తెలంగాణ పార్టీ ఫిరాయింపులు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లుగా ఆధారాలు లేవని స్పీకర్ తీర్పు ప్రకటించారు. చట్టం ప్రకారం స్పీకర్ చెప్పింది కరెక్టే. స్వచ్చందంగా గెలిచినపార్టీ సభ్యత్వాన్ని వదులుకోవడం.. అంటే రాజాసింగ్ లాగా పార్టీకి రాజీనామా చేయడం లేదా విప్ ను ధిక్కరించడం .. ఈ రెండు అంశాల్లో ఏదో ఒకటి చేస్తేనే అనర్హతా వేటు పడుతుంది. ఆ ఎమెల్యేలు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరామని ఎప్పుడూ చెప్పలేదు. కండువాలు కప్పించుకున్నారు. కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే వారు అనధికారికంగా కాంగ్రెస్ లో చేరారు. అధికారికంగా మాత్రం అంటే రికార్డుల పరంగా మాత్రం కాదు. చట్టాన్ని తప్పించుకోగలరు కానీ.. ప్రజల్ని మోసం చేయగలరా అన్నదే అసలు ప్రశ్న.
ఆ ఎమ్మెల్యేలు పార్టీ మారింది నిజం !
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలంతా గెలిచింది కాంగ్రెస్ పార్టీ మీదనే. ఆ నియోజకవర్గం ప్రజలు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేశారు. ఇప్పుడు వారే వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరడం అంటే ప్రజల్ని మోసం చేయడమే. కానీ ఇలాంటి మోసాలను .. నియోజకవర్గ అభివృద్ది కోసం.. ప్రజల కోసం అని చెప్పి అదే పనిగా చేస్తూ వస్తున్నారు ఎమ్మెల్యేలు. బీఆర్ఎస్ హయాంలో ఓ ఉద్యమంలా జరిగాయి. ఓ సారి ఫిరాయించి గెలిచినా.. తర్వాత మాత్రం చాలా ఎక్కువ మంది ఓడిపోయారు. వారిలో చాలా మంది అడ్రస్ లేకుండా పోయారు. తమ నమ్మకాన్ని వమ్ము చేసిన వాళ్లను ప్రజలు క్షమించడం చాలా అరుదుగా ఉంటుంది.
ప్రజలకు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వారికి ఓటేశారు!
నియోజకవర్గ అభివృద్ధి కోసం అని అధికార పార్టీలో చేరిపోతారు. కానీ అభివృద్ధి కోసం చేసేదేమీ ఉండదు. తమ వ్యక్తిగత ప్రయోజనాలు, వ్యాపార ప్రయోజనాలు, పనులకు బిల్లుల కోసం పార్టీ మారిపోతారు. లేకపోతే తమ పార్టీకి భవిష్యత్ ఉండదనుకుంటే అదే పని చేస్తారు. కారణం ఏదైనా చాలా మందిక అధికార పార్టీలో ఉండకపోతే ఉక్కపోతకు గురవుతారు. ఇలాంటి వారు చాలా కాలంగా రాజకీయాల్లో ఉండటం కష్టమవుంది. కానీ కొంత మంది అదే ప్లస్ పాయింట్ గా రాజకీయాల్లో కొనసాగుతున్నారు.
ప్రజల శిక్షను తప్పించుకోలేరు !
ఎమ్మెల్యేలు ఫిరాయించింది అధికార పార్టీలోకే కాబట్టి.. వారి పదవులకు గ్యారంటీ ఉంటుంది. ఐదేళ్లు స్పీకర్ వారిని కాపాడుతారు.స్పీకర్ ఉన్న పవర్ వారికి రక్షణగా ఉంటుంది. కానీ ఆ తర్వాత సంగతి ఏమిటన్నది ఇక్కడ కీలక విషయం. వచ్చే ఎన్నికల్లో ప్రజల వద్దకు మళ్లీ వెళ్లాలి. అప్పుడు ఆయనను చూసిన ప్రతి ఒక్కరికి తమను మోసం చేశారన్న భావన వస్తుంది. అప్పుడు ప్రజలు కచ్చితంగా శిక్షిస్తారు. పార్టీ పిరాయింపులు అనేది ఎప్పటికైనా శిక్ష అనుభవించాల్సిన ఓ తప్పిదమే. కాకపోతే.. ప్రజలు ఐదేళ్లకోసారి మాత్రమే శిక్షిస్తారు. అదే వీరి ధైర్యం
