దిల్ రాజు ‘నో’ డైరక్ష‌న్‌..!

రామానాయుడు, అల్లు అర‌వింద్, అశ్వ‌నీద‌త్‌… ఇలా హేమాహేమీలైన నిర్మాత‌ల పేర్లు చెప్పుకొంటున్న‌ప్పుడు దిల్‌రాజు పేరు కూడా ప్ర‌స్తావించుకోవాల్సిందే. కొత్త ద‌ర్శ‌కుల్ని ప్రోత్స‌హించ‌డంలో, క‌థ‌ని న‌మ్మి సినిమా తీయ‌డంలో దిల్‌రాజు దిట్ట‌. త‌న సంస్థ పేరుని కాపాడుకొనే ప్ర‌య‌త్నంలో.. ఉత్త‌మ విలువ‌ల‌తో కూడిన సినిమాల్ని తీయ‌డంతో పాటు, క‌మ‌ర్షియ‌ల్‌గానూ భారీ విజ‌యాల్ని న‌మోదు చేసుకొన్నాడు. అయితే.. వాళ్ల‌కు లేని దిల్‌రాజుకి మాత్ర‌మే ఉన్న ఆశ.. ద‌ర్శ‌క‌త్వం. ‘ఎప్ప‌టికైనా ద‌ర్శ‌క‌త్వం చేస్తా’ అని దిల్‌రాజు త‌ర‌చూ చెబుతుండేవాడు. త‌న సినిమా వ‌ర‌కూ.. క‌థ విష‌యంలో దిల్‌రాజు స‌ల‌హాలూ సూచ‌న‌లు త‌ప్ప‌కుండా ఉంటాయి. ద‌ర్శ‌క‌త్వం చేయాలంటే ఆ ప‌రిజ్ఞానం చాలు. త‌న‌కు తాను సొంతంగా క‌థ త‌యారు చేసుకోవ‌డంలో, చేయించుకోవ‌డంలోనూ దిల్‌రాజు నేర్ప‌రిత‌నాన్ని త‌క్కువ అంచ‌నా వేయ‌లేం. సో.. దిల్ రాజు మెగా ఫోన్ ప‌ట్ట‌డం ఖాయం అనుకొన్నారంతా. అయితే…. ఆ ఆలోచ‌న విర‌మించుకొన్నాడు దిల్‌రాజు.

త‌ను భ‌విష్య‌త్తులో మెగా ఫోన్ ప‌ట్టే ఛాన్స్ లేద‌ని తేల్చి చెప్పేశాడు. త‌నతో ప‌నిచేసిన ద‌ర్శ‌కులంతా మెగాఫోన్ ప‌ట్టొద్ద‌ని హిత‌వు ప‌లికార్ట‌. దాంతోపాటు ద‌ర్శ‌కుడి క‌ష్టాల‌న్నీ తాను క‌ళ్లారా చూశాన‌ని, అందుకే మెగాఫోన్ వైపు దృష్టి పెట్ట‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకొన్నాన‌ని క్లారిటీగా చెప్పేశాడు దిల్‌రాజు. త‌న సంస్థ నుంచి ఓ సినిమా వ‌స్తే… దాదాపు ద‌ర్శ‌కుడిగానే ప‌నిచేస్తాడు దిల్‌రాజు. సో… ద‌ర్శ‌క‌త్వం అనే ఆశ ఆ రూపంలోనే తీరిపోయి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com