“జగన్మోహన్ రెడ్డిని ప్రజలే తరిమికొడతారని” విపక్ష నేతలు అంటే సహజమే కదా అనుకోవచ్చు. కానీ సొంత డిప్యూటీ సీఎం అంటే మాత్రం ఉలిక్కి పడాల్సిందే. పోనీ అలా అన్న డిప్యూటీ సీఎం ఎమైనా రఘురామకృష్ణరాజులా రెబలా అంటే కాదు. ఉద్దేశపూర్వకంగా అంటారో లేకపోతే తన అసంతృప్తిని అనాలోచితంగా బయట పెట్టినట్లుగా అంటారో.. నిజంగానే నోరుజారుతారో తెలియదు కానీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఇలాంటి వ్యాఖ్యలే చేస్తూంటారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని ఇదే ప్రకటన చేశారు. సోషల్ మీడియాలో వైరల్అయిపోయారు.
ఇదే సమయంలో ఆయన పవన్ కల్యాణ్ వైసీపీలో చేరేందుకు ప్రయత్నించారంటూ ప్రకటించేశారు. ఆయన మాటలు విని జర్నలిస్టులు నవ్వుకున్నారు. జనసేనను విలీనం చేయాలని బీజేపీ అగ్రనేతలు ఒత్తిడి చేశారని పవన్ చెప్పారు కానీ ఆయన వైఎస్ఆర్‌సీపీలో చేరుతారని ఎప్పుడూ కనీసం ఊహాగానం కూడారాలేదు. మొదటి సారి నారాయణస్వామి ఆ మాట చెప్పేసరి కామెడీ అయిపోయింది. గత ఎన్నికలకు ముందు జనసేనతో వైఎస్ఆర్‌సీపీ పొత్తుల గురించి ప్రాథమికంగా చర్చలు జరిగాయన్న ప్రచారం జరిగింది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే పొత్తుల గురించి చెప్పబోయే పవన్ చేరిక గురించి మాట్లాడి ఉంటారని… అది ఆయన అవగాహనా స్థాయి అన్న అభిప్రాయం వినిపిస్తోంది.
మంత్రి నారాయణ స్వామి ఇలాంటి ఊహకు అందని ప్రకటనలు చేయడం ఇదే మొదటి సారి కాదు. గతంలో చంద్రబాబు తనకు మంత్రి పదవి ఆఫర్ చేసి టీడీపీలోకి ఆహ్వానించారని కూడా చెప్పుకున్నారు. ఇంకా ఇంకా నోరు జారిన ప్రకటనలు ఎన్నో చేశారు. ఎప్పటికప్పుడు నవ్వుల పాలవుతున్నా ఆయన మాత్రం మాట్లాడకుండా ఉండరు.