ఉండి నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో నివాస ప్రాంతాల మధ్య, సరైన అనుమతులు లేకుండా చర్చిలు నిర్మిస్తున్న అంశం వివాదాస్పదమవుతోంది. ప్రభుత్వ భూములు లేదా చెరువు పోరంబోకు స్థలాల్లో అక్రమంగా చర్చిలు కడుతున్నట్లుగా ఫిర్యాదులు రావడంతో ఎమ్మెల్యే గా ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామ కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటిస్తున్న సమయంలో.. అక్రమంగా నిర్మిస్తున్న చర్చిల విషయంపై చాలా ఫిర్యాదులు వచ్చాయి. చట్టప్రకారం అనుమతులు ఉంటేనే ప్రార్థనా మందిరాలు ఉండాలి, లేకపోతే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ వివాదం కేవలం మతపరమైనదిగానే కాకుండా రాజకీయంగా కూడా మారింది. వైసీపీ నాయకులు రఘురామ కృష్ణరాజు తీరును తప్పుబడుతూ, ఆయన ఒక వర్గానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. మరోవైపు, కూటమి ప్రభుత్వం చట్టాన్ని అమలు చేస్తోందని ఎమ్మెల్యే వర్గీయులు సమర్థించుకుంటున్నారు.
ఈ వివాదంపై సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చ జరుగుతోంది. జడ శ్రవణ్ కుమార్ ఈ అంశంపై ఘాటుగా స్పందిస్తున్నారు. ఉండి నియోజకవర్గంలో క్రిస్టియన్స్ చర్చికి వెళ్లాలంటే భయపడేలా చేస్తున్నారు.. మాకు టైం వస్తుంది, అప్పుడు చెప్తాము అని హెచ్చరిస్తున్నారు. అక్రమంగా చర్చిలు కట్టడం ఆపితే ఇంతగా ఎందుకు హెచ్చరిస్తున్నారన్న ప్రశ్నలు ఇతర వర్గాల నుంచి వస్తున్నాయి.


