బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని చెప్పడానికి కడియం శ్రీహరి చాలా మొహమాటపడ్డారు. చివరికి తప్పదన్నట్లుగా స్పీకర్ కు లేఖ రాశారు. తాను కాంగ్రెస్ లో చేరలేదని.. బీఆర్ఎస్ సభ్యత్వాన్ని వదులుకోలేదని ఆ లేఖ సారాంశం. ఆయనపై ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేను పిలిచి స్పీకర్ క్రాస్ ఎగ్జామిన్ చేసిన తర్వాత కడియం పార్టీ మారినట్లుగా ఆధారాల్లేవని ప్రకటించే అవకాశం ఉంది. మొత్తం ఐదుగురికి క్లీన్ చిట్ ఇచ్చారు. నలుగురుకి క్లీన్ చిట్ ఖాయం. ఒక్క దానం పరిస్థితే గందరగోళంగా ఉంది.
దానం నాగేందర్ కూడా బీఆర్ఎస్ కు రాజీనామా చేయలేదు. కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అని స్పీకర్ కు సమాధానం పంపవచ్చు. కానీ ఆయన సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. దీన్ని కాదనలేరు. కానీ ఆయన తాను బీఆర్ఎస్ సభ్యత్వాన్ని వదులేకోలేదని కడియం చెప్పినట్లుగా చెబితే స్పీకర్ దాన్నే ప్రామాణికంగా తీసుకుని నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. కానీ దానం మాత్రం అలాంటి సమాధానం ఇవ్వడానికి ఆసక్తి చూపించడం లేదు.
పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో 19వ తేదీన విచారణ జరిగే అవకాశం ఉంది. గతంలో చీఫ్ జస్టిస్ గవాయ్ ఉన్న బెంచ్ విచారణ జరిపింది. ఇప్పుడు చీఫ్ జస్టిస్ గా సూర్యకాంత్ ఉన్నారు. విచారణలో ఆయన ఎలా స్పందిస్తారన్నదానిపై స్పీకర్ తదుపరి నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు స్పందనను బట్టే దానం నాగేందర్ రాజీనామానా.. సాగదీతనా అన్నది తెలుస్తుంది. అనర్హతా వేటు మాత్రం వేసే అవకాశం లేదు.
