`ఆవు’ – `అభివృద్ధి’ ఏది ముఖ్యం ?

ఫోకస్

నా చిన్నప్పుడు, పరీక్షల్లో ఆవు వ్యాసం రాసేవారం. ఆవు గడ్డిమేయును, పాలిచ్చును…దానికి రెండు కొమ్ములుండును…అంటూ ఏదో రాసేవారం. ఇంకొంతమంది ఏ సబ్జెక్ట్ మీద వ్యాసం రాయమన్నాసరే, దాన్ని తమకు బాగావచ్చిన ఆవువైపుకు తిప్పేసుకుని అతితెలివిగా గీకిపారేసేవారు. ఈ రెండో కోవకు చెందిన వాళ్లు ఇప్పుడెక్కువయ్యారు. ఈ అతితెలివే నానా రభస సృష్టిస్తోంది. అందుకే వీళ్లు ఏ సబ్జెక్ట్ గురించి మాట్లాడమన్నా, చివరకువాళ్లు `గోవధ, ఆవుమాసం లేదంటే గోపూజ’ దగ్గరకే వెళుతున్నారు. `అదేంటిరా, ఇదేమన్నా ముఖ్యమైనదా? దేశాభివృద్ధికి ఏమైనా తోడ్పడుతుందా ? అంటూ ఎవరైనా మందలిస్తే కోపంతో ఊగిపోతున్నారు. ఎర్రబడ్డకళ్లతో మండిపడుతున్నారు. ఈ మంటలే ఇప్పుడు అసహనాన్ని కలిగిస్తున్నాయి. ఇవే ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ప్రపంచపటంలో దేశాన్ని మసకబారుస్తున్నాయి. ఈ రెండవ కోవకు చెందినవారిలో చరిత్రకారులు, శాస్త్రవేత్తలు,రాజకీయనాయకులు, మీడియా మేధావులూ , మతాచార్యులు..ఇంకా చాలామందే ఉన్నారు. వీరంతా ఆవు గురించి మాట్లాడటానికి ఎక్కువ ఇష్టపడుతున్నారేకానీ, ఆ తొందరలో దేశాభివృద్దికి అండగానిలిచే మతసహనం, సామరస్యాలను పాతరపెట్టేస్తున్నామని అనుకోలేకపోతున్నారు. అందుకే `ఆవు’ ముఖ్యమా?, `అభివృద్ధి’ ముఖ్యమా? అన్నది తెలుసుకుంటే ఈ కాష్టం చల్లారవచ్చు.

ఇప్పుడు ఎవెరవరు ఆవు మాంసం తింటున్నారో, మరి ఎవరు గోవును దేవతగా భావిస్తూ పూజిస్తున్నారో లెక్కలు తీయాల్సిన అవసరంలేదు. ఆవు అనేది మనదేశ సంపదగా ఉండేది. ఆరోజుల్లో దేశాభివృద్ధికి గో-గణం ఒక తార్కాణం. ఇప్పుడు కాలం మారింది. ప్రపంచంయావత్తు అనేక రంగాల్లో అభివృద్ధి సాధించడంతో కేవలం ఆవువల్లనే అంతా జరిగిపోతుందనుకోవడం భ్రమ. అలాఅని ఆవుని పూజించవద్దని చెప్పడంలేదు. ఆవు వల్ల మంచి జరుగుతుందనో, మన ఆరోగ్యాలు బాగుపడతాయనో, లేదా పుణ్యలోకాలు సంప్రాప్తిస్తాయనో భావిస్తే నిత్యం పూజలు చేయండి. అయితే,గోసంరక్షణకు కట్టుబడండి. వాటిని వీధుల్లో అనాధలుగా తిరిగేలా చూడకండి. సరైన `కంచె’లేకపోతే ఆవుపైకి ఏ పులో ఆకస్మికంగా దాడిచేసి దాన్ని తినేయాలని చూడొచ్చు.

చిన్నప్పుడు మనం చదువుకున్న పుస్తకాల్లో ఆవు-పులి కథను ఓసారి గుర్తుకుతెచ్చుకోండి. దేశమంతటా ఎంత గోసంపద ఉండాలో అంతగా వృద్ధి చేసుకోండి. వాటి రక్షణమాత్రం మరువకండి. రక్షణ సరిగా కల్పించలేనప్పుడు, `అదిగో అక్కడ , ఫలానాచోట ఒక వ్యక్తి ఆవును దొంగిలించి తీసుకెళ్ళి వధించి తినేశాడం’టూ ఆందోళనకు దిగడం సరైనదేనా ? ఓసారి ఆలోచించండి.
మహాభారతంలో ఉత్తర-గోగ్రహణం కథ గుర్తుకుతెచ్చుకోండి. విరటుని సామ్రాజ్యంలో గోపాలకుల రక్షణలో వేలకొద్దీ ఆవులుండేవట. రక్షణలో ఉన్న ఆవులనే ధుర్యోదనాదులు అపహరించాలని చూశారు. ఇది యుద్ధానికి దారితీసింది. ఈ కథ వల్ల మనకు అర్థమవుతున్నదేమిటంటే, గోపాలకుల సంరక్షణలో ఉంటేనే వాటిని అపహరించాలని చూసేదుష్టశక్తులున్నప్పుడు వాటి ఆలనాపాలనా మరచిపోయి, కేవలం గోమాత..దేవత అంటూ పూనకం వచ్చినట్లు ఊగిపోవడం, మాట్లాడటం వల్ల ఆ మూగజీవాలకు ప్రయోజనం కలగకపోగా, హానిజరుగుతోంది. నిజంగా ఆవుజాతిని కాపాడాలనుకునేవాడెవ్వడూ ఇలా నోరు పారేసుకోడు.

దేశానికి చెందిన సహజ సంపదలను, పురాతన వస్తువులను ఎలా సంరక్షించుకుంటున్నామో అదే స్థాయిలో గో సంపదను రక్షించుకోవాలి. ఆ పరిస్థితి మనదేశంలో లేనప్పుడు ఎవరిని నిలదీయాలో వారిని నిలదీయకుండా మనలోమనం కొట్టుకుచావడం నిజంగా దౌర్భాగ్యం.

మనదేశంలో భావప్రకటన స్వేచ్ఛ ఉన్నట్టుగానే, ఏ రకమైన ఆహారం తీసుకువాలన్న విషయంపై సంపూర్ణ స్వేచ్ఛ ఉన్నమాట నిజం. అయితే, ఆహారానికీ- శరీర ఆరోగ్యానికీ ముడిపెట్టబడిఉంటుంది. దోషపూరిత ఆహారం తినడానికి రుచిగాఉన్నప్పటికీ , దాన్ని ముట్టుకోకూడదని వైద్యశాస్త్రాలు చెబుతున్నాయి. ఇందులో ఈమతం, ఆ మతమని లేదు. ఇప్పుడొచ్చిన సమస్యల్లా, ఆహారాన్ని ఆరోగ్యంతో ముడిపెట్టకుండా, మతానికి ముడిపెట్టడమే.

గోవధ-గోమాంస భక్షణ అంశం ఈరోజున చినికిచినికి గాలివానగా మారింది. భారతదేశానికి కొన్నివేల సంవత్సరాల చరిత్రఉంది. దీంతో ఎవరికి ఎలాంటి సమాచారం కావాలనుకుంటారో అలాంటి సమాచారం ఎక్కడో ఒక చోట (అది వేదం కావచ్చు, సంహిత, పురాణం, వైద్యశాస్త్రం…ఇలా ఏదైనా కావచ్చు- వాటిల్లో) దొరుకుతుంది. దాన్ని అందిపుచ్చుకుని వాదనలకు దిగడం అది తారాస్థాయికి మనుషులు కొట్టుకుచచ్చేటంత కసిని పెంచడం అత్యంత శోచనీయం. గతంగతః అని వదిలిపెట్టకుండా, గోమాంసాన్ని `అదిగో ఫలానావాళ్లు, ఫలానా టైమ్ లో తిన్నారని’ ఒకరంటే, మరొకరు, అంతేస్థాయి సాక్షాధారాలు బయటకుతీసి `అలా తినకూడదు, తింటే రోగాలొచ్చి చస్తారం’టూ వాదనకు దిగుతున్నాడు.

ఇలాంటి సున్నితమైన అంశాలు ఎలక్టానిక్ మీడియా (టివీ మీడియా) వాళ్లకు ఆయువుపట్టుగా మారాయి. టీవీలున్నవి సమాజహితంకోసం. కానీ దురదృష్టవశాత్తు టీవీల్లో రెచ్చగొట్టే చర్చలు ఎక్కువయ్యాయి. వీటికి తోడు కుహనా సెక్యులర్ వాదులకూ, రాజకీయపార్టీలవారికి – కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లయింది. అందుకే గత కొద్ది రోజులుగా దేశంలో గోవధ- గోమాంస భక్షణ అన్నది అత్యంత ప్రధాన టాపిక్ గా మారిపోయింది. అభివృద్ధి చెందుతున్న దేశంలో మనం సాధించుకోవాల్సినవి చాలానే ఉండగా, ఆవుమాంసం తినడం లేదా తినకపోవడమే అత్యంత కీలకమైనదిగా చిత్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే కొన్ని శక్తులు ఇప్పుడు రాజ్యమేలుతున్నాయి.

`నేను ఇవ్వాళ వంకాయ కూర తిన్నాను’ – అని అంటే ఎవ్వరూ పట్టించుకోరు.

`నేను ఈరోజు చికెన్ తిన్నాను’ – అన్నప్పుడూ – నో కామెంట్స్

`ఇవ్వాళ నేను ఆవు మాంసం తిన్నాను’ – అనగానే పక్కలో బాంబుపేలినట్లు ఫీలైపోతున్నారు. దీనిపై రభస మొదలవుతోంది.

అది తినకూడదని ఒకడు, అదే తింటానని మరొకడు. `తింటే చంపుతా’ అని ఇంకొకడు. `తింటున్నాను ఏం చేస్తారో చేయండని’… రెచ్చగొట్టే గొంతులు కొన్ని. అభివృద్ధి కోణంలో చూస్తే వీటికి పైసా విలువలేదు. రెండు వైపులా తప్పులున్నాయి. అసలు దేశానికి అవసరమైన అభివృద్ధిని గురించి పట్టించుకోకుండా, సమైక్యతను, సామరస్యాన్ని ఫణంగాపెట్టి వాచాలత్వాన్ని ప్రదర్శిస్తున్న ఈ శక్తుల అంతరార్థమేమిటో తెలుసుకోవాలి. గోమాంసం తినడమన్నది చాలాప్రాచీనమైన విషయం. అలాగే తినకూడదు, ఆవుని పూజించాలన్నదీ అంతే ప్రాచీనమైనది. ముందే చెప్పినట్లు వేలాది సంవత్సరాల చరిత్రను తవ్వుతుంటే ఎవరికి అనుకూలమైనది వారికి కచ్చితంగా దొరుకుతుంది. వాటిని పట్టుకుని వ్రేలాడటం శుద్ధ మూర్ఖత్వం.

ఈమధ్యనే 87ఏళ్ల శాస్త్రవేత్త పీఎం భార్గవ గారు ఆయుర్వేదాన్ని ఉటంకిస్తూ అనేక రోగాలను ఆవు మాంసంతో నయంచేయవచ్చని చెప్పారు. ఈయనగారికి 1986లో భారతప్రభుత్వం ఇచ్చిన పద్మభూషణ్ అవార్డును తిరిగి ఇచ్చేస్తూ రాష్ట్రపతికి లేఖరాశారు. ఆయుర్వేద ఆచార్యులైన చరకుడు తన సంహితలో గోవు మాంసం తింటే ఫలానా రోగాలు నయమవుతాయని చెప్పడాన్ని ఈ లేఖలో ఉటంకించారు. చరక సంహితను తప్పుపట్టడంకాదుకానీ, వాస్తవకోణాలను పరిశీలిస్తే, వివిధ చికిత్స విధానాలు లేనిరోజుల్లో వారివారి పరిశోధనలు, ఫలితాల మేరకు రాసిన అంశాలుగానే వాటిని భావించాలి. అలాంటి అంశాలను చక్కబుచ్చుకుని మాట్లాడటం సరైనపద్ధతికాదన్నది నా అభిప్రాయం. పూర్వం ప్రతిగ్రామంలో ఒక వైద్యుడుండేవాడు. ఆయన పరిశోధనలు, ఫలితాలనుబట్టి వైద్యంచేసేవాడు. ఇందులో భాగంగానే గద్ద మాంసం తినమని చెప్పవచ్చు. లేదా పాము మాంసం తినమని చెప్పనూవచ్చు. జానపద సినిమాల్లో చూపించినట్లు పులిపాలు తీసుకురమ్మనమనీ ఆదేశించవచ్చు. ఇందులో ఏవి ఎంతవరకు సత్ఫలితాలను ఇచ్చాయో ఇప్పుడు మనం లెక్కలు తీయలేము.

ఈమధ్య నా స్నేహితుడొకడు. తులసి దళం నోట్లో వేసుకుంటే మహాపాపమంటూ ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. ఎందుకంటే తులసిని కూడా మాతగా భావిస్తాము. అలాంటి తులసీమాతను తినడమేమిటన్నది వాడి వాదన. తులసి వైద్యానికి మంచిదే కదా అలాంటప్పుడు దాన్ని నోట్లో వేసుకోవడం పాపమని అడ్డంగా వాదించాడతను. అలాగే గంగను పవిత్రమైన దేవతాగా ఆరాధిస్తాము. అలాంటి గంగామాతను (నీళ్లను) నోట్లో పోసుకుని పుక్కిలించడం అపవిత్రమని వాదించవచ్చు.

ఏరకంగానైనా అడ్డంగా వాదించవచ్చు. అయితే ఇలాంటి వాదనల వల్ల సమాజం, దేశం) ఏంకోల్పోతున్నదో అర్థంచేసుకోవాలి. ప్రస్తుతం గ్లోబలైజేషన్ కారణంగా అభివృద్ధికి పెద్దపీట వేసే అవకాశాలున్నాయి. దాన్ని సద్వినియోగం చేసుకోవాలేకానీ, చరిత్రను తవ్వుతూ అప్రయోజనమైన వాదనలకు దిగడం తప్పు. దురదృష్టవశాత్తు ఇరు వర్గాల వారు ప్రస్తుతం చేస్తున్నది అదే. కేవలం రెండు ఆలోచనలతో రెచ్చిపోతున్నవారు `మూడవ కోణం’ గురించి మరచిపోతున్నారు. సామరస్యం, శాంతి, అహింస సిద్ధాంతాలకు ఆనవాలమైన భరతభూమిలో అశాంతి, అసహనం సృష్టిస్తున్నారు.

మన విజన్ మారాలి. వాస్తవాలపై దృష్టిపెట్టాలి. ప్రజలకు ఏమికావాలో దాని గురించి ఆలోచిద్దాం. అప్పుడు మూడవ కోణంవద్ద వెలుగులు నిండుతాయి.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హిందూ ధర్మ పరిరక్షణే తిరుపతిలో టీడీపీ అస్త్రం..!

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో తెలుగుదేశం పార్టీ ప్రచార వ్యూహాన్ని ఖరారు చేసుకుంది. ఎప్పటిలా అభివృద్ధి చేస్తామనో.. మరొకటో చెప్పడం లేదు. ట్రెండ్‌కు తగ్గట్లుగా.. హిందూత్వాన్ని.. హిందూ ధర్మాన్నే హైలెట్ చేసుకోవాలని నిర్ణయించింది. అందుకే.....

కేక్ క‌ట్ చేసి హ‌ర్ట్ చేసిన విజ‌య్ సేతుప‌తి

ఈరోజు విజ‌య్ సేతుప‌తి బ‌ర్త్ డే. త‌మిళంలో త‌నో పెద్ద స్టార్‌. తెలుగులోనూ అభిమానుల్ని ఏర్ప‌ర‌చుకుంటున్నాడు. అయితే.. త‌న పుట్టిన రోజున అనుకోని వివాదంలో ప‌డ్డాడు విజ‌య్ సేతుప‌తి. ఆ త‌ర‌వాత‌.. త‌న...

“డీపీఆర్‌”ల కోసం సీఎంల వెంట పడుతున్న షెకావత్..!

పిట్టపోరు పిల్లి తీర్చిందంటున్నట్లుగా అయింది తెలుగు రాష్ట్రాల మధ్య జల పంచాయతీ. ఎలాంటి లొల్లి లేకుండా ఎవరి ప్రాజెక్టులు వారు కట్టుకుంటే.. కేంద్రానికి ఫిర్యాదు చేసేవాళ్లు ఉండేవారు కాదు. కానీ రాజకీయం కోసం.....

వ్యాక్సిన్‌పై నెగెటివ్‌ ప్రచారం కట్టడి ఎలా..?!

కరోనా వ్యాక్సిన్ కోసం ప్రజలు అంత ఆతృతగా ఎదురు చూడటం లేదు. అదేదో కరోనా నుంచి కాపాడే వజ్రాయుధం అని ప్రజలు అనుకోవడం లేదు . దాని వల్ల కొత్త సమస్యలు వచ్చి...

HOT NEWS

[X] Close
[X] Close