ఆవు రాసిన బహిరంగలేఖ !

గౌరవనీయులైన హర్యానా బీజేపీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తార్ గారికి సాధుజంతువు ఆవు అనగా మీ గోమాత రాయునది ఏమనగా….

మీరు మా పట్ల చూపుతున్న గౌరవం, ఆదరాభిమానాలకు మందుగా కృతజ్ఞతలు. అయితే మీరు, మీలాంటి గోప్రేమికులు- తరచూ చేస్తున్న ప్రకటనల వల్ల మా జాతికి మేలు జరగకపోగా, కీడు జరుగుతుందేమోనన్న దిగులు పట్టుకుంటున్నది. అందుకే ఈ లేఖ రాస్తున్నాను. మీరంతా మామంచి కోరే మాట్లాడుతున్నారు. కానీ దీనివల్ల రాబోయే అనర్థాలు తెలుసుకోలేకపోతున్నారు. ఇదే మా బాధ. ఎక్కడి దాకో ఎందుకు, నిన్నటికి  నిన్న మీరు ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏమన్నారో ఆత్మావలోకనం చేసుకోండి. `ముస్లీంలు ఈ దేశంలో నివసించడాన్ని కొనసాగించవచ్చు, కాకపోతే వారు ఆవుమాంసం తినడం మానుకోవాలి, ఎందుకంటే ఇక్కడ ఆవు అన్నది నమ్మకానికి ఓ చిహ్నం’- అని అనలేదూ. ఆమాటలు మావాళ్లు వినగానే పొంగిపోయాము. భేష్, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మన పక్షాన ఉన్నాడని సంతోషించాము. కానీ అంతలో భయం పట్టుకుంది. మేము సాధుజంతువలమని మీకు బాగానే తెలుసుకదా, ఎండకీ, వానకీ కూడా భయపడే రకాలం మేము. అందుకే మా భయం మాది.

మీ మాటలతో అవతలి వాళ్లు మరింతగా రెచ్చిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే యుపీలోని దాద్రీకి దగ్గర్లోని బిశారా గ్రామంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. చివరకు ఈ సంఘటనను అన్ని పార్టీలవాళ్లు స్వీయరాజకీయాలకు ఉపయోగించుకున్నారు. ఇలాంటి సంఘటనే హిమాచల్ ప్రదేశ్ లో షిమ్లా దగ్గర చోటుచేసుకున్నట్లు విన్నాము. గోజాతిని కాపాడటం కోసం మీరూ, మీబోటి వాళ్లు చాలా ఆరాటపడుతున్నమాట నిజమే. కానీ ఆ తొందరలో మీరంతా తప్పటడుగులు వేస్తున్నారు. దీంతో ముస్లీంలు మరింతగా రెచ్చిపోతున్నారు. మీకో సంగతి తెలుసా… నాయకుల రెచ్చగొట్టే ప్రకటనల వల్ల భావోద్వేగాలు పెరిగిపోతున్నాయి. చివరకు మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. `ఆవుమాంసం తింటే తప్పేమిట’నీ ఒకడు, తినకూడదని మరొకడు వాదించుకుంటున్నారు. కేవలం మావల్ల మీరంతా నానాగొడవ పడటం మాకు నచ్చడంలేదు. గోవధ జరగకపోయినా కొన్ని చోట్ల జరిగినట్లు రూమర్స్ వచ్చేస్తున్నాయి. దీంతో పచ్చగా ఉండాల్సిన పలెల్లు భగ్గుమంటున్నాయి.

ముస్లీంలు ఎక్కువగా ఉండే పల్లెల్లో నిత్యం గోవధ జరుగుతుందన్న భ్రాంతి కలిగిస్తున్నారు. ఇది తప్పు. నిజానికి చాలా పల్లెల్లో ముస్లీంలు కూడా ఆవును పవిత్రంగా చూడకపోయినా హానికలిగించాలని అనుకోవడంలేదు. ఆ విషయం మాకు తెలుసు. ఆవుల మందల జోలికి వెళ్లేవారుకాదు. అలాంటి కట్టడి ఉండేది. లేకపోతే పశుసంపద మనదేశంలో ఘనంగా వర్థిల్లేదేకాదు. నిత్యం ఆవుమాంసం తినాలని కూడా వారేమీ అనుకోవడంలేదు. కాకపోతే రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం వల్ల ఇప్పుడు పల్లెల్లో కూడా పరిస్థితి మారింది. మందలో మేము బిక్కుబిక్కుమంటున్నాము. మాలోనుంచి ఎవరైనా కనిపించకపోతే ఎన్నో అనుమానాలు వస్తున్నాయి. ఒంటరిగా వెళ్ళే మాపై దాడికి దిగుతున్నారు. నిలువునా మమ్మల్ని చీల్చిపారేస్తున్నారు. మూగవేదనతో `అంబా..’అని అరవడం తప్ప ఏమీ చేయలేకపోతున్నాము.

మాకో విషయం అర్థమైంది. భారతదేశంలోని ముస్లీంలందరికీ మామీద అంటే ఆవులమీద ద్వేషం లేదు. వారిలో చాలామంది మతపరమైన ఉత్సవాల్లో పరస్పరం సహాయసహకారాలు అందిపుచ్చుకునేవారే. హిందువులు, ముస్లీంలు సోదరుల్లా మెలుగుతున్న పల్లెలు కోకొల్లలు. అవి మతసామరస్యానికి ప్రతీకలుగా వెలుగొందుతున్నాయి. అయితే, నాయకులు భావోద్వేగ ప్రకటనలు చేయడం, మీడియా పనిగట్టుకుని గంటలకొద్దీ ఇలాంటి వార్తలను ప్రసారం చేయడంతో సమస్య తీవ్రరూపం దాలుస్తోంది. మా ప్రమేయంఏదీ లేకుండానే ఇంత రాద్ధాంతం జరగడం విడ్డూరంగా ఉంది.

గోవధను సమర్థించే కొంతమంది పండితులు తమ వాక్చాతుర్యంతో వేదాలను, ఉపనిషత్తులను ఏకరవు పెడుతూ గోవధ ఆనాడే ఉందని నమ్మబలికిస్తున్నారు. అయ్యా, పెద్దలూ… పూజించేవాడు ఆనాడూ ఈనాడూ ఉన్నట్లే చంపేవాడు ఆనాడూ ఈనాడూ ఉన్నాడు. మనిషి తత్వం మారలేదు. ఆ సంగతి మాకు తెలుసు. నిజంగా మీకు మాపై ప్రేమ ఉన్నదని అంటే మేము నమ్మడంలేదు. మా చెవిలో పూలు పెట్టుకోవడంలేదు. అసలు విషయం మాకు తెలుసు. మేము మీ ఆర్థిక సంపదలో భాగం. మా నుంచి బహుముఖ ఆర్థిక ప్రయోజనాలు ఉండేవి కాబట్టే మమ్మల్ని ఇంతకాలంగా బతకనిచ్చారు. లేకుంటే గోమేథం ఏనాడో జరిగిపోయేది. ఇది జీవన పోరాట సత్యం.

ఆవుమాంసం తినడం మానుకుంటే ముస్లీంలు ఈ దేశంలో జీవనం కొనసాగించవచ్చంటూ తమరు చేసిన ప్రకటన చాలా త్రీవమైనది. అటుతిరిగీ ఇటుతిరిగి ఇది మామీదకు వచ్చేటట్లుంది. మీరూమీరూ బాగానే ఉంటారు. మధ్యలో నలిగిపోతున్నది మేమే. నిజంగా మమ్మల్ని రక్షించాలంటే ఎలాంటి చర్యలు చేపట్టాలో వాటి సంగతి ముందుచూడండి. మాటలకంటే చేతలకు ప్రాధాన్యం ఇవ్వండి. గోవధ నిషేధం అని చెప్పడంకంటే, చంపడం వల్ల జరిగే నష్టాలను వివరించాలి. ఎదుటివారిలో చైతన్యం కలిగించాలి. నమ్మకం, చైతన్యం మనిషిని సన్మార్గంలో నడిపిస్తాయి. ఆవేశాలకు అడ్డుకట్టవేస్తాయి. అలాగే వీలైనంత ఎక్కువగా గోశాలలు కట్టించి, మాకు పూర్తి భద్రత కల్పించాలి. తినడానికి సరిగా తిండిలేక, ఉండటానికి తగినంత స్థలంలేకనే కదా, మేము గాలికి తిరగాల్సివస్తున్నది. అలా గాలికి వదిలేసి అయ్యో గోవధ జరిగిపోతుందని ఆగ్రహంతో ఊగిపోవడం విచక్షణ అనిపించుకుంటుందా? మీకంటూ ఓ రాజ్యాంగం ఉంది. మరి అందులో గోసంరక్షణ విషయం ఉందోలేదో నాకు తెలియదు. లౌకిక వాదం ముసుగులో మాకెంత అన్యాయం జరుగుతుందో కూడా మాకు తెలియదు. మాకు తెలిసినదల్లా ఒక్కటే, మీలో చాలామంది ఇప్పటికీ మమ్మల్ని గౌరవిస్తున్నారు. పూజిస్తున్నారు. అయితే విపరీతమైన ప్రేమతో ఆవేశాలకు లోనుకాకండి. మా జాతి మనుగడపై ప్రభావం చూపేటంతగా వ్యాఖ్యలు చేయకండి.

మేము, అనగా గోవులం ఏ పార్టీకి చెందినవారం కాదు. ఏమతానికీ కులానికి చెందినవారం అసలేకాదు. కానీ మమ్మల్ని ఒక మతానికి చెందిన జంతువుగా గాడికికట్టేస్తున్నారు. మెడలో మతం బిళ్ల తగిలిస్తున్నారు. పూజలుగట్రా చేసేస్తున్నారు. అసలు ఇవన్నీ మేము కోరామా? మీ కుళ్లు రాజకీయాలతో మాకు పనిలేదు. అవి మాకు అర్థంకావు. అయినా మాపై పార్టీ రంగు పులుముతున్నారు. మీ రాజకీయాల,మతపరమైన బురదను మాపై జల్లకండి. వీలైతే మమ్మల్ని రక్షించండి. లేదంటే మాదారిన మమ్మల్ని పోనీయండి.

ఇట్లు,
మీ గోమాత

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క‌ర్నూలులోనూ సోనూసూద్ ఆక్సిజ‌న్ ఫ్లాంట్

రోజు రోజుకీ... ధాతృత్వంలో కొత్త మెట్లు ఎక్కుతున్నాడు సోనూసూద్‌. అడిగిన‌వాళ్ల‌కూ, అడ‌గ‌నివాళ్ల‌కు సైతం వ‌రాలు కురిపిస్తున్నాడు. తాజాగా క‌ర్నూలు కేంద్రంగా ఓ ఆక్సిజ‌న్ ఫ్లాంట్ ని నిర్మించ‌డానికి రెడీ అయ్యాడు. క‌ర్నూలు జ‌న‌ర‌ల్...

సొంత గడ్డపై కేసీఆర్ వ్యూహాలకు ఈటల చెక్..!

ఈటల రాజేందర్‌ను రాజకీయంగా బలహీనం చేయాలనుకున్న ప్రయత్నాల్లో కేసీఆర్ వ్యూహాలు ఫలిస్తున్నట్లుగా కనిపించడం లేదు. నిన్నామొన్నటి వరకూ.. సైలెంట్‌గా ఉన్న వాళ్లు కూడా ఇప్పుడు ఈటల వెంటనే ఉంటామని చెబుతున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ...

వెబ్ సిరీస్‌ల‌తో ప్ర‌శాంత్ వ‌ర్మ బిజీ

క‌రోనా, లాక్ డౌన్ వ‌ల్ల‌.. దర్శ‌కుల‌కు పూర్తిగా ప‌నిలేకుండా పోయింది. సినిమాల‌కు బ్రేక్ ఇవ్వ‌డంతో కొంత‌మంది ఇంటిప‌ట్టునే రెస్ట్ తీసుకుంటున్నారు. ఇంకొంత‌మంది త‌మ‌ స్క్రిప్టుల‌కు మెరుగులు దిద్దుకుంటున్నారు. అయితే యువ ద‌ర్శకులు మాత్రం...

అవినీతి అధికారుల్ని అలా శిక్షిస్తారంతే.. రివర్స్‌లో..!

జగన్ పాలనలో అవినీతి పరుల్ని ఎవర్నీ సహించి లేదని... ఎవర్నీ దగ్గరకు రానివ్వబోమని ముఖ్యమంత్రి జగన్ చెబుతూంటారు. ఇప్పుడు... చేతల్లో కూడా చూపిస్తున్నారు. కాకపోతే రివర్స్‌లో. అవినీతి ఆరోపణలు బలంగా రావడం.....

HOT NEWS

[X] Close
[X] Close