తెలంగాణ కొత్త డీజీపీ ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. 1991వ బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్‌ను రాష్ట్ర పోలీస్ బాస్ గా నియమించేందుకు ప్రభుత్వం దాదాపు రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయనకు, క్షేత్రస్థాయిలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు పరిపాలనలో ఉన్న అపార అనుభవం కలిసి రానుంది. యూపీఎస్సీ ప్రతిపాదించిన ముగ్గురు పేర్లు సీవీ ఆనంద్, వినాయక్ ప్రభాకర్ ఆప్టే, సౌమ్యా మిశ్రాల్లో.. సీవీ ఆనంద్ వైపే ముఖ్యమంత్రి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుత డీజీపీ బి. శివధర్ రెడ్డి పదవీ కాలం ఈ ఏప్రిల్ నెలాఖరుతో ముగియనుంది. నిజానికి శివధర్ రెడ్డి 1994 బ్యాచ్ అధికారి కాగా, సీవీ ఆనంద్ ఆయన కంటే సీనియర్ 1991 బ్యాచ్ . గతంలో కొన్ని అనివార్య కారణాల వల్ల శివధర్ రెడ్డికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించాల్సి వచ్చింది. ఇప్పుడు నిబంధనల ప్రకారం యూపీఎస్సీ ప్యానెల్ ద్వారా పూర్తిస్థాయి డీజీపీని నియమించాల్సి ఉండటంతో, సీనియారిటీ ప్రాతిపదికన సీవీ ఆనంద్‌కు లైన్ క్లియర్ అయ్యింది.
ప్రస్తుతం తెలంగాణ క్యాడర్లో సీవీ ఆనంద్ కంటే సీనియర్లు ఎవరూ అందుబాటులో లేరు. 1989, 1990 బ్యాచ్‌లకు చెందిన అధికారులు ఇప్పటికే పదవీ విరమణ పొందడం లేదా కేంద్ర సర్వీసుల్లో ఉండటంతో ఆనంద్ రాష్ట్రంలో అత్యంత సీనియర్ అధికారిగా నిలిచారు. ప్యానెల్‌లోని మిగిలిన ఇద్దరు అధికారులు వినాయక్ ప్రభాకర్ ఆప్టే, సౌమ్యా మిశ్రా ఇద్దరూ 1994వ బ్యాచ్‌కు చెందిన వారే. అంటే ఆనంద్ వారందరి కంటే దాదాపు మూడేళ్లు సీనియర్ కావడం ఆయనకు అతిపెద్ద ప్లస్ పాయింట్.
మరో ముఖ్యమైన కారణం ఏమిటంటే, సీవీ ఆనంద్ కు 2028 మే వరకు సర్వీసు ఉంది. అంటే ప్రభుత్వం ఆయనను నియమిస్తే కనీసం రెండేళ్లకు పైగా పదవిలో కొనసాగే అవకాశం ఉంటుంది. వినాయక్ ఆప్టే సుదీర్ఘ కాలంగా కేంద్ర సర్వీసుల్లో ఉండటం, రాష్ట్ర పరిస్థితులపై ఆనంద్‌కు ఉన్న పట్టు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఆయన పేరునే ఖరారు చేయనుంది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.
