తన కుటుంబంలో ఒకరు డిజిటల్ అరెస్టు మోసానికి గురయ్యారని నాగార్జున ప్రకటించడం వైరల్ గా మారింది. నాగార్జున లాంటి పలుకుబడి కలిగిన ఫ్యామిలీలోని వారు కూడా ఎవరో ముక్కూ.. ముఖం తెలియని వారు డిజిటల్ అరెస్ట్ అంటే భయపడిపోయి డబ్బులు పంపడం అంటే చిన్న విషయం కాదు. మోసగాళ్లు ఏమీ తెలియని వాళ్లను కాదు.. అన్నీ తెలిసిన వాళ్లను కూడా ఇలా భయపెట్టి కోట్లకు కోట్లు వసూలు చేస్తున్నారు. ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ భార్యను కూడా అలాగే భయపెట్టి కోటిన్నరకుపైగా వసూలు చేసినట్లుగా తేలింది.
ఇది ఓ భయంకరమైన స్కాంగా మారింది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా దీని గురించి మాట్లాడారు. మన చట్టాల్లో డిజిటల్ అరెస్ట్ అనేదే లేదని … ఆ మాట చెప్పారంటే ఖచ్చితంగా మోసమేనని .. పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. తర్వతా సుప్రీంకోర్టు కూడా ఈ మోసాలపై ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఇప్పటికీ అవి జరుగుతూనే ఉన్నాయి. చాలా మంది విద్యావంతులు ఈ మోసాలను గుర్తిస్తున్నప్పటికి కొంత మంది పెద్దలు, డబ్బులున్నవారు ఈజీగా ట్రాప్ లో పడిపోతున్నారు.
దీనికి కారణం ఆ మోసగాళ్లు.. వీళ్ల డేటాను కరెక్ట్ గా చెప్పడమే. పూర్తి సమాచారం తీసుకుని .. ఆ సమాచారం ఆధారంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. దీంతో కుటుంబ పరువు రోడ్డున పడుతుందనో.. తమను జైళ్లకు పంపుతారనో మనోవేదకు గురై.. ఎవరికీ చెప్పకుండా.. లక్షలకు లక్షలు ఆ మోసగాళ్లకు పంపుతున్నారు. ఏం జరిగిందో తెలుసుకునేసరి మోసపోతున్నారు.డేటా చోరీ వల్లే ఇదంతా జరుగుతోంది.
