రెండు పెద్ద తెలుగు సినిమాల మధ్య పోటీ చూడడం కొత్తేం కాదు. ఆమాటకొస్తే ప్రతీ సీజన్లోనూ ఇలాంటి కాంపిటీషన్ చూస్తూనే ఉంటాం. కానీ ఈసారి ఓ తెలుగు సినిమాతో ఓ హిందీ సినిమా పోటీ పడబోతోంది. ఈనెల 19న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వస్తోంది. అదే రోజు ‘దురంధర్ 2’ విడుదల అవుతోంది. నిజానికి పవన్ కల్యాణ్ సినిమాకు ఓ హిందీ సినిమా పోటీగా వస్తుంటే పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు. కానీ ‘దురంధర్ 2’ క్రేజ్ వేరు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ‘దురంధర్’ బాక్సాఫీస్ ని షేక్ చేసింది. బాలీవుడ్ లో భారీ వసూళ్లు అందుకొంది. ఓటీటీలోనూ ఈ సినిమాకు రికార్డ్ స్థాయి వ్యూస్ దక్కాయి. అందుకే పార్ట్ 2పై అంచనాలు పెరిగాయి. సౌత్ లోనూ ఈ సినిమా గట్టిగా ప్రభావం చూపిస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు. అందుకే ఈసారి దక్షిణాదిన ఎక్కువ థియేటర్లలో ఈ సినిమాని విడుదల చేయనున్నారు. 19న రావాల్సిన ‘టాక్సిక్’ వాయిదా పడడానికి ‘దురంధర్ 2’ క్రేజ్ ఒక కారణమన్న టాక్ వినిపిస్తోంది. ఆరేంజ్ లో ఉంది ‘దురంధర్’ మానియా.
మరి ఈ ఎఫెక్ట్ మన ‘ఉస్తాద్’ పై ఎంత వరకూ అనేదే ప్రశ్న. దీనిపై సోషల్ మీడియాలో విస్కృతమైన చర్చ నడుస్తోంది. పవన్ కల్యాణ్ సినిమాలపై హిందీ సినిమా, డబ్బింగ్ బొమ్మల ఎఫెక్ట్ ఏమాత్రం ఉండదన్నది ఆయన అభిమానుల మాట. ముఖ్యంగా బీ,సీ సెంటర్లలో దురంధర్ ప్రభావం ఉండకపోవొచ్చు. కానీ ఏ సెంటర్లలో మాత్రం కచ్చితంగా ఎఫెక్ట్ చూపించగలదు. మల్టీప్లెక్స్ లో దురంధర్ కి ఎక్కువ టికెట్లు తెగే అవకాశం ఉంది. ఓవర్సీస్ వసూళ్లపై కూడా దురంధర్ ప్రభావం చూపించగలదు. కాకపోతే.. మంచి టాక్ రావడం చాలా ముఖ్యం. ‘ఉస్తాద్’ కు టాక్ బాగుంటే… ఆ జోరు ఆపడం ఎవరి వల్లా కాదు. అప్పుడు ఏ సెంటర్లలోనూ పవన్ సినిమాదే హవా. యావరేజ్ టాక్ వచ్చినా.. సరిపోతుంది. అదే ఫలితం కాస్త అటూ ఇటూ అయితే మాత్రం దురంధర్ దూసుకుపోతుంది. రెండు సినిమాలకూ ఇప్పుడు టాకే ప్రధానం. ‘ఉస్తాద్’ ఎలాగూ పాన్ ఇండియా సినిమా కాదు కాబట్టి.. నార్త్ బెల్ట్ లో ఫలితం కోసం పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు.
