ప్రేమమ్ ఆడియో వేడుకలో నాగచైతన్య – సమంతల ప్రేమ కథ గుట్టు విప్పుతారని అందరూ ఆశ పడ్డారు. నాగార్జున మాటల్లోనో, నాగచైతన్య మాటల్లోనో, అఖిల్ స్పీచ్లోనో చైతూ ప్రేమకథ బయటపడుతుందని భావించారు. కానీ చిత్రంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన దాసరి నారాయణ రావు ప్రసంగంలో చైతూ లవ్ స్టోరీ వినిపించింది. ప్రేమమ్ ఆడియో ఫంక్షన్‌కి ముఖ్య అతిథిగా విచ్చేసి ఆడియో సీడీలను ఆవిష్కరించారు దాసరి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమంత ప్రస్తావన తీసుకొచ్చారు. చైతూ నవ్వుతోనే ఏదో మాయ చేస్తాడని, అదే మాయతో ఓ హీరోయిన్ని పడగొట్టేశాడని చమత్కరించారు దాసరి. ఆ హీరోయిన్ పేరు చెప్పకపోయినా… ఏమాయ చేశావేతో అందర్ని ఆకట్టుకొన్న ఆ హీరోయిన్ అంటూ… నొక్కి మరీ చెప్పి సమంతనే అనే అర్థం వచ్చేలా మాట్లాడారు.
దాసరి సమంత గురించి ప్రస్తావిస్తున్నంత సేపూ… చైతూ ముసి ముసిగా నవ్వుతూనే ఉన్నాడు. నాగార్జున, అఖిల్‌లు చైతూ లవ్ స్టోరీ గుట్టు విప్పలేదు. చైతూ కూడా సమంత గురించి ఏం మాట్లాడలేదు. అయితే దాసరి సమంత టాపిక్ తీసుకుని రావడం, చైతూ – సమంతల లవ్ ఖాయం చేయడం ప్రేమమ్ ఆడియో ఫంక్షన్‌కి హైలెట్‌గా నిలిచింది. ప్రేమ కథలు చేయాలంటే అక్కినేని కుటుంబమే చేయాలని నాగేశ్వరరావు అందుకు కేరాఫ్ అడ్రస్ అని… ఆ తరవాత నాగార్జున, నాగచైతన్యలు లు ఆ వారతస్వం కొనసాగించడం ఆనందంగా ఉందని, అఖిల్ కూడా ప్రేమ కథల్ని ఎంచుకొంటే బాగుంటుందని దాసరి సూచించారు.