తెలుగు సినిమా బీసీసీఐ… దిల్ రాజు

తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌కు దిల్ రాజు బీసీసీఐ లాంటి వార‌ని నాని చ‌మ‌త్క‌రించాడు. దానికో రీజ‌న్ ఉంది. ‘జెర్సీ’ సినిమాలో అర్జున్‌ని బీసీసీఐ స‌న్మానిస్తుంది. ఇప్పుడు జెర్సీ టీమ్‌ని దిల్ రాజు స‌న్మానించారు. అందుకే… ఈ మెచ్చుకోలు.

నాని క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం ‘జెర్సీ’. ఈసినిమా విడుద‌లై విజ‌యం సాధించింది. ఈ సంద‌ర్భంగా ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు ‘జెర్సీ’ బృందాన్ని ప్ర‌త్యేకంగా స‌న్మానించారు. ఈ కార్య‌క్రమం ఈరోజు హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా నాని మాట్లాడుతూ “ఏ సినిమా చూసినా.. ఓ ప్ర‌శ్న న‌న్ను వెంటాడుతుంటుంది. ఓ ఐదేళ్ల‌కో ప‌దేళ్ల‌కో ఈ సినిమా పాతబ‌డిపోతుందా? ఆ జ‌న‌రేష‌న్‌కి ఈ సినిమా న‌చ్చుతుందా? అని ఆలోచించేవాడ్ని. కానీ ‘జెర్సీ’ అలా కాదు. ఈ హాలు, ఈ కెమెరాలు మ‌న‌మంతా… పాత‌బ‌డిపోవొచ్చు. కానీ ‘జెర్సీ’ సినిమా మాత్రం పాత‌ప‌డిపోదు” అని ఎమోష‌న‌ల్‌గా చెప్పాడు.

ఈ సినిమాని నాని పారితోషికం తీసుకోకుండా ప‌నిచేశాడ‌ని దిల్‌రాజు అభినందించారు. ఈ క‌థ విని.. నాకు పారితోషికం వ‌ద్దు, లాభాల్లో వాటా ఇవ్వండి చాలు… అని నాని నిర్మాత‌ల్ని కోరాడ‌ట‌. ఓ మంచి క‌థ కోసం నాని చేసిన ఈ ప్ర‌య‌త్నం నాకు న‌చ్చింది, ఈ విష‌యం తెలియ‌గానే క‌ళ్ల‌వెంబ‌డి నీళ్లొచ్చాయి… అని గుర్తు చేసుకున్నారు దిల్‌రాజు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com