హైదరాబాద్ లో మరోసారి క్రెడాయ్ ప్రాపర్టీ షో నిర్వహించనున్నారు. 2026 ఫిబ్రవరి 6 నుండి 8వ తేదీ వరకు మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఈ మెగా ప్రాపర్టీ షోను నిర్వహించనున్నట్లు క్రెడాయ్ హైదరాబాద్ ప్రతినిధులు అధికారికంగా ప్రకటించారు. ఈసారి ‘పర్మనెంట్ హో జావో’ అనే వినూత్న థీమ్‌తో ఈ ప్రదర్శనను నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ విపరీతమైన పోటీతో, వేగంగా మారుతున్న ధరలతో ఉంది. ఈ తరుణంలో ఇంటి కొనుగోలుదారులు గందరగోళానికి గురికాకుండా, నమ్మకమైన బిల్డర్లు మరియు ప్రాజెక్టులను ఒకే వేదికపైకి తీసుకురావడమే ఈ షో ప్రధాన ఉద్దేశ్యం. ‘పర్మనెంట్ హో జావో’ అనే నినాదం ద్వారా అద్దె ఇళ్ల కష్టాల నుండి విముక్తి పొంది, శాశ్వతంగా సొంతింట్లో స్థిరపడాలని కొనుగోలుదారులను క్రెడాయ్ ప్రోత్సహిస్తోంది.
మూడు రోజుల ప్రదర్శనలో హైదరాబాద్‌లోని అన్ని ప్రధాన ప్రాంతాలకు చెందిన అపార్ట్మెంట్లు, విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులు , ప్లాట్లను ప్రదర్శిస్తారు. వెస్ట్ హైదరాబాద్‌లోని కోకాపేట, గచ్చిబౌలి వంటి ప్రీమియం ఏరియాలతో పాటు, అభివృద్ధి చెందుతున్న ఇతర శివారు ప్రాంతాల ప్రాజెక్టులను కూడా ఇక్కడ చూడొచ్చు.
ఈ షోలో దేశంలోని ప్రముఖ బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలు తమ హోమ్ లోన్ ఆఫర్లను కూడా వివరించనున్నాయి. అక్కడికక్కడే రుణాల అర్హతను తనిఖీ చేసుకునే సౌకర్యం ఉండటం అదనపు ఆకర్షణ. రియల్ ఎస్టేట్ రంగంలో నూతన సాంకేతికత మరియు ప్రభుత్వ నిబంధనలపై కూడా అవగాహన కల్పించేలా ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దుతున్నారు. క్రెడాయ్ ఆధ్వర్యంలో జరిగే ప్రదర్శన కావడంతో, ఇక్కడ రిజిస్టర్ అయ్యే ప్రాజెక్టులపై వినియోగదారుల్లో మంచి నమ్మకం ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
