రివ్యూ: ద‌ర్బార్‌

తెలుగు360 రేటింగ్‌: 2.5/5

రోమ్‌లో ఉన్న‌ప్పుడు రోమ‌న్‌లా ఉండాలి.
ర‌జ‌నీతో సినిమా చేస్తున్న‌ప్పుడు ర‌జ‌నీలా ఆలోచించాలి. ఆయ‌న అభిమానిలా ఆలోచించాలి.
ర‌జ‌నీతో సూప‌ర్ హిట్లు తీసిన ద‌ర్శ‌కులంతా స‌రిగ్గా అదే చేశారు. ర‌జ‌నీ ఫ్యాన్స్‌కి కావ‌ల్సింద‌ల్లా ఇచ్చేశారు. ర‌జ‌నీ స్టైల్‌, మేన‌రిజం, మాసిజం క‌ల‌గ‌లిపిన ప్యాకేజీలు అందించేశారు. అలాంటి ప్యాకేజీ సినిమా చూసి చాలా రోజులైంది. కాలా, క‌బాలీలో అది మిస్స‌యిపోయింది. అయితే ఇప్పుడు మురుగ‌దాస్ మాత్రం ప‌క‌డ్బందీ ప్లానింగ్‌తో వ‌చ్చాడు. ర‌జ‌నీ ట్రేడ్ మార్కు హీరోయిజం, స్టైల్‌ని క‌ల‌గ‌లిపి ఓ మాస్ పోలీస్ క‌థ చెప్పాడు. అదే… ద‌ర్బార్‌!!

ముంబైకి కొత్త‌గా వ‌చ్చిన పోలీస్ క‌మీష‌న‌ర్ ఆదిత్య సింహాచ‌లం (ర‌జినీ‌ కాంత్‌). త‌నో ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్టు. కూతురు వ‌ల్లీ (నివేదా థామ‌స్‌) అంటే ప్రాణం. త‌న కోస‌మే… లిల్లీ (న‌య‌న‌తార‌) వెంట ప‌డ‌తాడు. మ‌రోవైపు ముంబైలోని డ్ర‌గ్స్ మాఫియాని ఏరిపారేస్తుంటాడు. ఈ డ్ర‌గ్స్ రాకెట్‌లో కీల‌క‌మైన వ్య‌క్తి అజ‌య్ మ‌ల్హోత్రా (ప్ర‌తీక్ బ‌బ్బ‌ర్)ని అరెస్ట్ చేస్తాడు. అయితే జైల్లో ఉండాల్సిన అజ‌య్ మ‌ల్హోత్రా మ‌లేసియాలో విలాసాలు చేస్తుంటాడు. ఈ విష‌యం తెలుసుకున్న ఆదిత్య సింహాచ‌లం త‌న తెలివితేట‌ల్ని ఉప‌యోగించి మ‌ల్హోత్రాని ఇండియాకి ర‌ప్పించి, పోలీసుల‌తోనే షూట్ చేయిస్తాడు. ఇక అంతా బాగుంది అనుకుంటున్న స‌మ‌యంలో.. వ‌ల్లీ ఓ కారు ప్ర‌మాదంలో మ‌ర‌ణిస్తుంది. వ‌ల్లీని చంపింది ఎవ‌రు? ఆదిత్య‌కు క‌నిపించ‌ని శ‌త్రువులు ఎవ‌రైనా ఉన్నారా? ఆదిత్య క‌ర్త‌వ్య నిర్వ‌హ‌ణ‌లో ఎదురైన అవ‌రోధాలేంటి? అనేదే ‘ద‌ర్బార్‌’ క‌థ‌.

క‌థ‌గా మురుగ‌దాస్ అద్భుతాలేం చేయ‌లేదు. నిజం చెప్పాలంటే చేయ‌ద‌ల‌చుకోలేదు. ర‌జ‌నీకాంత్ బ‌లం ఏమిట‌న్న‌ది చిన్న పిల్లాడ్ని అడిగినా చెప్పేస్తాడు. మురుగ‌దాస్‌కి తెలీకుండా ఎలా ఉంటుంది? అందుకే ఆ బ‌లాన్ని బ‌లంగా ఎలివేట్ చేసుకోగ‌లిగే స‌న్నివేశాలు రాసుకొని, దానికి అనుగుణంగానే ఓ క‌థ త‌యారు చేసుకున్నాడు. ర‌జ‌నీ కాంత్ గ‌త సినిమాల్లో క‌నిపించే మేన‌రిజం, స్టైల్స్, డైలాగులు అన్నీ ఈ సినిమాలో పుష్క‌లంగా రంగ‌రించాడు. అన్నింటికంటే ముఖ్యంగా ర‌జ‌నీని ఇంకాస్త యంగ్‌గా, ఎన‌ర్జిటిక్ గా చూపించ‌గ‌లిగాడు. ఎలివేష‌న్ల‌కు కొద‌వ లేకుండా చూసుకున్నాడు. ఫ్యాన్స్‌కి కావ‌ల్సింది ఇదే క‌దా? పైగా వీటి కోసం చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నాడు కూడా. తొలి స‌న్నివేశాలు ర‌జ‌నీ ఫ్యాన్స్‌ని మురిపిస్తాయి. ఓ క‌మీష‌న‌ర్ అయ్యుండి, త‌న కూతురి వ‌య‌సున్న అమ్మాయి(న‌య‌న‌తార‌)తో ల‌వ్ ట్రాక్ న‌డ‌పాల‌ని చూడ‌డం కాస్త ఇబ్బందిగా అనిపించే వ్య‌వ‌హార‌మే అయినా, దాన్ని కూడా ఫ్యాన్స్‌ని దృష్టిలో ఉంచుకునే రాశాడ‌నిపిస్తుంది. ఓ వైపు ముంబై లోని డ్ర‌గ్స్ మాఫియాని ఏరేస్తూనే, పార్ట్ టైమ్ జాబ్‌లా… లిల్లీ వెంట‌ప‌డుతుంటాడు. కాస్త సీరియ‌స్ ఎమోష‌న్‌, ఆ వెంట‌నే ర‌జ‌నీ ట్రేడ్‌మార్క్ రొమాన్స్‌. ఇలా సాగింది స్క్రీన్ ప్లే.

మురుగ‌దాస్ మామూలు ద‌ర్శ‌కుడు కాదు. త‌న తెలివితేట‌లు గ‌త సినిమాల్లోనే చూశాం. త‌న ట్విస్టులు స్క్రీన్ ప్లే జిమ్మిక్కులు బాగుంటాయి. ఆ స్టైల్‌, ఆ మార్క్ మిస్స‌యింది అనుకుంటున్న స‌మ‌యంలో ఇంట్ర‌వెల్‌కి ముందు న‌డిచిన డ్రామా – ఆ లోటు తీర్చేస్తుంది. అజ‌య్ మ‌ల్హోత్రాని ఇండియాకి ర‌ప్పించి, త‌న ప్లాన్ ప్ర‌కారం చంపిస్తాడు. ఆ ఎపిసోడ్ మురుగ‌మార్క్ స్క్రీన్ ప్లేకి నిద‌ర్శ‌నం. దాంతో ఫ‌స్టాఫ్‌లో చిన్న పాటి కంప్లైంట్స్ ఉన్నా – పాసైపోతుంది. ర‌జ‌నీ అభిమానులు మాత్రం సంతృప్తిగానే థియేట‌ర్ల‌నుంచి బ‌య‌ట‌కు వ‌స్తారు. అయితే సెకండాఫ్‌లో స‌మ‌స్య మొద‌లైంది. త‌న కూతుర్ని ఎవ‌రు చంపార‌న్న‌ది ఆడియ‌న్స్‌కి ముందే తెలిసిపోతుంది. హీరో మాత్రం హంత‌కుడి కోసం అన్వేషిస్తుంటాడు. ఈ డ్రామాని వీలైనంత త్వ‌ర‌గా ముగించాల్సింది. కానీ మురుగ‌దాస్ దాన్ని ప‌ట్టుకుని లాగాడు. హీరో – విల‌న్‌ల మ‌ధ్య దాగుడుమూత‌లాట ఎక్కువ సేపు న‌డిపాడు. ఏ విష‌య‌మైనా ప్రేక్ష‌కుడికీ, క‌థానాయ‌కుడికీ ఒకేసారి తెలియాలి. క‌థానాయ‌కుడి కంటే ప్రేక్ష‌కుడికి ముందే తెలిసిపోయిన విష‌యాన్ని ప‌ట్టుకుని లాగితే ఆడిటోరియం బోర్ ఫీల‌వుతుంది. `ద‌ర్బార్` విష‌యంలో అదే జ‌రిగింది. ఈ సినిమా మొత్తానికి రెండు కీల‌క‌మైన ఎపిసోడ్లు ఉన్నాయి. వాటిలో ఇంట్ర‌వెల్ ముందొక‌టి. క్లైమాక్స్ లో విల‌న్‌ని ప‌ట్టుకోవ‌డానికి హీరో ఉప‌యోగించే ఫార్ములా ఒక‌టి. ఇంట్ర‌వెల్ ముందు ఎపిసోడ్ ఎంత బాగా రాసుకున్నాడో – విల‌న్‌ని ప‌ట్టుకునే సీన్లు అంత పేల‌వంగా తీశాడు మురుగ‌దాస్‌. జైల్లో ఖైదీల‌కు సెల్‌ఫోన్లు ఇవ్వ‌డం, వాళ్ల ఫోన్ కాల్స్ ద్వారా విల‌న్‌ని ట్రాక్ చేయ‌డం – ఇవ‌న్నీ మ‌రీ ఇల్లాజిక‌ల్‌గా అనిపిస్తాయి. ఆసుప‌త్రి సీన్లు కూడా అంతే. పేషెంట్ ప్రాణాపాయ స్థితిలో ఉన్న‌ప్పుడు ఏడాక్ట‌రూ త‌న మానాన త‌న‌ని వ‌దిలేయ‌డు. త‌న‌వంతు ట్రీట్‌మెంట్ ఏదో చేస్తాడు. కానీ.. ఈ సినిమాలో అలాంటి ప్ర‌య‌త్నం ఏమీ ఉండ‌దు. వ‌ల్లీ చ‌నిపోయే ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోతో హీరోకి విల‌న్‌కి సంబంధించిన‌ క్లూ దొరుకుతుందేమో అని ప్రేక్ష‌కుడు భావిస్తాడు. కానీ ఆ వీడియోలోనూ ప్రేక్ష‌కుడికి తెలిసిన విష‌య‌మే వ‌ల్లీ చెబుతుంటుంది. ఇలాంటి నీర‌స‌మైన స్క్రీన్ ప్లే మురుగ‌దాస్ ఇదివ‌ర‌కెప్పుడూ రాయ‌లేదు. దాంతో ప్ర‌ధ‌మార్థంలో ప‌రుగులు తీసిన క‌థ‌ని ద్వీతీయార్థంలో తాళ్లు ప‌ట్టి వెన‌క్కి లాగిన ఫీలింగ్ వ‌స్తుంది.

‘వాళ్ల‌ని ఎన్‌కౌంట‌ర్ చేస్తే మీరొచ్చారు. మిమ్మ‌ల్ని చంపితే ఎవ‌రొస్తారు’ అంటూ మాన‌వ హ‌క్కుల సంఘం ప్ర‌తినిధిని అడుగుతాడు హీరో. అది హీరోయిజం ఎలివేట్ చేసే డైలాగ‌ని మురుగ‌దాస్ భావించి ఉంటాడు. కానీ ఈ మాట‌ని సెన్సార్ ఎలా ఒప్పుకుందో అర్థం కాదు. మాన‌వ‌హ‌క్కుల సంఘం జోలికి వెళ్లాలంటేనే ప్ర‌భుత్వాలు గ‌జ‌గ‌జ‌లాడిపోతాయి. అలాంటి చోట‌.. మాసిజం చూపించుకోవ‌డానికి ఇలాంటి డైలాగ్ వాడ‌తారా? న‌య‌న‌తార ల‌వ్ ట్రాక్ కేవ‌లం నిడివిని పొడిగించ‌డానికే అన్న‌ట్టు త‌యారైంది. విల‌న్‌కి భారీ బిల్డ‌ప్పులు ఇచ్చారు గానీ… ఆ పాత్ర భ‌య‌పెట్టిందేం లేదు. ర‌జ‌నీ స్టైల్‌, అక్క‌డ‌క్క‌డ మురుగ‌దాస్ మార్క్ మిన‌హాయిస్తే – ‘ద‌ర్బార్‌’లో వింత‌లూ విశేషాలేం క‌నిపించ‌వు.

ఈ వ‌యసులోనూ ర‌జ‌నీ ఎన‌ర్జీని చూసి ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. త‌న అభిమానుల కోసం ర‌జ‌నీ ఎంత క‌ష్ట‌ప‌డ‌తాడో ద‌ర్బార్ మ‌రోసారి నిరూపించింది. తొలి ఫైట్‌లోనూ, రైల్వే స్టేష‌న్ ఫైట్‌లోనూ ర‌జ‌నీ విజృంభ‌ణ క‌నిపిస్తుంది. త‌న ట్రేడ్ మార్క్ స్టెప్పుల‌తో అల‌రించాడు. ఈ సినిమాలో హీరోయిన్ అనే వ‌స్తువు ఉండాలి కాబ‌ట్టి న‌య‌న‌తార‌ని తీసుకొచ్చారు. అంత‌కు మించిన ప్రాధాన్యం లేదు. నివేదాకు మాత్రం చ‌క్క‌టి పాత్ర ల‌భించింది. దాన్ని త‌ను స‌ద్వినియోగం చేసుకుంది కూడా. తండ్రీ కూతుర్ల సెంటిమెంట్ లేక‌పోతే – ద‌ర్బార్ మ‌రింత రొటీన్ ఫార్ములా సినిమాలా త‌యార‌య్యేది. సునీల్ శెట్టిని మురుగ‌దాస్ స‌రిగా వాడుకోలేదు.

ర‌జ‌నీ అభిమానిగా అనిరుథ్ రెచ్చిపోయాడు. `త‌లైవా.. త‌లైవా` అనే బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో విజృంభించేశాడు. సీన్‌లో ఊపులేక‌పోయినా అనిరుథ్ ఆర్‌.ఆర్‌తో ఆహ‌డావుడి వ‌చ్చేస్తుంది. మురుగ‌దాస్ సినిమాల్లో సాంకేతిక అంశాల‌కు సంబంధించి ఎలాంటి లోటూ ఉండ‌దు. అయితే స్క్రీన్ ప్లే విష‌యంలో తానే ఇబ్బంది ప‌డ్డాడు. కేవ‌లం ర‌జ‌నీ ఫ్యాన్స్‌ని దృష్టిలో ఉంచుకుని తీసిన సినిమా ఇది. ఆ ప్ర‌య‌త్నంలో త‌న మార్క్ మిస్స‌య్యింది. త‌మిళ‌నాట‌ ఈ సినిమా సక్సెస్ అవ్వొచ్చు కానీ తెలుగులో అలాంటి ప‌రిస్థితి ఉండ‌క‌పోవొచ్చు. ఈ సినిమాకి పోటీగా మూడు తెలుగు సినిమాలు విడుద‌ల అవుతున్నాయి. ఈలోగానే ర‌జ‌నీ వీలైన‌న్ని వ‌సూళ్లు రాబట్టుకోవాల్సివుంది.

ఫినిషింగ్ ట‌చ్‌: జ‌స్ట్.. ఏక్ బార్‌

తెలుగు360 రేటింగ్‌: 2.5/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హ‌మ్మ‌య్య… చెన్నై గెలిచింది!

చెన్నై సూప‌ర్ కింగ్స్ అభిమానుల‌కు శుభ‌వార్త‌. వ‌రస ప‌రాజ‌యాల‌కు చెన్నై బ్రేక్ వేస్తూ.. ఓ చ‌క్క‌టి విజ‌యాన్ని అంకుంది. అందులోనూ వ‌రుస విజ‌యాల‌తో ఊపులో ఉన్న‌... బెంగ‌ళూరు జోరుని అడ్డుకుంది. ఫ‌లితం.. చెన్నై...

ప‌వ‌న్ వ‌స్తే… లెక్క‌ల‌న్నీ మారాల్సిందే

ఎట్ట‌కేల‌కు `అయ్య‌ప్ప‌యుమ్ కోషియ‌మ్‌` రీమేక్‌కి ప‌వ‌న్ క‌ల్యాణ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు. దాంతో ఈ రీమేక్ పై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. బాల‌కృష్ణ - ర‌వితేజ‌, రానా - ర‌వితేజ‌... ఇలా చాలా...

నిమ్మగడ్డ వర్సెస్ ప్రవీణ్..! చివరికి సారీ..!

ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి, సీఎం దగ్గర ఎంతో పలుకుబడి ఉన్న అధికారిగా పేరున్న ప్రవీణ్ ప్రకాష్.. నిమ్మగడ్డ విషయంలో అత్యుత్సాహంతో వ్యవహరించి.. చివరికి క్షమాపణలు చెప్పిన వైనం అధికారవర్గాల్లో కలకలం...
video

అఫీషియ‌ల్‌: `అయ్య‌ప్ప‌యుమ్ కోషియ‌మ్‌` లో ప‌వ‌న్

https://www.youtube.com/watch?v=80G4PhM-t90&feature=youtu.be మ‌ల‌యాళ చిత్రం `అయ్య‌ప్ప‌యుమ్ కోషియ‌మ్‌` రీమేక్‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తాడా? లేదా? అనే సందేహానికి తెర‌ప‌డింది. ఈ రీమేక్‌లో ప‌వ‌న్ చేస్తున్నాడ‌న్న‌ది ఖ‌రారైంది. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది....

HOT NEWS

[X] Close
[X] Close