2025 క్యాలెండర్ కి గుడ్ బై చెప్పే సమయం ఆసన్నమైయింది. మరో ముఫ్ఫై రోజుల్లో 2025 చరిత్రలో కలిసిపోనుంది. చివరాఖరి పేజీని విజయవంతంగా పూర్తి చేయడానికి టాలీవుడ్ సిద్ధమైయింది. డిసెంబర్ లో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ గా వస్తోంది నందమూరి బాలకృష్ణ అఖండ 2. బాలయ్య – బోయపాటి కాంబినేషన్ కి తిరుగులేదు. ఇప్పటికే సింహ లెజెండ్ అఖండ తో హ్యాట్రిక్ కొట్టారు. అఖండ 2 పై మంచి అంచనాలు వున్నాయి. బాలయ్య ఈ సినిమాతో పాన్ ఇండియా వెళ్తున్నారు. అన్ని చోట్ల మంచి ప్రమోషన్స్ జరిగాయి. 4న ప్రిమియర్స్ తో సందడి చేయడానికి సిద్ధంగా వుంది అఖండ2. ఇదే వారంలో శర్వానంద్ బైకర్ సినిమా ప్రకటించారు కానీ మళ్ళీ వెనక్కి వెళ్లారు.
డిసెంబర్ రెండో వారంలో రోషన్ కనకాల మొగ్లి సినిమాతో వస్తున్నాడు. కలర్ ఫోటో సందీప్ రాజ్ ఈ సినిమాకి దర్శకుడు. టీజర్ ఆసక్తికరంగానే వుంది. బబుల్గమ్ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు రోషన్. సినిమా సరిగ్గా ఆడలేదు. హీరోగా నిలదొక్కుకోవాలంటే ఈ సినిమా విజయం చాలా కీలకం.
నందు సైక్ సిద్ధార్థ్ సినిమాతో వస్తున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ సపోర్ట్ తో వస్తున్న సినిమా ఇది. టీజర్ యూత్ కి నచ్చేలా కట్ చేశారు. నందు మంచి నటుడే, కానీ తనకి ఇప్పటివరకూ సరైన విజయం దక్కలేదు. సైక్ సిద్ధార్థ్ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. వీటితో పాటు రామ్‌కిరణ్, మేఘా ఆకాష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సకుటుంబానాం’. ఉదయ్‌శర్మ దర్శకుడు. రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం ప్రధాన తారాగణం. వినోదం, ఫ్యామిలీ సెంటిమెంట్ వున్న సినిమా ఇది. ఈ మూడు సినిమాలూ డిసెంబర్ 12న వస్తున్నాయి.
డిసెంబర్ మూడో వారం అవతార్ 3 హంగామా వుంటుంది. అవతార్ కి ఇండియాలో మంచి ఫ్యాన్ బేస్ వుంటుంది. జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ‘అవతార్’ ఇప్పటికే రెండు భాగాలు ఆదరణ అందుకుంది. మూడో భాగం ‘అవతార్- ఫైర్ అండ్ యాష్’ డిసెంబరు 19న విడుదల కానుంది. మల్టీ ఫ్లెక్స్ ఆడియన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నాలుగో వారంలో ‘శంబాల’ తో వస్తున్నాడు ఆది సాయి కుమార్. సైన్స్, అతీంద్రియ శక్తుల నేపథ్యంతో రూపొందిన సినిమా ఇది. టీజర్ ఆసక్తిని పెంచింది. అదికి చాలా కాలంగా విజయాలు లేవు. మరి ఈ ఏడాది విజయంతో ముగిస్తాడో చూడాలి. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన ‘ఛాంపియన్’ కూడా అదే రోజు రిలీజ్. ఫుట్‌బాల్, ప్రేమ, దేశభక్తి అంశాలతో పిరియాడిక్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాకి ప్రదీప్ అద్వైత్ దర్శకుడు. స్వప్న సినిమాస్ ఈ సినిమా నిర్మాణంలో వుంది. ఇప్పటివరకూ బయటికి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ప్రామెసింగ్ గా వుంది. శివాజీ, నవదీప్ ప్రధాన పాత్రల్లో ‘దండోరా’ కూడా డిసెంబరు 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
సహజంగా క్రిస్మస్ వీక్ లో ఓ భారీ సినిమా వుండటం రివాజు. హాలీడేస్ ని దృష్టిలో పెట్టుకొని ఒక పెద్ద సినిమా దిగుతుంది. కానీ ఈసారి మీడియం సినిమాలతోనే సరిపెట్టుకునే పరిస్థితి. కాకపొతే సినిమా బావుంటే చిన్నా మీడియం అనే తేడాలేకుండా మంచి వసూళ్ళు ఇస్తున్నారు ఆడియన్స్. లిటిల్ హార్ట్స్ లాంటి సినిమా అలాంటి మ్యాజిక్కే చేసింది.
మొత్తం డిసెంబర్ లో బాక్సాఫీసు వద్ద భారీ నెంబర్లు నమోదు చేసే సినిమాగా బాలయ్య అఖండ 2 కనిపిస్తోంది. బాలయ్య కూడా సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నారు. ఈ ఏడాది వచ్చిన డాకు మహారాజ్ అనుకున్న స్థాయిలో రాణించలేదు. 2025 ని విజయవంతంగా పూర్తి చేసుకునే అవకాశం ఇప్పుడు అఖండ 2లో వచ్చింది. చివరి బంతికి బాలయ్య సిక్సర్ కొట్టాలనే కోరుకుందాం.