రెవెన్యూ, మునిసిపల్ శాఖలు అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయని వాటి తీరు మార్చుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన హెచ్చరికలను మునిసిపల్ శాఖ మంత్రి పి.నారాయణ సీరియస్ తీసుకొన్నట్లు లేదు. బహుశః అవి తనను ఉద్దేశ్యించి అన్నమాటలు కావని ఆయన భావిస్తున్నారేమో తెలియదు. కానీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి కె.ఈ. కృష్ణ మూర్తి మాత్రం చంద్రబాబు నాయుడు అన్న మాటలను చాలా సీరియస్ గా తీసుకొన్నారు.
తను పేరుకి ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి అయినప్పటికీ తన శాఖలో తనకి తెలియజేయకుండానే, అనుమతి తీసుకోకుండానే చాలా పనులు జరిగిపోతున్నాయని, కనీసం తను తీసుకొన్న నిర్ణయాలను కూడా ప్రభుత్వంలో పట్టించుకొనేవారే లేరని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. పార్టీలో ఎంతో సీనియర్ అయిన తనకు సముచిత గౌరవం దక్కడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ఈ పరిస్థితుల్లో రెవెన్యూ శాఖలో జరుగుతున్న అవినీతికి తనను బాధ్యుడిని చేయడం ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నిస్తున్నారు. పార్టీలో కొత్తగా వచ్చిన కొందరు వ్యక్తులు ఉద్దేశ్యపూర్వకంగానే తనకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
కె.ఈ. కృష్ణమూర్తి ఈవిధంగా ఆవేదన చెందడం సహజమే కావచ్చును. కానీ రాజకీయాలలో సుదీర్ఘ అనుభవం కలిగి, పార్టీలో సీనియర్ నేతయిన ఆయన తన అనుభవంతో పార్టీలో, ప్రభుత్వంలో తన పట్టు నిలుపుకొనే ప్రయత్నాలు చేయకుండా ఈ విధంగా ఆవేదన వ్యక్తం చేయడం వలన ఏమీ ప్రయోజనం ఉండదు. ఆయన సమర్దుడే అయితే పార్టీలో, ప్రభుత్వంలో తన స్థానాన్ని మరొకరు ఆక్రమించేందుకు అవకాశం కల్పించకూడదు. కానీ అటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే ఆయనదే తప్పు అని భావించాల్సి ఉంటుంది.
కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు బయటకు వెళ్ళిపోక తప్పదు. పార్టీలో, ప్రభుత్వంలో తన సత్తా చాటుకొనే విధంగా వ్యవహరించలేనప్పుడు ఏ రాజకీయ నాయకుడికయినా సరిగ్గా ఇటువంటి దుస్థితే ఎదురవుతుంటుంది. పార్టీ వ్యస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ ఎన్టీఆర్ నే చంద్రబాబు నాయుడు బయటకి సాగనంపగలిగినపుడు కె.ఈ. కృష్ణమూర్తి వంటి నేతలు అందుకు మినహాయింపును ఆశించలేరు. కానీ కె.ఈ. కృష్ణమూర్తి పార్టీలో చాలా సీనియర్ కనుక సగౌరవంగా బయటకి సాగనంపేందుకు త్వరలో ఆయనను ఏదో ఒక అప్రధాన్య శాఖకు మార్చినా ఆశ్చర్యం లేదు.