రాజకీయాల్లో ఎలివేషన్లు ఇచ్చుకోవడానికి, ప్రత్యర్థులపై నేరేటివ్ సెట్ చేయడానికి డిజిటల్ మీడియా అద్భుతంగా ఉపయోగపడుతుంది. కానీ, అధికారం చేతికి వచ్చాక అదే డిజిటల్ మీడియా రెండంచుల కత్తిలా మారుతుందని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గ్రహిస్తున్నారు. వారం కూడా గడవకముందే విజయ్ ప్రభుత్వం అంతా డిజిటల్ మాయ అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల సమయంలో విజయ్ పక్షాన నిలిచిన సోషల్ మీడియా సైన్యం, ఇప్పుడు అతి ఉత్సాహంతో వాస్తవాలకు దూరంగా ప్రచారం చేస్తూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తోంది.
మద్యం దుకాణాల ప్రచారం – రివర్స్ ఫైర్
తాజా ఉదాహరణే మద్యం దుకాణాల వ్యవహారం. దేవాలయాలు, పాఠశాలలకు సమీపంలో ఉన్న మద్యం దుకాణాలను తక్షణమే తొలగించాలని ముఖ్యమంత్రి విజయ్ ఆదేశించారు. అయితే, ప్రభుత్వం ఇచ్చిన గడువు రెండు వారాలు కాగా, విజయ్ పార్టీ సోషల్ మీడియా విభాగం మాత్రం మరుసటి రోజు ఉదయమే ఆదేశించిన వెంటనే షాపులు మూతపడ్డాయి అంటూ భారీ ఎత్తున పోస్టులు పెట్టింది. తీరా క్షేత్రస్థాయిలో చూస్తే ఆ దుకాణాలు యధావిధిగా తెరిచి ఉన్నాయి. దీంతో ప్రతిపక్షాలు , ఇతర మీడియా సంస్థలు “విజయ్ పాలన అంటే కేవలం ఫోటోషూట్లు, సోషల్ మీడియా పోస్టులేనా అంటూ సెటైర్లు వేయడం మొదలుపెట్టాయి.
అతి ఉత్సాహం.. అది పెద్ద శాపం
విజయ్ పార్టీ డిజిటల్ క్యాంపెయిన్ దారి తప్పిందనే విమర్శలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. ఏ సోషల్ మీడియా అయితే విజయ్ను తిరుగులేని నేతగా ఎలివేట్ చేసిందో, ఇప్పుడు అదే వేదికలపై ఆయన విపరీతమైన ట్రోలింగ్‌కు గురవుతున్నారు. ఒకప్పుడు డిజిటల్ మీడియాలో తనను తాను సమర్థించుకున్న టీవీకే, ఇప్పుడు అదే మీడియా వేదికగా వస్తున్న విమర్శలను ఎలా ఎదుర్కోవాలో తెలియక ఇబ్బంది పడుతోంది.
నరేటివ్లతో పాలన నడవదు!
కేవలం పబ్లిసిటీ స్టంట్లతో ప్రభుత్వం నడవదని, వాస్తవ పాలనకు డిజిటల్ ప్రచారానికి చాలా తేడా ఉంటుంది. విజయ్ తీసుకునే నిర్ణయాలు అమలు కావడానికి సమయం పడుతుంది, కానీ ఆయన అభిమానులు మాత్రం క్షణాల్లో ఫలితం కావాలని సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నారు. ఈ డిజిటల్ గ్యాప్ వల్ల ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతోంది. వచ్చే ఆరు నెలల్లో ఇదే ట్రెండ్ కొనసాగితే, విజయ్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరగడానికి ఈ సోషల్ మీడియా అత్యుత్సాహమే ప్రధాన కారణం కావచ్చు. అధికారం లేనప్పుడు డిజిటల్ మీడియా ఒక బలమైన ఆయుధం కావచ్చు, కానీ అధికారంలో ఉన్నప్పుడు అది ఒక బాధ్యత. విజయ్ తన సోషల్ మీడియా విభాగాన్ని నియంత్రించకపోతే, అతి ప్రచారం కాస్తా ఆత్మహత్యాసదృశ్యంగా మారే ప్రమాదం ఉంది.
