హైదరాబాద్ విస్తరణకు ఎంతో అవకాశం ఉన్నా.. ఒక్క చోటే భారీ అంతస్తుల అపార్టుమెంట్లు నిర్మించి డెన్సిటీ పెంచుతున్నారని.. ఇది మంచిది కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దానికి ఆయన చాలా కారణాలు చెప్పారు. కానీ ఇప్పుడు ఆయన సీఎం అయ్యాక రికార్డు స్థాయిలో హై రైజ్‌లకు అనుమతి ఇవ్వడం వల్ల ఆదాయం వస్తోందని రేవంత్ ప్రభుత్వం ప్రకటిస్తోంది.
హైదరాబాద్‌లో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ పరిమితి లేదు. ఎన్ని అంతస్తులు అయినా నిర్మించుకునేందుకు అనుమతులు ఇస్తున్నారు. అందుకే రియల్టర్లు రెండు, మూడు ఎకరాల ప్లేస్‌లో యాభై, అరవై అంతస్తులు కట్టేస్తున్నారు. ఈ కారణంగా ట్రాఫిక్ జామ్‌లు, మౌలిక సదుపాయాలపై ఒత్తిడి, పచ్చదనం క్షీణత, భూములు-ఫ్లాట్ల ధరలు విపరీతంగా పెరగడం వంటి వాటికి కారణం అవుతున్నాయి. నిర్మాణ రంగ నిపుణులు, ఆర్కిటెక్టులు FSI నిబంధనలు తీసుకురావాలనే కోరుతున్నారు. నేషనల్ బిల్డింగ్ కోడ్ ప్రకారం, ఎకరానికి 30 నుంచి 100 నివాస యూనిట్లు మాత్రమే అనుమతించవచ్చు. మహానగరాల్లో 200 వరకు అనుమతిస్తారు. కానీ హైదరాబాద్‌లో ఐదు వందల యూనిట్లు నిర్మిస్తున్నట్లుగా ట్రెండ్స్ చూపిస్తున్నాయి.
ఎన్బీసీ ప్రకారం, ప్రతి మనిషికి 4 చదరపు మీటర్ల ఓపెన్ స్పేస్ ఉండాలి. కానీ హైదరాబాద్‌లో ఇది పూర్తిగా ఉల్లంఘిస్తున్నారు. సైబర్ టవర్స్ నుంచి నియోపోలిస్ వరకు ఒక్కటి కూడా విశాలమైన ఉద్యానవనం లేదు. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నియోపోలిస్ ప్రాంతాల్లో ఒక చదరపు కిలోమీటరులో 60కి పైగా టవర్లు నిర్మిస్తున్నారు. ఈ కారణంగా ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయి. భవిష్యత్ లో మౌలిక సదుపాయాలపై తీవ్ర ఒత్తిడి పడుతుందని ఇప్పటికైనా.. ఎస్ఎస్ఐ నిబంధనలు తేవాలన్నా డిమాండ్లను వినిపిస్తున్నారు. సీఎం రేవంత్ ది కూడా గతంలో ఇదే అభిప్రాయం. మరి ఆలోచిస్తారా?
