రాజకీయాల్లో పండిపోయిన ధర్మాన ప్రసాదరావుకు ఇప్పుడు దారి తెలియడం లేదు. టీడీపీలోకి రానివ్వరు. వైసీపీలో ఉండలేరు. అందుకే ఆయన కొత్త మార్గంలోకి వెళ్తున్నారు. చాలా కాలం పాటు వైసీపీ కార్యక్రమాల జోలికే వెళ్లని ఆయన ఇప్పుడు కొత్తగా వింత మాటలు మాట్లాడుతున్నారు. తన అనుచరులతో ఏర్పాటు చేసే చిన్న చిన్న కార్యక్రమాలకు హాజరై..బీజేపీ, జనసేన పార్టీలను విమర్శించవద్దని అంటున్నారు.
ఏపీలో టీడీపీ పాలనే సాగుతోందని.. బీజేపీ, జనసేనకు సంబంధం లేదన్నారు. టీడీపీ పాలన పాపాలు ఆ రెండు పార్టీలపై వేసేందుకు కూటమి అంటున్నారని.. ఆ రెండు పార్టీలు చాలా మంచివని.. అందుకే కూటమి ప్రభుత్వం అని మాత్రమే సంబోధించాలని సలహాలిస్తున్నారు. ఆయన మాటలతో వైసీపీ కార్యకర్తలు కూడా అవాక్కవుతున్నారు. జగన్ రెడ్డి బీజేపీని మాత్రం ఏమీ అనరు. ధర్మాన .. బీజేపీతో పాటు జనసేనను కూడా ఏమీ అనవద్దంటున్నారు.
కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసం ధర్మాన ఇప్పుడు రాజకీయం చేస్తున్నారు. తన రాజకీయ జీవితం ఇంకా మిగిలి ఉందని ఆయన అనుకోవడం లేదు. కానీ కుమారుడికి జీవితం ఇవ్వలేకపోతున్నానని ఆయన బాధపడుతున్నారు. కనీసం జనసేన పార్టీలో చేర్చి అయినా.. ఈ సారి సిక్కోలు సీటును తీసుకోవాలన్న ఆలోచన చేస్తున్నారు. అందుకే.. టీడీపీని మాత్రమే విమర్శించాలని.. జనసేన, బీజేపీలను వద్దని అంటున్నారు.