తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశం ఇప్పుడు క్లైమాక్స్ దశకు చేరుకుంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకున్నారు. ఇంకా ముగ్గురిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సుప్రీంకోర్టు రెండు వారాల గడువు ఇచ్చింది. ఈ ముగ్గురిలో కడియం శ్రీహరి,సంజయ్‌లు కూడా పార్టీ మారలేదని.. కాంగ్రెస్‌లో చేరలేదని తీర్పు ఇస్తారు. అయితే, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పరిస్థితి వీరందరికంటే భిన్నంగా ఉంది. ఆయన కేవలం పార్టీ కండువా కప్పుకోవడమే కాకుండా, ఏకంగా కాంగ్రెస్ తరపున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల ఆయనపై అనర్హత వేటు వేయకుండా తప్పించుకోవడం అతిపెద్ద సవాలుగా మారింది.
కాంగ్రెస్, దానం ముందు రెండు మార్గాలు
దానం నాగేందర్ విషయంలో కాంగ్రెస్ ముందు ప్రధానంగా రెండు మార్గాలు కనిపిస్తున్నాయి. ఒకటి, ఆయన చేత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లడం. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుతో వచ్చిన ధీమాతో, ఖైరతాబాద్‌లో కూడా గెలవగలమనే నమ్మకంతో ప్రభుత్వం ఈ సాహసం చేయవచ్చు. దానం కూడా నేను రెడీ అని ప్రకటిస్తున్నారు. కానీ, ఫిరాయింపు ఎమ్మెల్యేతో తప్పని సరి పరిస్థితుల్లో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లడం రాజకీయంగా కొంత రిస్క్. ఏదైనా న్యాయపరమైన లూప్‌హోల్‌ను వెతకడం రెండో మార్గం. అయితే, సుప్రీంకోర్టు ఇప్పటికే ఈ విషయంలో తీవ్ర ఆగ్రహంతో ఉంది. నవంబర్‌లో స్పీకర్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు కూడా ఇచ్చింది. దానం విషయంలో నిర్ణయం నాన్చితే నేరుగా సుప్రీంకోర్టు నుంచి చీవాట్లు తినక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.
ఇంకా స్పీకర్‌కు సమాధానం ఇవ్వని దానం
ప్రస్తుతానికి దానం నాగేందర్ ఇంకా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయకపోవడం, స్పీకర్ సమయం ఇస్తూ ఉండటం గమనిస్తే.. ఈ వ్యవహారాన్ని వీలైనంత వరకు సాగదీసే వ్యూహం కనిపిస్తోంది. ఒకవేళ స్పీకర్ ఏవో సాంకేతిక కారణాలు చూపి దానంను కూడా అనర్హుడిగా ప్రకటించకపోతే, అది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక వింత నిర్ణయంగా మిగిలిపోతుంది. బహిరంగంగా వేరే పార్టీ గుర్తుపై పోటీ చేసిన వ్యక్తిని కూడా పార్టీ మారలేదు అని స్పీకర్ తీర్పు ఇస్తే, అది న్యాయస్థానాల్లో నిలబడటం అసాధ్యం. ఏదో ఒక మలుపు తిప్పి దానంపై అనర్హత వేటు పడకుండా మేనేజ్ చేయాలని చూస్తే, అది స్పీకర్ పదవికి ఉన్న నైతికతను ప్రశ్నార్థకం చేస్తుంది.
బీఆర్ఎస్ న్యాయపోరాటం కీలకం
స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత బంతి బీఆర్ఎస్ కోర్టులోకి వెళ్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ లీగల్ టీమ్ సిద్ధంగా ఉంది. స్పీకర్ ఇచ్చే ప్రతి క్లీన్ చిట్ పైన హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో సవాలు చేసే అవకాశం ఉంది. గతంలో కర్ణాటక, మహారాష్ట్ర కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను బట్టి చూస్తే, స్పీకర్ నిర్ణయం ఫైనల్ అయినప్పటికీ అది జ్యుడీషియల్ రివ్యూ కు లోబడి ఉంటుంది. కాబట్టి, అసెంబ్లీలో దక్కని ఊరట కోర్టుల్లో దక్కుతుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ కోర్టులు జోక్యం చేసుకుంటే, ఈ ఎమ్మెల్యేల భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉంది.
