బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన పది మంది ఎమ్మెల్యేలకు కౌంట్ డౌన్ ప్రారంభమయింది. అనర్హతా వేటు వేయాలని బీఆర్ఎస్ దాఖలు చేసిన రెండు పిటిషన్లపై గురువారం సుప్రీంకోర్టు తీర్పు చెప్పనుంది. ముగ్గురు ఎమ్మెల్యేలపై స్పెషల్ లీవ్ పిటిషన్, మరో ఏడుగురిపై రిట్ పిటిషన్ ను బీఆర్ఎస్ దాఖలు చేసింది. అనర్హతా వేటుపై నిర్ణయం స్పీకర్ దేనని హైకోర్టు డివిజనల్ బెంచ్ తీర్పు చెప్పింది. అయితే స్పీకర్ కు గడువు విధించాలని బీఆర్ఎస్ కోరుతోంది. గతంలో కొన్ని తీర్పుల్లో సుప్రీంకోర్టు గడువు విధించిందని బీఆర్ఎస్ వాదించింది.
అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలు తాము పార్టీ మారలేదని వాదించారు. ఒక్క దానం నాగేందర్ మాత్రం అలాంటి వాదన వినిపించలేకపోయారు.ఆయన కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మిగతా వారి విషయంలో సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో కానీ.. దానం విషయంలో మాత్రం సుప్రీంకోర్టు స్పందన అనూహ్యంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హతా వేటు అధికారం పూర్తిగా స్పీకర్ దే. చట్టంలో గడువు కూడా నిర్దేశించలేదు. అందుకే సుప్రీంకోర్టు గతంలో ఫలానా తేదీలోపు నిర్ణయం తీసుకోవాలని సూచనలు జారీ చేసిందే కానీ ఆదేశాలివ్వలేదు. ఈ పిటిషన్లలో ఎలాంటి తీర్పు వస్తుందన్నది ఆసక్తికరం. సుప్రీంకోర్టు తీర్పు స్పీకర్ దే తుది నిర్ణయం అని వస్తే.. కాంగ్రెస్ లోకి మరిన్ని వలసలు ఉంటాయి.. అనర్హతా వేటు పై నిర్ణయం తీసుకోవాలని తీర్పు వస్తే.. ఉపఎన్నికలు వస్తాయి. తెలంగాణ రాజకీయాల్లో ఈ తీర్పు కీలకమయ్యే అవకాశం ఉంది.