‘ఆర్య’ ఓ మ్యాజిక్. అల్లు అర్జున్, సుకుమార్లకు మంచి టేకాఫ్ ఇచ్చిన సినిమా ఇది. నిర్మాతగా తొలి అడుగులు వేస్తున్న దిల్ రాజుకు దక్కిన గొప్ప విజయం. ఆ తరవాత ‘ఆర్య 2’ తీసినా వర్కవుట్ అవ్వలేదు. ఇప్పుడు మళ్లీ ఆర్య 3పై ఆశలు పెరుగుతున్నాయి. ఈ టైటిల్ ని ఇటీవల దిల్ రాజు రిజిస్టర్ చేయించారు. సుకుమార్ కథతో, ఓ కొత్త దర్శకుడు ఈ సినిమా తీస్తారని అన్నారు. ఆశీష్ని హీరోగా ఎంచుకొన్నారని వార్తలొచ్చాయి.
అయితే ఈ సినిమాలో హీరో ఆశీష్ కాదని దిల్ రాజు తేల్చేశారు. `నేనూ.. సుకుమార్ కలిసి పిచ్చాపాటీ మాట్లాడుకొంటుంటే ఓ ఐడియా పుట్టుకొచ్చింది. ‘ఆర్య 3’గా అది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. అందుకే ఆ టైటిల్ రిజిస్టర్ చేయించాం. సుకుమార్ లా సినిమా అంటే పిచ్చి ఉన్న దర్శకుడు ఈ ప్రాజెక్ట్ కి కావాలి. హీరో ఎవరన్నది ఇప్పుడే చెప్పలేను. కానీ ఆశీష్ కోసమే ఈ కథ తయారు చేస్తున్నాం అనేది నిజం కాదు. కథ సెట్ అయ్యాక హీరో దగ్గరకు వెళ్తాం. ప్రేమ కథల్లో ‘ఆర్య’ ఎలాగైతే ట్రెండ్ సృష్టించిందో.. అలానే ఈ కథ కూడా నిలబడిపోతుంది“ అని చెప్పుకొచ్చారు దిల్ రాజు.
సుకుమార్ లా ఓ పిచ్చితో పని చేసే దర్శకుడు కావాలంటే, ఆయన సుకుమార్ నుంచే రావాలి. సుకుమార్ దగ్గర భారీ శిష్యగణం ఉంది. ఆయన తన శిష్యులకు వరుసగా అవకాశాలు ఇస్తున్నారు. ఈ కథ కూడా తన శిష్యుడికే అప్పగించే అవకాశం ఉంది. ‘ఆర్య’ అంటే తెలుగు ప్రేక్షకులకు బన్నీనే. బన్నీని కాదని ఈ కథ మరొకరి చేతుల్లో పెట్టడం పెద్ద రిస్క్. మరి ఆ రిస్క్ ని దిల్ రాజు ఎంత తెలివిగా హ్యాండిల్ చేస్తారో చూడాలి.