Couple Friendly Movie Review
తెలుగు360 రేటింగ్: 3/5
లవ్, ఎమోషన్, ఫీల్ గుడ్… జోనర్ ఏదైనా కానివ్వండి. ఈతరం ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా చెప్పడం కొత్త టాస్క్. జంజీ కిడ్స్ అంటారే.. వాళ్ల మైండ్ సెట్ నీ, మూడ్ ని అర్థం చేసుకొని కథలు చెప్పగలగాలి. కొన్ని పాత కథల్ని.. ఇలాంటి సెటప్‌లో చూపిస్తే కొత్తగా అనిపించే అవకాశం ఉంది. ‘కపుల్ ఫ్రెండ్లీ’ కొత్త కథేం కాదు. కొత్త ఎమోషనూ కాదు. కానీ ఈతరం ఆడియన్స్ ని దృష్టిలో ఉంచుకొని, వాళ్లకు రీచ్ అయ్యేలా చెప్పే ప్రయత్నం అయితే కనిపించింది. ఇంతకీ ‘కపుల్ ఫ్రెండ్లీ’ కథేమిటి.. ఇందులో కొత్త విషయాలు, విశేషాలూ ఏమున్నాయి..? తెలుసుకొంటే..
శివ (సంతోష్ శోభన్)ది చిత్తూరు. ఇంటీరియర్ డిజైనింగ్ లో పట్టా సాధించినా, ఖాళీగా ఉంటాడు. ఇంట్లో పోరు పడలేక.. చెన్నై వచ్చేస్తాడు. అక్కడా ఉద్యోగాలు దొరకవు. బైక్ టాక్సీ నడుపుకొంటూ, అవకాశాల కోసం వెదుక్కొంటూ ఇబ్బంది పడుతుంటాడు. ఈ క్రమం లో మిత్ర (మానస వారణాసి) పరిచయం అవుతుంది. అనుకోని పరిస్థితుల్లో శివ తన రూమ్ ని మానసతో షేర్ చేసుకోవాల్సివస్తుంది. శివ తన కాళ్ల మీద తాను నిలబడడానికి మిత్ర చాలా సపోర్ట్ చేస్తుంది. క్రమంగా ఇద్దరూ దగ్గరవుతారు. అయితే మిత్రకు ఇంట్లో సంబంధాలు చూస్తుంటారు. శివ, మిత్ర ఇద్దరూ ఓసారి ఇంట్లో వాళ్లకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతారు. ఆ తరవాత ఏమైంది? వీరిద్దరి ప్రేమని ఇంట్లోవాళ్లు అర్థం చేసుకొన్నారా, లేదా? శివ, మిత్ర జీవితాల్లో ఏం జరిగింది? అనేది మిగిలిన కథ.
పెళ్లి కాకముందే ఓ అబ్బాయి, అమ్మాయి సహ జీవనం చేయాల్సి రావడం, ఆ తరవాత ఇంట్లో పెద్దవాళ్లతో అవాంతరాలు, వాటిని దాటుకొని ప్రేమ జంట ఒక్కటి కావడం.. ఇలాంటి కథలు చాలా సినిమాల్లో చూశాం. `కపుల్ ఫ్రెండ్లీ`లో కూడా ఇలాంటి కథే ఉంది. కాకపోతే.. దానికి మరో తరహా ఎమోషన్ ని జోడించాడు దర్శకుడు. ఫస్టాఫ్‌లో సహజీవనం, ప్రేమకథ, శివ జీవితంలో ఎదుర్కొనే సవాళ్లు ఇవే కనిపిస్తాయి. సెకండాఫ్ మొత్తం ఎమోషనల్ టర్న్ తీసుకొంది. ఫస్టాఫ్‌లో శివ – మిత్రల పరిచయం, వాళ్ల ప్రేమ కథ.. ఇవన్నీ ఈతరం ప్రేక్షకులకు నచ్చేలా డిజైన్ చేశారు. మరీ ఓవర్ డ్రమెటిక్ అనిపించవు. ఆయా సన్నివేశాలన్నీ ఆర్గానిక్ గా కుదిరాయి. తొలి సన్నివేశాలు చూస్తున్నప్పుడు శివ సక్సెస్ కొట్టాలనిపిస్తుంటుంది. మిత్ర – శివ త్వరగా ఒక్కటైపోతే బాగుంటుందనిపిస్తుంది. వారి పరిచయం, స్నేహం, ప్రేమ వాటికి సంబంధించిన సన్నివేశాలు చాలా కుదురుగా.. హాయిగా.. మనసుకు హత్తుకుపోయేలా తీశాడు దర్శకుడు. ఈ కథ మెల్లమెల్లగా ఎమోషనల్ టర్న్ తీసుకొంటుందన్న విషయం సగటు ప్రేక్షకుడికి అర్థం అవుతూనే ఉంటుంది. విశ్రాంతి కార్డు ఆక్సిజన్ సిలిండర్ పై వేసినప్పుడు అది మరింతగా బలపడుతుంది. ఇంట్రవెల్ దగ్గర హీరో – హీరోయిన్ల బ్రేకప్ లో పెద్దగా సంఘర్షణ అనిపించలేదు. అది కాన్ఫ్లిక్ట్ కాదన్న విషయం దర్శకుడికీ తెలుసు. ఎందుకంటే సెకండాఫ్ లో కథ మరో మలుపు తీసుకొంటుంది. ఆ మలుపుకీ, ఇంట్రవెల్ లో చూపించిన సంఘర్షణకీ సంబంధం లేదు.
ద్వితీయార్థంలో కథలో ఎమోషనల్ హైస్ ఎక్కువగా ఉంటాయి. కథానాయిక పాత్రపై సింపతీ వర్కవుట్ అవ్వాల్సిన సినిమా ఇది. అలా జరగాలంటే ఆ పాత్రని హీరో కంటే ఎక్కువ లవ్ చేయాలి. అలాంటి సీన్లు కొన్ని కనిపిస్తాయి కూడా. ఈతరం ప్రేమ, సహజీవినం లాంటి విషయాల్లో ఎలా ఆలోచిస్తుందో చెప్పాల్సింది. వాటిని టచ్ చేయలేదు. ఓవైపు షుగర్ డాడీ ట్రాకు ఒకటి సమాంతరంగా నడుస్తుంటుంది. దాన్ని కూడా లైటర్ వే లోనే చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. క్లైమాక్స్నీ, ఈ కథ ముగించిన పద్ధతీ చూస్తే కొన్ని హాలీవుడ్,బాలీవుడ్ సినిమాలు గుర్తొస్తాయి. ఇంత బరువైన కథని ఎంత సింపుల్ గా ముగిస్తాడంటే.. జీవితంలో అనుకోని వీడ్కోలు లభించినప్పుడు కూడా మనసు నిబ్బరంగా ఉంచుకోవాలన్న ఆశావాహ దృక్పథాన్ని కలిగిస్తుంది. అక్కడక్కడ తమిళ, మలయాళ సినిమాల ఫ్లేవర్ ఉన్నా – వాళ్లలా మరీ ఓవర్ డ్రమిటిక్ అయిపోకపోవడం ఈ సినిమాలో కనిపించిన మంచి లక్షణం. ఇలాంటి కథలు ఎంత హార్డ్ హిట్టింగ్ గా చెబితే అంత మంచిది అనుకొంటారు. కానీ కొన్నిసార్లు మరీ ఇన్ని కన్నీళ్లు, కష్టాలూ మోయగల సామర్థ్యం ప్రేక్షకులకు ఉండకపోవొచ్చు. కాబట్టి.. వాటి జోలికి వెళ్లకుంగా మంచి పనే చేశారు.
అమ్మాయిలు అబ్బాయిల నుంచి గానీ, భార్యలు భర్తల నుంచి గానీ ఏం కోరుకొంటారు? అనే పాయింట్ అయితే.. దర్శకుడు ఈ సినిమాలో బాగానే డీల్ చేశాడు. `మేం ఇబ్బంది పడుతున్నప్పుడు మీరు పక్కన ఉండాలనుకొంటారు. కానీ అనుకొంటారంతే. ఉండరు. ఉండి చూడండి.. మిగిలినవి మేం చూసుకొంటాం` అని ఓ అమ్మాయి చెప్పే డైలాగులో చాలా డెప్త్ ఉంది. అందుకే సెకండాఫ్‌ని దర్శకుడు ఇలా టర్న్ చేశాడేమో అనిపించింది. సంతోష్ ని రాజీవ్ కనకాల పట్టుకొని ఏడ్చే సన్నివేశంలో మాటలకు చోటు లేకుండా పోయింది. ఇలాంటి చోట పేజీల డైలాగులు చెప్పలేని భావం.. ఒక్క కన్నీటి బొట్టు చెబుతుంది. అమ్మాయి, అబ్బాయిల సహ జీవినం అనగానే బోలెడంత శృంగారం గుప్పించే ఛాన్స్ వుంది. దర్శకుడికి ఇలాంటి కథల్లో ఆ స్పేస్ కావాల్సినంత దొరుకుతుంది. కానీ ఎక్కడా శ్రుతి మించలేదు. తల పక్కకు తిప్పుకోవాల్సిన అవసరం కలిగించలేదు. ఈ విషయంలో దర్శకుడి నిబద్ధత మెచ్చుకోవాలి.
సంతోష్ ఎప్పటిలానే బాగా చేశాడు. ఎక్కడా నటించినట్టు అనిపించలేదు. తన ఈజ్, బాడీ లాంగ్వేజ్ చాలా బాగా కుదిరాయి. కొన్ని డైలాగులు చెబుతున్నప్పుడు ఎంత బాగా ఓన్ చేసుకొన్నాడంటే.. వాటితో ఆడియన్ కనెక్ట్ అయిపోతాడు. మానస పక్కింటి అమ్మాయి పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. ఫస్ట్ ఫ్రేమ్ నుంచే.. ఆ అమ్మాయిని ఫాలో అయిపోతాం. ఎక్కడా ఓవర్ డ్రమటైజ్ చేయలేదు. సినిమాలో కెమెరా అంతా వీరిద్దరి చుట్టూనే తిరిగింది. మధ్యలో కొన్ని పాత్రలున్నా.. వాటిపై పెద్దగా మనసు పోదు. యోగిబాబు ఓ చిన్న పాత్రలో కనిపించారు.
సంగీతం హాయిగా, వినసొంపుగా ఉంది. పాటలు గుర్తుండవు కానీ, స్క్రీన్ పై చూస్తున్నప్పుడు ఫర్వాలేదనిపిస్తాయి. చెన్నై నేపథ్యంలో సాగే కథ ఇది. లైవ్ లొకేషన్లలో సన్నివేశాలు తీయడం వల్ల సహజత్వం అబ్బింది. నిర్మాణ విలువలు కూడా ఓకే. దర్శకుడిలో విషయం ఉంది. తనపై కొన్ని బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల ప్రభావం కనిపిస్తోంది. అయినప్పటికీ తనదైన ముద్ర వేసుకోగలిగాడు. ఈ ప్రేమికుల రోజున.. ప్రేమకు నిర్వచనం లాంటి సినిమా ఇది.
తెలుగు360 రేటింగ్: 3/5
