భారతీయ రియల్ ఎస్టేట్ ,మౌలిక సదుపాయాల రంగంలో డిజిటల్ ట్విన్ సాంకేతికత ఒక విప్లవాత్మక మార్పుగా మారుతోంది. ఇది కేవలం భవన నిర్మాణానికే పరిమితం కాకుండా, భవనాల నిర్వహణను కూడా పూర్తిగా మార్చివేస్తోంది. ఒక భవనాన్ని పోలి ఉండే కృత్రిమ ప్రతిరూపాన్ని డిజిటల్ పద్ధతిలో సృష్టించడమే డిజిటల్ ట్విన్ . భవనంలోని లిఫ్టులు, ఏసీ సిస్టమ్స్, విద్యుత్ లైన్లు , నీటి సరఫరా పైపులకు అమర్చిన ఐఓటీ సెన్సార్ల ద్వారా రియల్ టైమ్ డేటాను ఈ డిజిటల్ మోడల్‌కు అనుసంధానం చేస్తారు. దీనివల్ల భవనం ప్రస్తుత పరిస్థితిని కంప్యూటర్ లేదా మొబైల్ తెరపై లైవ్‌లో చూడవచ్చు.
సాధారణంగా ఏదైనా యంత్రం పాడైపోయిన తర్వాతే మనం రిపేర్ చేస్తాం. కానీ డిజిటల్ ట్విన్ సాంకేతికతతో, ఏదైనా పరికరం పాడైపోవడానికి ముందే దానిని గుర్తించే ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ సాధ్యమవుతుంది. ఉదాహరణకు, ఒక లిఫ్ట్ మోటార్లో అసాధారణమైన కంపనం మొదలైతే, సెన్సార్లు ఆ సమాచారాన్ని వెంటనే డిజిటల్ ట్విన్కు పంపిస్తాయి. దీనివల్ల సమస్య పెద్దది కాకముందే ఇంజనీర్లు దానిని సరిచేయవచ్చు, తద్వారా భారీ మరమ్మతు ఖర్చులు తప్పుతాయి.
ఈ సాంకేతికత వల్ల భవనాల నిర్వహణ ఖర్చులు దాదాపు 25 నుండి 30 శాతం వరకు తగ్గుతాయని అంచనా. భవనంలో ఎక్కడ విద్యుత్ వృధా అవుతోంది, ఎక్కడ నీరు లీక్ అవుతోంది వంటి అంశాలను ఇది ఖచ్చితంగా చూపిస్తుంది. ఫలితంగా కార్బన్ ఫుట్‌ప్రింట్ తగ్గి, పర్యావరణహితమైన వనాల నిర్వహణ సులభమవుతుంది. ముఖ్యంగా మల్టీ స్టోరీ అపార్ట్మెంట్లు, ఐటీ పార్కులు, విమానాశ్రయాల వంటి భారీ నిర్మాణాలకు ఇది ఒక వరంగా మారింది.
భారత ప్రభుత్వం మౌలిక సదుపాయాల ప్రణాళికలో డిజిటల్ ట్విన్ వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు. 2026 నాటికి భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్లో సుమారు 20 శాతం ప్రధాన ప్రాజెక్టులు ఈ టెక్నాలజీని స్వీకరిస్తాయని నిపుణులు భావిస్తున్నారు. ఇది కేవలం స్మార్ట్ బిల్డింగ్స్ కోసమే కాకుండా, స్మార్ట్ సిటీల నిర్మాణంలో కూడా కీలక పాత్ర పోషిస్తోంది.
