బిల్లులపై చర్చలు చేయకుండా మత సహనంపై చర్చలు ఎందుకో?

అది పార్లమెంటు కావచ్చు అసెంబ్లీ కావచ్చు లేదా జిల్లా పరిషత్ సమావేశం కావచ్చును. వాటిలో ప్రజా ప్రతినిధులు ప్రజా సమస్యలు, అభివృద్ధి సంక్షేమం వంటి అంశాలపై అర్ధవంతమయిన చర్చలు జరిపి మంచి పరిష్కారాలు కనుగొంటారని ప్రజలు ఆశిస్తుంటారు. కానీ వారిది అత్యాశని ప్రజాప్రతినిధులు నిరూపించి చూపుతుంటారు. కోట్లు ఖర్చుపెట్టి నిర్వహిస్తున్న పార్లమెంటు సమావేశాలలో అధికార, ప్రతిపక్ష ఎంపీల మధ్య జరుగుతున్న అర్ధం పర్ధం లేని వాగ్వాదాలు చూస్తున్న ప్రజలకు తీవ్ర నిరాశ కలుగక మానదు. సీపీఎం పార్టీ లోక్ సభ సభ్యుడు సలీం మాట్లాడుతూ “పృథ్వీరాజ్ చౌహాన్ తరువాత మళ్లీ 800 ఏళ్లకు దేశంలో హిందూ రాజ్య స్థాపన జరిగిందని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు,” అని ఆరోపించారు. దానితో సభలో ఒక్కసారిగా అధికార, ప్రతిపక్షాలు కేకలు వేసుకొన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యపై హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చాలా తీవ్రంగా స్పందించారు. “ఒకవేళ అంత భాద్యతారహితంగా నేను మాట్లాడి ఉండి ఉంటే ఈ పదవిలో ఒక్క నిమిషం ఉండేందుకు కూడా నేను అర్హుడిని కాను. నేనెప్పుడు అటువంటి మాటలు మాట్లాడలేదు..మాట్లాడబోను కూడా. ఒకవేళ సలీం వద్ద ఆధారాలు ఉంటే దానిని బయటపెట్టాలి లేకుంటే బేషరతుగా క్షమాపణలు చెప్పాలి,” అని అన్నారు.

అప్పుడు సలీం వెనక్కి తగ్గి ఉండి, తప్పును అంగీకరించి ఉండి ఉంటే చాలా హుందాగా ఉండేది. కానీ ఆయన హోం మంత్రికి జవాబిస్తూ “నేనేమీ ఆర్.ఎస్.ఎస్. సమావేశంలో కూర్చొని ఈ మాటలు వినలేదు. ఏదో ఒక పత్రికలో వచ్చిన వార్తలను మీ ముందు ఉంచాను అంతే! ఒకవేళ అది తప్పని భావిస్తే సదరు పత్రికపై కేసు వేసుకోవచ్చును,” అని అన్నారు. ఆయన చెప్పిన జవాబుతో సభలో మళ్ళీ రాద్దాంతం జరిగింది…సభ వాయిదా పడింది.

ఎంపీలు అంటే వారి మాటకు చాలా విలువ, అర్ధం, ఒక ప్రయోజనం కలిగి ఉండాలి. కానీ అధికార, ప్రతిపక్ష పార్టీ ఎంపీల మధ్య జరిగుతున్న ఈ వాగ్వాదం వలన విలువయిన పార్లమెంటు సమయం వృధా అవడం తప్ప వేరేమి ప్రయోజనం లేదు. ఈసారి పార్లమెంటు సమావేశాలలో మొత్తం 36 ముఖ్యమయిన బిల్లులపై అర్ధవంతమయిన చర్చలు జరిపి లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్ది ఆమోదించవలసి ఉంది. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జి.ఎస్.టి. బిల్లు కూడా వాటిలో ఒకటి. ఈ సమావేశాల్లోనే ఆ బిల్లును ఎలాగయినా ఆమోదింపజేసుకోవాలని మోడీ ప్రభుత్వం భావిస్తోంది. దానికి కాంగ్రెస్ పార్టీ మూడు సవరణలు సూచిస్తోంది. అటువంటప్పుడు ఆ బిల్లుపై చర్చించకుండా అధికార, ప్రతిపక్ష ఎంపీలు ఇటువంటి అనవసరమయిన వాగ్వాదాలతో కాలక్షేపం చేస్తుండటం చాలా దురదృష్టం. పార్లమెంటులో క్షుణ్ణంగా చర్చించాల్సిన బిల్లుని ప్రధాని నరేంద్ర మోడి, డా. మన్మోహన్ సింగ్, సోనియాగాంధీ ముగ్గురూ కలిసి టీ తాగుతూ దానిపై చర్చించి ఒక నిర్ణయానికి రావడాన్ని ఏమనుకోవాలి? అందరూ ఆలోచించవలసిన విషయం ఇది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com