2015లో `ఆవు’ నెంబర్ వన్

2015 సంవత్సరం మరికొద్ది రోజుల్లో ముగియబోతున్నది. 2016కి స్వాగతం పలికే శుభఘడియలు రాబోతున్నాయి. ఈ సందర్భంగా మనదేశంలో 2015కి నెంబర్ వన్ గా ఎవరు నిలిచారా ? అని చూస్తే, కళ్లముందు ఆవు కనిపించింది. నిజమే 2015కి ఆవు `నెంబర్ వన్’. దీంట్లో తిరుగేలేదు.

ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్స్ (యాహూ, గూగుల్) వంటివి అందించిన సమాచారం ప్రకారం మనదేశంలో ఎక్కువ మంది ఆవు (COW) కి సంబంధించిన సమాచారం కోసం సెర్చ్ చేసినట్లు తేలిపోయింది. గోపూజ, గోమాంసం వంటి అంశాలు 2015లో దేశమొత్తాన్నీ కదిలించాయి. ఆవుకి సంబంధించిన చారిత్రిక, ఐతిహాసిక సమాచారం తెలుసుకోవడం కోసమో, లేక ప్రస్తుత సంఘటనల పూర్వాపరాలు తెలుసుకోవడంకోసమో ఎక్కువ మంది – ఆవుతో ముడిపడిన పదాలను (ఉదాహరణకు – గోపూజ, వేదాల్లో ఆవు, గో మాంసం, గోవధ వంటివి) సెర్చి ఇంజెన్లో ఉంచి ఫలితాలను రాబట్టారు.

ఇటు ఆవుని గోమాతగా భావిస్తూ పూజించేవారు, అటు ఆవును ద్వేషించేవారు పోటాపోటీగా ఈ జంతువు గురించి పూర్వాపరాలు తెలుసుకోవాలనుకోవడం ఒక విశేషం. దేవుడి నామస్మరణ భక్తునికంటే, నాస్తికుడే ఎక్కువ సార్లు చేస్తాడన్నట్లుగానే, ఈ వ్యవహారంలో ఆవును ఎక్కువగా తలుచుకున్నదీ, చరిత్ర పుటలు తిరగేసింది గోవును ద్వేషించినవారే కావడం విశేషం.

2015లో ఆవు నామస్మరణ ఎంతగా సాగిపోయిందంటే, దాని ముందు మిగతా సంఘటనలన్నీ బలాదూర్. గ్రామాల్లోని రచ్చబండ మొదలుకుని, పార్లమెంట్ వరకూ ఆవుతో ముడిపడిన సంఘటనలపై చర్చలు చురుగ్గా జరిగాయి. ఆవుమాంసం తినకూడదంటూ మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధాన్ని ప్రకటించినప్పటి నుంచి ఆవు చుట్టూ అనేక చర్చలు జరిగాయి. ఈసారి మరో ప్రత్యేకత ఏమంటే, ఇలాంటి చర్చలకు ఆన్ లైన్ వెబ్ సైట్లు, సోషల్ మీడియా ప్రధాన వేదికలు కావడం.

గోమాంసం వివాదం, దాద్రీలో వ్యక్తిపై దాడి, ఆవు మాంసంపై వివాదాస్పద వ్యాఖ్యలతో దేశం యావత్తు ఉడికిపోయింది. చివరకు అది దేశంలో అసహనం పెరిగిపోయిందన్న మరో వివాదానికి తెలెత్తేలా చేసింది.

యాహూ ఇప్పటికి ఎనిమేదళ్ల నుంచి Year in Review (YIR) అందజేస్తోంది. అలాగే ఈఏడాది రివ్యూ ప్రకటిస్తుంటే, అనూహ్యమైన ట్విస్ట్ గా COW `పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్’ గా నిలిచింది. యాహూ యూజర్స్ రోజువారీగా సెర్చ్ ఇంజన్ ని ఉపయోగించుకునే తీరు, వారు ఏ అంశంపై ఎక్కువగా శ్రద్ధపెట్టారు, వేటిని ఎక్కువగా చదువుతున్నారన్న అంశాలను బట్టి రివ్యూ తయారవుతుంటుంది.

ఢిల్లీ, బిహార్ ఎన్నికల పట్ల దేశ ప్రజలు ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఢిల్లీ సీఎం- అరవింద్ కెజ్రీవాల్ 2015కి `టాప్ న్యూస్ మేకర్స్’ గా మారారు. కాగా, ప్రధాని నరేంద్రమోదీ గత ఏడాదిలాగానే, ఈ ఏడాది కూడా టాప్ న్యూస్ మేకర్స్ జాబితాలో స్థిరంగా కొనసాగారు.

2015లో దేశ ప్రజలను ప్రభావితం చేసిన మరికొన్ని అంశాలు

1. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదం.

2. ప్రపంచ కప్ – 2015

3. ఎపీజె అబ్దుల్ కలాం మరణం

4. షీనా బోరా హత్య కేసు విచారణ

5. వ్యాపం కుంభకోణం

6. అమెరికా అధ్యక్షుడు ఒబామా పర్యటన

7. ఢిల్లీ, బిహార్ ఎన్నికలు

8. అసహనం (Intolerance)

9. సల్మాన్ ఖాన్

10. బాహుబలి

రాజకీయ నాయకుల్లో మోదీ చెక్కుచెదరని స్థానంలో ఉన్నారు. ఆన్ లైన్ సెర్చ్ ఇంజన్ లో ఆయన గురించి ఎక్కువగా సెర్చ్ చేశారు. అలాగే, స్మిృతి ఇరానీ, శశి థరూర్ పాపులర్ వ్యక్తులుగానే నిలిచారు.

2015 జనవరి నుంచి ఇప్పటివరకు ఎన్నో సంఘటనలు జరుగుతున్నా, ఆవు స్థానం ఆవుదే. అదే నెంబర్ వన్.

-కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com