ప్రపంచ ఆర్థిక వేదిక వేదికగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల బ్రాండ్ ఇమేజ్ను విశ్వవ్యాప్తం చేసేందుకు సిద్ధమయ్యారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా జనవరి 19 నుంచి 23 వరకు జరగనున్న ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పోటాపోటీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకున్నాయి.
ఏపీ అడ్వాంటేజ్ పేరుతో చంద్రబాబు తీరిక లేని షెడ్యూల్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సుదీర్ఘ అనుభవాన్ని రంగరించి స్వర్ణాంధ్ర 2047 విజన్‌ను ప్రపంచ పారిశ్రామిక వేత్తల ముందు ఉంచబోతున్నారు. IBM, గూగుల్ క్లౌడ్, ఎన్విడియా వంటి దిగ్గజ సంస్థల సీఈఓలతో 16 వన్-టు-వన్ సమావేశాలు, 9 రౌండ్ టేబుల్ చర్చలతో ఏపీ సీఎం షెడ్యూల్ అత్యంత బిజీగా ఉంది. ఏపీ అడ్వాంటేజ్ పేరుతో నిర్వహించే ప్రత్యేక సెషన్లో రాష్ట్రంలోని మౌలిక సదుపాయాలు, ఏఐ , క్లీన్ ఎనర్జీ రంగాల్లో ఉన్న అవకాశాలను ఆయన వివరించనున్నారు. పెట్టుబడులే కాకుండా, సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్రానికి రప్పించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ఈ పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
రేవంత్ తెలంగాణ రైజింగ్ కాన్సెప్ట్
మరోవైపు తెలంగాణ సైతం ఏమాత్రం తగ్గకుండా తెలంగాణ రైజింగ్-2047 నినాదంతో దావోస్‌లో అడుగుపెడుతోంది. 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం అక్కడ తెలంగాణ పెవిలియన్ ను ఏర్పాటు చేస్తోంది. జనవరి 20న రాష్ట్రం ప్రతిష్టాత్మక లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-30 ,ఏఐ హబ్ పాలసీలను ప్రపంచ వేదికపై ఆవిష్కరించనున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ను ప్రపంచంలోని టాప్ 20 ఏఐ హబ్‌లలో ఒకటిగా నిలబెట్టాలనే లక్ష్యంతో గ్లోబల్ టెక్ కంపెనీలకు తెలంగాణ ప్రభుత్వం గట్టిగా మార్కెటింగ్ చేస్తోంది.
తమ రాష్ట్రాలను మార్కెటింగ్ చేస్తున్న సీఎంలు
పెట్టుబడులు ఎన్ని వస్తాయన్నది పక్కన పెడితే, రాష్ట్రాల మార్కెటింగ్ విషయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు చూపుతున్న చొరవ చర్చనీయాంశంగా మారింది. ఏపీ సీఎం అంతర్జాతీయ మీడియా సంస్థలైన సీఎన్‌బీసీ వంటి వాటికి ఇంటర్వ్యూలు ఇస్తూ రాష్ట్ర బ్రాండ్‌ను ప్రమోట్ చేయనున్నారు. తెలంగాణ సీఎం ముసి పునరుజ్జీవం, ఫ్యూచర్ సిటీ వంటి భవిష్యత్ ప్రాజెక్టులను గ్లోబల్ ఇన్వెస్టర్ల ముందు ప్రదర్శించబోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే, అంతర్జాతీయ వేదికపై తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్న ఈ ఆరోగ్యకరమైన పోటీ దేశ ఆర్థిక వృద్ధికి కూడా ఊతమిచ్చేలా ఉంది. ఈ దావోస్ పర్యటన కేవలం ఒప్పందాలకే పరిమితం కాకుండా, రాబోయే రెండు దశాబ్దాల అభివృద్ధికి అవసరమైన ప్రపంచ స్థాయి భాగస్వామ్యాలను నిర్మించుకోవడంలో కీలక పాత్ర పోషించనుంది. రెండు రాష్ట్రాలూ తమకున్న వనరులను, అనుకూలతలను గ్లోబల్ లీడర్ల ముందు ఉంచనున్నాయి. అది ఇవాళ కాకపోతే రేపైనా ఫలితాలను ఇప్పిస్తాయి.


