మోడీ స‌ర్కారును కేజ్రీవాల్ భ‌లే ఇరుకున‌పెట్టేశారే..!

ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు! దేశ రాజ‌ధానిలో ఢిల్లీలో మెట్ర‌తోపాటు, బ‌స్సులో కూడా మ‌హిళ‌ల‌కు ఉచితంగానే ప్ర‌యాణ సౌక‌ర్యం క‌ల్పించ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. టిక్కెట్లు కొనాల‌నుకునే మ‌హిళ‌లు కొనుక్కోవ‌చ్చ‌ని కూడా చెప్పారు. ఈ నిర్ణ‌యం అమ‌ల్లోకి రావ‌డానికి మ‌రో రెండు నెల‌లు ప‌డుతుంద‌ని అన్నారు. అయితే, ఉన్న‌ట్టుండి కేజ్రీవాల్ ఇలాంటి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుని దేశ‌వ్యాప్తంగా ఇప్పుడు అంద‌రి దృష్టినీ త‌న‌వైపున‌కు తిప్పుకున్నార‌ని చెప్పొచ్చు. మ‌రో ఏడాదిలో రానున్న ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌న‌డంలో సందేహం లేదు. అయితే, ఢిల్లీలో మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కు తాము క‌ట్టుబ‌డి ఉన్నామ‌నీ, అందుకే ఈ స‌దుపాయం క‌ల్పిస్తున్నామ‌ని కేజ్రీవాల్ చెబుతున్నారు.

ఈ సంచ‌ల‌న నిర్ణ‌యం వెన‌క‌… కేంద్ర ప్ర‌భుత్వాన్ని కేజ్రీవాల్ ఇరుకుపెట్టే అవ‌కాశం కూడా ఉంది! ఎలా అంటే, ఢిల్లీలో మెట్రో రైల్ ను కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల భాగ‌స్వామ్యంతో నిర్వ‌హిస్తున్నారు. అంటే, అయ్యే ఖ‌ర్చులో 50 శాతం రాష్ట్రం, మ‌రో 50 శాతం కేంద్రం నిధుల‌తో కొన‌సాగుతోంది. ఇప్పుడు కేజ్రీవాల్ తీసుకున్న మ‌హిళ‌ల‌కు ఉచితం అనే నిర్ణ‌యం ద్వారా దాదాపు రూ. 1400 కోట్ల భారం ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్టు ఓ అంచ‌నా. అంటే, దీన్లో స‌గం భారం రూ. 700 కోట్ల‌ను రాష్ట్రం భ‌రిస్తే, మిగ‌తాది కేంద్రంలోని భాజ‌పా స‌ర్కారు భ‌రించాల్సి ఉంటుంది. ఇక్క‌డే కేజ్రీవాల్ మార్కు మెలిక ఉంది. ఢిల్లీలోని కేంద్ర ప్ర‌భుత్వానికీ, కేజ్రీవాల్ కి మ‌ధ్య పొలిటిక‌ల్ వార్ ఎప్ప‌ట్నుంచో న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో మ‌హిళ‌ల‌కు ఉచిత ర‌వాణా సౌక‌ర్యం అనే నిర్ణ‌యానికి కేంద్రం త‌లొగ్గాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది! ఒక‌వేళ‌, ఈ నిర్ణ‌యానికి కేంద్రం ఓకే అన‌క‌పోతే… కేంద్రం వాటా‌ను కూడా రాష్ట్ర‌మే భ‌రించ‌డానికి ముందుకొచ్చి, మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కు మోడీ స‌ర్కారుకు చిత్త‌శుద్ధి లేద‌ని కేజ్రీవాల్ పెద్ద ఎత్తున విమ‌ర్శ‌ల‌కు దిగుతారు. కేంద్రం స‌హ‌క‌రించినా కూడా మెలిక ఉంటుంది! ఇది నా ఆలోచ‌నే అంటూ క్రెడిట్ పొందే అవ‌కాశ‌మూ కేజ్రీవాల్ కి ఉంటుంది క‌దా. తాజా నిర్ణ‌యంతో కేంద్రం మీద‌ ఓరక‌మైన ఒత్తిడి తెచ్చిపెట్టారని అనొచ్చు. ఈ నిర్ణ‌యం ప్ర‌భావం ఇత‌ర రాష్ట్రాల‌పై కూడా ఉంటుంది. ఇత‌ర రాష్ట్రాల్లో కూడా మెట్రో రైళ్లు ఉన్నాయి. కాబ‌ట్టి, ఇక్క‌డా మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణ సౌక‌ర్యం క‌ల్పించాల‌నే డిమాండ్ రావొచ్చు. అయితే, చాలా రాష్ట్రాల్లో ప్ర‌భుత్వ‌, ప్రైవేటు భాగ‌స్వామ్యంతో మెట్రో రైళ్లు న‌డుస్తున్న ప‌రిస్థితి ఉంది. ఏదైతేనేం, కేజ్రీవాల్ నిర్ణ‌యం ఓ సంచ‌ల‌న‌మే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com