జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. భేటీలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి , పరిపాలనాపరమైన సమస్యలు, రాష్ట్ర భద్రతా అంశాలపై సుదీర్ఘ చర్చలు జరిగాయి. ముఖ్యంగా విభజన చట్టంలోని హామీల అమలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు , కేంద్ర ప్రభుత్వం నుండి అందాల్సిన సహకారంపై పవన్ కల్యాణ్ వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులతో పాటు, రాబోయే రోజుల్లో ప్రభుత్వం చేపట్టబోయే సంక్షేమ పథకాలకు కేంద్ర మద్దతు అవసరమని ఆయన కోరారు.
పిఠాపురంలోని ఉప్పాడ సముద్ర తీర కోత సమస్యపై ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చకు వచ్చింది. తీర ప్రాంత ప్రజల రక్షణ కోసం ప్రతిపాదించిన ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ ప్రాజెక్టును నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ముందు ప్రదర్శించేందుకు అవకాశం కల్పించినందుకు పవన్ కల్యాణ్ కేంద్రమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాజెక్టు అమలులోకి వస్తే తీర ప్రాంత గ్రామాల ఉనికికి పొంచి ఉన్న ముప్పు తప్పుతుందని, దీనికి అవసరమైన సాంకేతిక మరియు ఆర్థిక సాయాన్ని త్వరగా అందించాలని ఆయన విన్నవించారు.
రాష్ట్రంలోని శాంతిభద్రతల పరిస్థితిని, పరిపాలనా సంస్కరణలను అమిత్ షాకు పవన్ కల్యాణ్ వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉందని, అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని అమిత్ షా భరోసా ఇచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా ఉమ్మడి ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను కేంద్రం అభినందించింది. ఉదయం కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్తోనూ పవన్ చర్చలు జరిపారు.
