కాపులకు రిజర్వేషన్ వల్ల బీసీలకు అన్యాయం జరగదన్న యనమల

హైదరాబాద్: కాపులకు రిజర్వేషన్ కల్పించే విషయమై కమిటీని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ నిర్ణయించింది. విజయవాడలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. వీటిని యనమల, నారాయణ తదితర మంత్రులు మీడియాకు వెల్లడించారు. కాపులను బీసీల్లో చేర్చటంపై ఒక కమిషన్ ఏర్పాటు చేసి రిటైర్డ్ జడ్జిలతో అధ్యయనం చేయిస్తారు. కాపు కమిషన్ సభ్యులను 2,3 రోజుల్లో నిర్ణయిస్తామని మంత్రి యనమల చెప్పారు. 9 నెలల్లో కమిషన్ తన నివేదికను అందిస్తుందని, ఆ నివేదిక అందిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాపులను బీసీలలో చేర్చటం వల్ల బీసీలకు అన్యాయం జరగబోదని, వారికి రిజర్వేషన్‌లు యధాతథంగా ఉంటాయని స్పష్టీకరించారు. వచ్చే ఏడాదినుంచి జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించాలని కూడా సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్రంలోని 5 రేవుల అభివృధ్ధికోసం గుజరాత్ తరహాలో మ్యారిటైమ్ బోర్డ్ ఏర్పాటు చేయాలని తీర్మానించారు. నాయీ బ్రాహ్మణ, రజక కులాల అబివృద్ధికోసం కూడా ఫెడరేషన్‌లు ఏర్పాటు చేయనున్నారు. కరవు నివారణకోసం అనంతపురం జిల్లాలో లక్ష చెరువులు, మిగిలిన జిల్లాలలో 6 లక్షల చెరువులు తవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. పట్టణాభివృద్ధి సంస్థల ఏర్పాటుపై వచ్చే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. బలహీనవర్గాలకోసం చంద్రన్న ఆదరణ పథకం అమలు చేస్తామని యనమల చెప్పారు. మత్స్యకారులను ఎస్సీల్లో చేర్చాలని, వాల్మీకులను ఎస్టీల్లోకి చేర్చాలని డిమాండ్లు వస్తున్నాయని, వాటిని పరిశీలిస్తున్నామని తెలిపారు. డిసెంబర్ 1 నుంచి 14 వరకు జనచైతన్య యాత్రలు నిర్వహిస్తామని వెల్లడించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com