కోసం కక్కుర్తి పడటం, విచారణల పేరుతో బెదిరిస్తే భయపడి తప్పుడు పనులకు సహకరించడం సివిల్ సర్వీస్ గౌరవాన్ని తగ్గిస్తోంది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఈ రోజు అధికారం అండతో అన్నీ మేమే అనుకున్నా, రేపు న్యాయస్థానాల ముందు సమాధానం చెప్పుకోవాల్సింది అధికారులే తప్ప ఆ పనులు చేయమన్న రాజకీయ నేతలు కాదు.
నేర ప్రవృతి ఉన్న నేతల కింద పని చేసేటప్పుడు మరింత అప్రమత్తంగాఉండాలి!
నేర ప్రవృత్తి ఉన్న నాయకుల కింద పనిచేసేటప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉండాలి. పాలకుల ఇష్టాయిష్టాల కంటే చట్టం ఏం చెబుతుందో చూడటం ముఖ్యం. ఒక్క తప్పుడు సంతకం జీవితకాలపు పరువును గంగలో కలుపుతుంది. పదవి అనేది తాత్కాలికం, కానీ వ్యక్తిత్వం అనేది శాశ్వతం. వ్యవస్థలను కాపాడాల్సిన వారే వాటిని నిర్వీర్యం చేస్తే, సమాజం అధికారుల మీద నమ్మకం కోల్పోతుంది. చట్టానికి లోబడి పనిచేస్తే ఏ శక్తీ అధికారులను ఏమీ చేయలేదు. ఆ ధైర్యం లేనప్పుడు వారు ఉన్నత పదవులకు అనర్హులుగా మిగిలిపోతారు. నిజాయితీగా ఉండటం వల్ల వచ్చే కష్టాల కంటే, అక్రమాలకు సహకరించి అనుభవించే అవమానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. రాజకీయ నాయకులు ప్రజల తీర్పుతో తెరమరుగవుతారు, కానీ తప్పు చేసిన అధికారులు మాత్రం సమాజంలో నేరస్థులుగా ముద్ర పడతారు. ఇప్పటికైనా యువ అధికారులు పాత సంఘటనల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. వ్యవస్థల గౌరవాన్ని కాపాడుతూ, రాజ్యాంగానికి కట్టుబడి పనిచేసినప్పుడే సివిల్ సర్వీస్ కు అసలైన సార్థకత లభిస్తుంది.
