ధనుష్ హీరోగా ఎలాంటి సినిమాలు చేయగలడో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తను ఆల్ రౌండర్. ఎలాంటి కథైనా చేసేస్తాడు. అయితే దర్శకుడిగా తనకో సెపరేట్ మార్క్ వుంది. మెగాఫోన్ పట్టి తాను తీసే సినిమాలు కమర్షియల్ మీటర్‌కు దగ్గరగా ఉంటూనే ఏదో ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తుంటాయి. తాజాగా తాను దర్శకత్వం వహించిన ‘ఇడ్లీ కొట్టు’ కూడా ఇలాంటి కథే అనిపిస్తోంది. ధనుష్ దర్శకత్వం వహిస్తూ, నటించిన ఈ చిత్రంలో నిత్యమీనన్ హీరోయిన్. అక్టోబరు 1న విడుదల అవుతోంది. ఈ రోజు ట్రైలర్ వదిలారు. ట్రైలర్ చూస్తుంటే… ధనుష్‌కి ఇలాంటి ఐడియాలు ఎక్కడ్నుంచి వస్తాయో అనిపిస్తుంది. చాలా సున్నితమైన కథ. ధనుష్ లాంటి స్టార్ ఇలాంటి కథల్ని నమ్మి, తానే దర్శకుడిగా మారి సినిమా తీశాడంటే.. కచ్చితంగా ఏదో ఆకర్షణ ఉండే ఉంటుందనిపిస్తుంది.
టైటిల్ కి తగ్గట్టే ఓ ఇడ్లీ కొట్టు చుట్టూ తిరిగే కథ ఇది. నాన్న ప్రారంభించిన వ్యాపారాన్ని, తాను వృద్దిలోకి తీసుకురావాలని ఆరాట పడే కొడుకు కథ. ఈ ఇడ్లీకొట్టుని సెంటిమెంట్ గా భావించే గ్రామ ప్రజలు.. అదే ఇడ్లీ కొట్టుపై కన్నేసిన కార్పొరేట్ సంస్థ.. ఇలా సెటప్ ఏదో కొత్తగానే ఉంది. ధనుష్ అంటే కమర్షియల్, ఫన్, ఎనర్జీ… ఇలా చాలా ఉంటాయి. వాటన్నింటినీ పక్కన పెట్టి తీసిన సినిమాలా అనిపిస్తోంది. తండ్రి – కొడుకుల ఎమోషన్ కూడా గట్టిగా పట్టేసేలా కనిపిస్తోంది. నిత్యమీనన్ కథానాయికగా నటించింది. తన పాత్ర చూస్తుంటే ఇటీవల వచ్చిన ‘సార్.. మేడమ్’ సినిమా గుర్తొస్తుంది. కాకపోతే.. ధనుష్ తో నిత్య కెమిస్ట్రీ కొత్తగా అనిపించే ఛాన్స్ వుంది. జీవీ ప్రకాష్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. ఎమోషనల్ డ్రైవ్ బాగా పండితే… ఇడ్లీ కొట్టుతో.. ధనుష్ మరో హిట్టు కొట్టినట్టే.